ఎన్నారైలకు RBI గుడ్‌న్యూస్‌.. విదేశాల నుంచీ బిల్‌ పేమెంట్స్‌!

Bharat Bill Payment System: భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ ద్వారా బిల్లు పేమెంట్స్‌ చేసే సౌకర్యం ఎన్నారైలకు కల్పించనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది.

Published : 05 Aug 2022 16:56 IST

ముంబయి: ఉద్యోగం కోసం దేశం కాని దేశం వెళుతుంటారు కొందరు. వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లిదండ్రులు స్వదేశంలో నివసిస్తుంటారు. వారి ఇంటి కరెంట్‌ బిల్లో, ఇంకోటో చెల్లించాలంటే విదేశాల్లో ఉండే వారికి వీలయ్యేది కాదు. దీంతో బిల్‌ పేమెంట్‌ కోసం స్వదేశంలో ఉన్న తెలిసిన వారినో, స్నేహితులనో ఆశ్రయించాల్సి వచ్చేది. ఇలాంటి వెతలు త్వరలో తొలగిపోనున్నాయి. ఎన్నారైల కోసం ఆర్‌బీఐ కొత్త సదుపాయం తీసుకొస్తోంది. భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (Bharat Bill Payment System) ద్వారా బిల్లు పేమెంట్స్‌ చేసే సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది. త్వరలో దీన్ని అందుబాటులోకి తీసుకురాననున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం ప్రకటించారు.

భారత్‌ బిల్‌ పేమెంట్స్‌ సిస్టమ్‌ ఇప్పటి వరకు భారత్‌కే పరిమితమైందని, ఇకపై దీన్ని భారత్‌ వెలుపల వినియోగించే సదుపాయం తీసుకొస్తున్నట్లు శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యులకు సంబంధించి యుటిలిటీ బిల్‌ పేమెంట్స్‌, ఎడ్యుకేషన్‌ ఫీజులు వంటివి చెల్లించేందుకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు కలిగిన ఎన్నారైలకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఆర్‌బీఐ పేర్కొంది. భారత్‌ బిల్‌పేమెంట్‌ సిస్టమ్‌లో సుమారు 20 వేల మంది బిల్లర్లు భాగస్వాములుగా ఉన్నారు. నెలకు 8 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని