NRI News: ఏపీలో కూటమి విజయం.. న్యూజెర్సీలో అట్టహాసంగా సంబరాలు

ఏపీ ఎన్నికల్లో కూటమి (తెదేపా, జ‌న‌సేన‌, భాజపా) ఘన విజయంపై న్యూజెర్సీలో తెలుగు ప్రవాసులు సంబరాలు చేసుకున్నారు.

Published : 10 Jun 2024 20:15 IST

న్యూజెర్సీ: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో కూటమి (తెదేపా, జ‌న‌సేన‌, భాజపా) ఘన విజయం సాధించడంపై అమెరికాలో తెలుగు ప్రవాసుల సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. యూబ్లడ్ ఫౌండర్ డా.జగదీశ్ బాబు యలమంచిలి ఆధ్వర్యంలో న్యూజెర్సీలో కూటమి నేతలు విజయోత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. ఎన్డీయే విక్టరీ కారు ర్యాలీ క‌నువిందుగా సాగింది. ఎడిసన్ సిటీలోని జాన్సన్ పార్క్‌లో ఏర్పాటుచేసిన సభలో డా.జగదీశ్ బాబు యలమంచిలి కేకు కోశారు. సుపరిపాలన, సువర్ణాధ్యాయం దిశగా ఆంధ్ర ప్రజలు కూటమిని ఆదరించిన తీరు చరిత్రాత్మకమని పేర్కొన్నారు.

పడకేసిన అభివృద్ధి, ఆర్థిక సంక్షోభం, గాడితప్పిన పాలన, విఫలమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజకీయాలతో అంటకాగిన అధికారుల తీరుతో వైకాపా హయాంలో ఏపీ భవిష్యత్తు​ ప్రమాదంలో పడిందని.. అయితే, కూటమిని ప్రజలు ఆద‌రించి అపూర్వ విజ‌యం అందించార‌ని తెలుగు ఎన్నారైలు తెలిపారు. సైకో పాల‌న‌కు ముగింపు పలికేందుకు తెలుగు ఎన్నారైలు తీవ్రంగా కృషి చేశార‌ని, రెండేళ్ల నుంచి చేస్తున్న ప్రయత్నాలు విజ‌య‌వంత‌మ‌య్యాయ‌ని హర్షం వ్యక్తం చేశారు.

వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన న‌రేంద్ర మోదీ, ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు నాయుడు, రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్న ప‌వ‌న్ కల్యాణ్‌లకు ఈసంద‌ర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ముగ్గురు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించ‌నున్నందుకు ఆనందంగా ఉంద‌న్నారు. వేడుకల్లో దేవినేని లక్ష్మి, రవి కొల్లి, రమేశ్‌ రాయల, తెదేపా ఎన్నారై నేతలు శ్రీహరి మందాడి, రామకృష్ణ వాసిరెడ్డి, రాధాకృష్ణ నల్లమల్ల, జనసేన ఎన్నారై నాయకులు వెంకట్ సుధ, గోపీ గుర్రం, భాజపా ఎన్నారై నేత రవి అంబటి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని