NRI TDP: వచ్చే ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐలు కీలకపాత్ర పోషించాలి: కోమటి జయరాం

ఎన్టీఆర్‌ అనే మూడు అక్షరాలు తెలుగుజాతికి అపూర్వ శక్తిని అందించాయని ఎన్‌ఆర్‌ఐ తెదేపా-యూఎస్‌ఏ కోఆర్డినేటర్‌ కోమటి జయరాం అన్నారు.

Updated : 04 Dec 2022 15:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్టీఆర్‌ అనే మూడు అక్షరాలు తెలుగుజాతికి అపూర్వ శక్తిని అందించాయని ఎన్‌ఆర్‌ఐ తెదేపా-యూఎస్‌ఏ కోఆర్డినేటర్‌ కోమటి జయరాం అన్నారు. తెలుగుజాతి కీర్తిని ప్రపంచ నలుమూలలా చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్‌ఆర్‌ఐ తెదేపా ఆధ్వర్యంలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోమటి జయరాంతో పాటు తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌ మన్నవ మోహనకృష్ణ, తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీశ్‌, నాట్స్‌ మాజీ ఛైర్మన్‌ గుత్తికొండ శ్రీనివాస్‌, మిర్చియార్డ్‌ మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కోమటి జయరాం మాట్లాడుతూ ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు సంవత్సరమంతా నిర్వహించాలని పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఉత్సవాలు నిర్వహిస్తున్న ఎన్‌ఆర్‌ఐ తెదేపా-యూఎస్‌ఏ సభ్యులను ఆయన అభినందించారు. తెదేపాను స్థాపించి బడుగు, బలహీన వర్గాలకు అందులోభాగస్వామ్యం కల్పించి అభ్యుదయవాదిగా ఎన్టీఆర్‌ నిలిచారని కొనియాడారు. తెదేపా ద్వారా ప్రజలకు ఎన్నో సేవలు అందించారని గుర్తుచేశారు. ఏపీలో రానున్న ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐలు కీలకపాత్ర పోషించాలని.. తెదేపా విజయానికి కృషి చేయాలని కోరారు. 

మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ అంతటి మహోన్నత వ్యక్తిని స్మరించుకోవడం తెలుగువారి అదృష్టమన్నారు. నటుడిగా, సంక్షేమ పథకాల ప్రదాతగా దేశం మొత్తానికి ఆయన ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదంతో.. చంద్రబాబు తెలుగుజాతి అభివృద్ధి కోసం ఏవిధంగా కష్టపడ్డారో అందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న స్వార్థపూరిత రాజకీయ కుట్రలతో వ్యవస్థలు ఏరకంగా గాడితప్పుతున్నాయో చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందరం అప్రమత్తమై రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోహనకృష్ణ అన్నారు. అనంతరం ఎన్‌ఆర్‌ఐ తెదేపా టాంపా కార్యవర్గాన్ని ప్రకటించి సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని