బ్లూమింగ్టన్-నార్మల్‌లో వీనుల విందుగా అష్టోత్తర శత నామ సంకీర్తనార్చన

అమెరికాలోని ఇల్లినాయిస్  రాష్ట్రంలోని బ్లూమింగ్టన్ నార్మల్‌లో స్థానిక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో (హిందు టెంపుల్ ఒఫ్ బ్లూమింగ్టన్ నార్మల్) "అష్టోత్తర శత నామ సంకీర్తనార్చన" సంగీత కార్యక్రమం వీనుల విందుగా జరిగింది.

Published : 16 Oct 2022 16:06 IST

బ్లూమింగ్టన్‌: అమెరికాలోని ఇల్లినాయిస్  రాష్ట్రంలోని బ్లూమింగ్టన్ నార్మల్‌లో స్థానిక శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో (హిందు టెంపుల్ ఒఫ్ బ్లూమింగ్టన్ నార్మల్) "అష్టోత్తర శత నామ సంకీర్తనార్చన" సంగీత కార్యక్రమం వీనుల విందుగా జరిగింది. “కళ్యాణి స్కూల్ అఫ్ మ్యూజిక్” ఆధ్వర్యంలో దేవాలయ యాజమాన్య సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంగీత విద్యార్థులు అనర్గళంగా 108 సంకీర్తనలు ఆలపించి ఆహుతుల్ని పరవశింపజేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సంగీత ఝరి రాత్రి 8గంటల వరకు ఖండాంతరాలు దాటి ఓ ప్రవాహంలా సాగింది. 'కళ్యాణి స్కూల్ ఆఫ్ మ్యూజిక్' గురువు కల్యాణి అమరవాది ఆధ్వర్యంలో విద్యార్థులు స్వామికి సంకీర్తనార్చన చేస్తూ, ఆలయానికి విరాళాల్ని సేకరించేలా ప్రత్యేకించి చక్కటి ప్రణాళికతో సప్తస్వరాలకు అనుగుణంగా వివిధ గ్రూపులుగా ఏర్పడ్డారు.

భారత్‌తో పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి జూమ్‌ లింక్‌ ద్వారా కీర్తనలు ఆలపించగా.. బ్లూమింగ్టన్ నార్మల్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయ విద్యార్థులు ప్రత్యక్షంగా ఆలయానికి విచ్చేసి సంకీర్తనార్చనలో పాల్గొన్నారు. ప్రారంభ కీర్తనగా "మేదిని జీవుల కావ మేలుకోవయ్యా!" అంటూ ఆ దేవదేవుణ్ని స్మరించగా.. ఈ సంగీత ప్రవాహం ఆరు భాషలు, 72 రాగాలలో స్వరపరిచి 30మందికి పైగా వాగ్గేయకారులు (త్యాగరాజు, శ్యామాశాస్త్రి , పురందర దాసు, తాళ్ళపాక అన్నమాచార్యులు, భక్త రామదాసు మొదలైనవారు) రచించిన కీర్తనలు, వివిధ తాళాలలో 27మంది విద్యార్థులు (నాలుగేళ్ల నుంచి మొదలుకుని 30 ఏళ్ల వయసు కలిగిన కళాకారులు) ఎంతో మధురంగా తన్మయత్వంతో ఆలపించారు. చివరగా "రామచంద్రాయ జనక రాజజా మనోహరయా" అనే మంగళ హారతి కీర్తనతో ముగించారు. విశేషంగా  ప్రతి సంకీర్తన ఆలాపన తర్వాత ఒక తామర పుష్పంతో మహిళలు స్వామివారికి పుష్పమాల అల్లారు. 108 తామరపూల మాలలను కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామికి అర్చకులు అలకరించారు.

అనంతరం కల్యాణి అమరవాది "మగువల రాజుకు మంగళం " అనే మంగళ హారతి కీర్తనతో "అష్టోత్తర శత నామ సంకీర్తనార్చన" కార్యక్రమం 'షోడషోత్తర శత నామ సంకీర్తనార్చన '(116) కార్యక్రమంగా అందరినీ మంత్రముగ్దుల్ని చేసింది. ఆలయ కమిటీ అధ్యక్షులు, స్థానిక పిల్లల వైద్య నిపుణులు సంజయ్ సక్సేనా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న సంగీత కళాకారులందరికీ ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సంకీర్తనార్చనను యూట్యుబ్ ఛానల్‌లో ప్రపంచం నలుమూలల నుంచి నిరంతరం ప్రత్యక్షంగా వీక్షించేలా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి స్థానికులు నగదు రూపంలో, ఇతర భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా విరాళాలు అందజేశారు. ఈ విరాళాలను భక్తుల కోరిక మేరకు, ఆలయంలోని ఉత్సవ, మూలమూర్తుల ఆభరణాల నిమిత్తం వినియోగించనున్నట్టు ఆలయ కమిటీ వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని