NRI News: ఏపీని ఆదుకునే ఎన్నారైల‌పై ఇంత అక్క‌సా?: జ‌య‌రాం కోమ‌టి

రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయ‌కులు బెదిరింపుల‌కు పాల్పడటం అత్యంత దారుణ‌మ‌ని ప్ర‌ముఖ ప్ర‌వాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జ‌య‌రాం కోమ‌టి అన్నారు.

Published : 31 Mar 2024 22:41 IST

అమెరికా: ‘ఏ దేశ‌మేగినా ఎందుకు కాలిడినా.. పొగ‌డ‌రా నీతల్లి భూమి భారతిని’ అన్న గుర‌జాడ వారి స్ఫూర్తితో  ప్ర‌వాసాంధ్రులు.. విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధికి త‌మ వంతు క‌ర్తవ్యంగా అనేక కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తున్నారు. తమకు వీలైనంత మేరకు నిధులు సమకూరుస్తూ.. పాఠ‌శాలల్ని ద‌త్త‌త తీసుకుంటున్నారు. ప‌ల్లెల్లో వైద్య‌, ఆరోగ్య సేవ‌ల‌ను మెరుగుప‌రచడంలో కృషిచేస్తున్నారు. అంతేకాదు పన్నులు సైతం కడుతున్నారు. విద్యనందించడంతో పాటు ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న ద్వారా రాష్ట్రంలోని అనేకమంది నిరుద్యోగుల‌కు ఉపాధి, ఉద్యోగాలు క‌ల్పిస్తున్నారు. క‌రోనా కల్లోల సమయంలోనూ ప్ర‌భుత్వంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి రోగుల‌ను ఆదుకున్నారు. కష్టకాలంలో ఆప‌న్న హ‌స్తం అందించే ఎన్నారైలపై వైకాపా నాయ‌కులు తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం, బెదిరింపుల‌కు పాల్పడటం అత్యంత దారుణ‌మ‌ని ప్ర‌ముఖ ప్ర‌వాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జ‌య‌రాం కోమ‌టి అన్నారు. అధికార పార్టీ నేతల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎన్నారైల‌ను బెదిరిస్తూ బాప‌ట్ల జిల్లా వేమూరు నియోజ‌క‌వ‌ర్గం వైకాపా అభ్య‌ర్థి వ‌రికూటి అశోక్ బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను జ‌య‌రాం కోమ‌టి ఖండించారు. ఇలాంటి వ్యాఖ్య‌లు చేసి ఏపీకి అన్ని విధాలా సాయం చేస్తున్న ఎన్నారైల‌ను తీవ్రంగా అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్య‌లు స‌రికాద‌న్నారు. రాష్ట్రానికి ఎన్నారైల నుంచి అనేక విధాలుగా మేలు జరుగుతోందని, ఉద్యోగ క‌ల్ప‌న‌, ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య భ‌ద్ర‌త‌, మురికివాడల అభివృద్ది, గ్రామీణ ప్రాంతాల ద‌త్త‌త‌, విద్య‌, వైద్యం వంటి అనేక రంగాల్లో ఎన్నారైలు కృషి చేస్తోన్న విష‌యాన్ని వివ‌రించారు. అన్నింటికీమించి, రాష్ట్రానికి ఆదాయం పెంచేలా ప‌న్నులు చెల్లిస్తున్నార‌ని, ప‌రిశ్ర‌మ‌లు పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిప‌థంలో ముందుకు తీసుకువెళ్తున్నార‌ని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్య‌లు వైకాపా నేత‌లు మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

‘‘అస‌లు ఏం జ‌రిగింది? ప్రవాస భారతీయులు గత ఎన్నికల సమయంలో ఏం చేశారో నాకు తెలియదు. ఇప్పుడు ఎన్నికలకు వచ్చి, గ్రామాల్లో గొడవలు చేస్తే మాత్రం, వారు ఏ దేశాల నుంచి వచ్చారో తిరిగి అక్క డకు వెళ్లడానికి వీల్లేకుండా చేస్తాం’’ అని వరికూటి అశోక్ బాబు హెచ్చరించారు. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని అమృతలూరు మండలం కూచిపూడిలో అశోక్‌ మీడియాతో మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఒక వైపు ఎన్నికల ప్రవర్తనా నియామవళి అమల్లో ఉండగా, బరిలో నిలిచిన వైకాపా అభ్యర్థి ప్రవాస భారతీయులను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు చేయడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని జ‌య‌రాం కోమ‌టి తెలిపారు. ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్న అశోక్ బాబుపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, వేమూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూట‌మి అభ్య‌ర్థిగా మాజీ మంత్రి న‌క్కా ఆనంద‌బాబు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని