కలిసికట్టుగా ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు ఎన్నారైల బృందం ట్రెక్కింగ్‌!

హిమాలయ పర్వత శ్రేణులు అత్యంత శీతల వాతావరణానికే కాదు.. ఎన్నో ప్రతికూలతలకు నిలయం. అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అలాంటి మంచు కొండలకు వెళ్లడం అంత ఈజీ కాదు. ప్రకృతి విసిరే సవాళ్లను తట్టుకొని నిలబడాలంటే మానసిక స్థైర్యంతో పాటు శారీరక దృఢత్వం కూడా ఎంతో అవసరం.

Updated : 02 Nov 2022 07:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హిమాలయ పర్వత శ్రేణులు అత్యంత శీతల వాతావరణానికే కాదు.. ఎన్నో ప్రతికూలతలకు నిలయం. అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అలాంటి మంచు కొండలకు వెళ్లడం అంత సులభం కాదు. ప్రకృతి విసిరే సవాళ్లను తట్టుకొని నిలబడాలంటే మానసిక స్థైర్యంతో పాటు శారీరక దృఢత్వం కూడా ఎంతో అవసరం. అలాంటి పర్వత సానువుల్లో 10 రోజుల పాటు ట్రెక్కింగ్‌ చేస్తూ తమ సాహసాన్ని చాటుకుంది మన ప్రవాసీ తెలుగు వ్యక్తుల బృందం. లండన్‌కు చెందిన  డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరిరావు నేతృత్వంలోని 23 మంది తెలుగు ట్రెక్కర్ల బృందం 5,364 మీటర్ల (17598 అడుగులు) ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (EBC)కి గత వారం ట్రెకింగ్‌ను పూర్తి చేసింది. ఏడు దేశాలకు (ఇంగ్లాండ్‌, వేల్స్‌, అమెరికా, కెనడా, యూఏఈ, ఒమన్‌, భారత్‌) చెందిన 23 మందితో కూడిన తెలుగు వ్యక్తుల బృందంలో 12మంది వైద్యులు కాగా.. 11 మంది ఐటీ నిపుణులు ఉండటం విశేషం.

డాక్టర్‌ శేషగిరి రావుకు ఇలాంటి సాహస యాత్రలు కొత్తేం కాదు. గతంలోనూ ఆయన సారథ్యంలో మౌంట్ కిలిమంజారో (టాంజానియా), మౌంట్ టౌబ్కల్ (మొరాకో), టేబుల్ మౌంటైన్‌(దక్షిణాఫ్రికా)లకు ట్రెక్కింగ్‌ విజయవంతంగా జరిగింది. అంతేకాకుండా ఆయన యూకేలోని స్కాట్‌లాండ్‌లో ప్రసిద్ధ వెస్ట్ హైలాండ్ వే, థేమ్స్ పాథ్‌తో సహా అనేక ట్రెక్‌లకు సారథ్యం వహించారు. ఇక ఈసారి చేపట్టిన ట్రెకింగ్‌ విషయానికి వస్తే.. నేపాల్‌లోని సోలోఖుంబు జిల్లా లుక్లాలో ట్రెక్కింగ్‌ను మొదలుపెట్టి ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ (EBC)నకు చేరేందుకు ఈ బృందానికి 10 రోజుల సమయం పట్టింది. ఈ ట్రిప్‌లో ప్రకృతి సోయగాలను వీక్షించడంతో పాటు అనేక అనుభూతులు పొందామంటూ తమ అనుభవాలను పంచుకున్నారిలా.. 

ఆహా.. ఎంత అందం!

‘‘దూద్‌కోషి నది ఒడ్డున అనేక కి.మీల పాటు మా ట్రెక్కింగ్‌ కొనసాగింది. మధ్యలో ఎత్తైన కాలినడక వంతెనలు దాటుకొని.. అనేక పెంపుడు జంతువుల్ని చూసుకుంటూ షెర్పా గ్రామాల్లో సుందర దృశ్యాలను వీక్షిస్తూ ముందుకు సాగాం. రాత్రుళ్లు ఆయా గ్రామస్థుల ఆతిథ్యంలో టీ హౌస్‌లలో బస చేసేవాళ్లం. దారిలో అద్భుతమైన హిమాలయ పర్వత సుందర మనోహర దృశ్యాలను 360 డిగ్రీల వీక్షణలతో చూసి పరవశించిపోయాం. బహుశా ఇంత అద్భుత దృశ్యాలు ప్రపంచంలో దేనికీ సరిపోవేమో! 800 మీటర్ల ఎత్తులో ఉండే మూడు ఎత్తైన శిఖరాలైన మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ లోట్సే, మకాలూ పర్వతాలే కాకుండా మంచు దుప్పటి పరుచుకున్న అనేక ఎత్తైన పర్వత శిఖరాలనూ వీక్షించాం. వీటితో పాటు అమా దబ్లం, తంషెర్కు, కుసుమ్‌ కగరు, కాంగ్‌ డే, నుప్ట్సే, పుమోరి, ఖుంబ్చే, ఖంగ్టే గా, తబుచె, చోలాట్సే, లోబుచె వంటి 6000 మీటర్ల ఎత్తైన పర్వతాలనూ చూశాం. హిమాలయాలు దేవతల నివాసం అని ఎందుకు అంటారో ఇప్పుడు అర్థంచేసుకోవచ్చు’’ అని పేర్కొన్నారు.

ఎంతో శ్రమ ఉన్నా.. ఆనందమే ఆనందం!

‘‘ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌(ఈబీసీ)కు ట్రెక్కింగ్‌ ప్రకృతి మార్గమే కాదు.. అక్కడి సంస్కృతిని తెలుసుకొనేందుకు కూడా మాకు దారిచూపింది. షెర్పా గ్రామాల్లో వెళ్తూ వారి జీవన విధానాలను ప్రత్యక్షంగా చూశాం. వారి సేవలను పొందడంతో పాటు వారు అందించిన రుచికరమైన ఆహారాన్ని ఆరగించి ఆ కొద్దిరోజులు ఎంతో ఆహ్లాదకరంగా గడిపాం. అయితే, లుక్లా, నామ్చే బజార్‌ ఇతర గ్రామాలకు వాహనాలు తిరిగేందుకు వీలుగా రోడ్లు లేవు.. మోటారు వాహనాల్లేవు. లుక్లా నుంచి వాహనాలు తిరిగే రోడ్డుకు చేరుకోవాలంటే మూడు నుంచి నాలుగు రోజుల పాటు కాలినడకన వెళ్లాల్సిందే. అక్కడి నుంచి నామ్చే బజార్‌కు మరో రెండు రోజులు పడుతుంది. అక్కడి రోడ్లు కేవలం నడవడానికే వీలుపడతాయి. ఇరుకైన కాలి బాటల ద్వారానే వస్తువులను జడల బర్రెలు, కంచరగాడిదల ద్వారా రవాణా చేస్తుంటారు. మాలాంటి ట్రెక్కర్లు, స్థానికులు అత్యవసర పరిస్థితుల్లో కాఠ్‌మాండూ చేరుకోవాలంటే విమానం లేదా హెలికాప్టర్‌ని ఉపయోగిస్తారు. ఈ ట్రెక్‌ ఎంతో శ్రమతో కూడినదే అయినా చుట్టూ ఉన్న అద్భుత సహజ సౌందర్యం, బృందంలోని సహచరుల పరస్పర సహకారం, వారి మధ్య ఏర్పడిన సహవాసం ఈ యాత్రను ఎంతో ఆనందదాయకంగా మార్చాయి. దీనికితోడు దేవుడు కరుణించి అనుకూల వాతావరణంతో ఆకాశం నిర్మలంగా ఉండటం, పొడి వాతావరణం మా యాత్రను పది రోజులూ దిగ్విజయంగా కొనసాగేందుకు దోహదపడింది’’

ఆ మూడురోజులు.. ఎన్నో అనుభూతుల సమ్మేళనం!

‘‘ఈ యాత్రలో భాగంగా తెంగ్‌బోచె గ్రామంలో ప్రసిద్ధిగాంచిన తెంగ్‌బోచె ఆశ్రమాన్ని సందర్శించారు. అది నేపాల్‌లోని సోలుఖుంబు ప్రాంతంలో అతిపెద్ద టిబెటన్ బౌద్ధ ఆశ్రమం. ఈ ప్రాంతంలో నివసించే షెర్పా ప్రజలు టిబెటియన్ సంతతికి చెందినవారు. టిబెటియన్ బౌద్ధమతాన్ని వారు అనుసరిస్తారు. ఈ పవిత్ర స్థలం వారి పవిత్ర మంత్రమైన  ‘ఓం మణి పద్మే ఓం’తో మార్మోగుతుంది. అలాగే, ఈ మార్గంలో మేం భారీ బుద్ధ స్థూపాలను సందర్శించాం. ఈ ట్రెక్కింగ్‌లో చివరి మూడు రోజుల పాటు మంచుదుప్పటి పరుచుకున్న పర్వత ప్రాంతాల్లోనే సాగింది. ఈ అద్భుతమైన దృశ్యాలు అనిర్వచనీయం. అక్కడి సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు కూడా సరిపోవనడంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు. అసమానమైన పర్వతాలు, మెరిసే తెల్లటి హిమనీనదాలు, రకరకాల పుష్పాలతో సువాసనలు వెదజల్లే చెట్లతో కూడిన వనాలు, విశాలమైన లోయలు, ఇరుకైన కనుమలలో ప్రవహించే నదులు, ఉవ్వెత్తున ఎగసిపడే నదులు, జంతువులు, అక్కడి ప్రజల జీవన విధానం.. ఇలా అనేక అనుభూతులతో కూడిన ఈ ట్రెకింగ్‌ ప్రయాణం మాకెంతో ప్రత్యేకంగా నిలిచింది’’

‘‘ఒకే ఒక్కరోజులో 8000 మీటర్ల ఎత్తైన మూడు పర్వత శిఖరాలను ప్రపంచంలో ఎక్కడ చూడగలం! మౌంట్ ఎవరెస్ట్, మకాలూ, మౌంట్ లోట్సే ఈ మూడు పర్వతాలను ఒకేసారి చూశాం. అలాగే, దూద్ కోషి నది పుట్టిన ప్రదేశాన్ని కూడా సందర్శించాం. ఈ నది డెంగ్‌బోచే వద్ద ఇమ్జా సరస్సు ఎవరెస్ట్ పర్వతం మంచు వల్ల ఏర్పడిన ఖుంబు హిమానీనదాల నుండి మరో ప్రవాహం సంగమం ద్వారా మొదలవుతుంది. కాంగ్‌ దే, ఖంగ్టే గా, థమ్సెర్కు, టబుచే, చోలాట్సే, లోబుచే, అమా దబ్లామ్‌ పర్వత శిఖరాలను వీక్షించాం. వీటిలో అమా దబ్లమ్‌ ప్రపంచంలోనే అత్యంత సుందరమైన పర్వత శిఖరంగా ప్రసిద్ధి గాంచింది. ఇంతకన్నా అందమైనది మరొకటి ఉంటుందంటే అంగీకరించాలనిపించదు. అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఒక దిశ నుంచి చూస్తే ఇది గరాటులా, మరోవైపు నుంచి చూస్తే ఓ పెద్ద కోన్‌లా కనబడుతుంది. హిమనీనదాలతో నిండి వెండిపూత పూసినట్టుగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది’’

ఎవరెస్ట్‌ పర్వతం అందం చూడతరమా!

అనంతరం మా బృందం తుక్లా సమీపంలోని ఝెంగ్లా పోఖోరిలోని టార్కిస్‌ సరస్సును సందర్శించింది. కాళిదాసు కుమారసంభవంలో, అల్లసాని పెద్దన మను చరిత్రలో వర్ణించిన హిమాలయ సరస్సుల్లో ఇది కూడా ఒకటి. దీంతో పాటు కల్పత్తర్‌ పర్వతం మా ట్రెక్కింగ్‌లో అత్యంత ఎత్తైన ప్రదేశం. మా బృందంలో కొందరు ఈ పర్వతాన్ని (5550 మీటర్లు; 18208 అడుగులు) అధిరోహించగలిగారు. సూర్యాస్తమయం సమయంలో పసిడి వర్ణంలో మౌంట్ ఎవరెస్ట్ అద్భుతమైన దృశ్యాలను చూసి పరవశించిపోయాం. మరుసటి రోజు ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ చేరుకొనేందుకు మేమంతా ఖింబు హిమనీనదం వైపు నడక ప్రారంభించాం. అక్కడికి చేరుకోవడమే ఓ గొప్ప అనుభూతి. ఈ ప్రాంతానికి చేరుకోవడమే అందరికీ ఓ కలలా ఉంటుంది. అక్కడ పుమోరి పర్వత సానువుల నుంచి ఓ భారీ హిమపాతం కురవడం చూశాం. ఆ సమయంలో దృశ్యాలు.. వచ్చే శబ్దాలతో ఒళ్లు పులకిస్తుంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో మాకు, హిమపాతానికి మధ్య ఓ లోయ ఉండటంతో సురక్షితంగా ఉన్నాం’’

అక్కడ ఆకలి లేదు.. నిద్రా కష్టమే!

‘‘మొత్తంగా చూస్తే, ఈ అనుభవం ఎంతో ఆహ్లాదాన్ని పంచడంతో పాటు గొప్ప అనుభూతులను మిగిల్చింది. ఇప్పటికీ ఆ అనుభవాల్లోనే తేలుతున్నట్టుగా ఉంది. ట్రెక్కింగ్‌ అలసట, శ్రమతో కూడుకున్నదైనప్పటికీ మనిషి శారీరక, మానసిక దృఢత్వానికి ఓ పరీక్షలాంటిది. రెండు రాత్రుళ్లు ట్రెకింగ్‌లో మా ఆఖరి స్టాప్‌.. 5,164 మీటర్ల ఎత్తులో ఉండే గొరెక్‌షెప్‌ అనే చిన్న గ్రామం. ఎవరెస్ట్‌కు దక్షిణాన ఉన్న చివరి గ్రామం కూడా ఇదే కావడం విశేషం. అలాగే, ఉత్తరం వైపు చైనా నియంత్రణలో ఉన్న టిబెట్‌లో ఉంటుంది. గోరెక్‌షెప్‌ గ్రామంలో మా ఆక్సిజన్‌ స్థాయిలు 67% నుంచి 80% దాకా ఉన్నాయి. ఆకలి పోయింది. సబ్‌ జీరో ఉష్ణోగ్రతలు ఉండటంతో ఇక్కడ నిద్రపోవడం కూడా కష్టమే అయింది. కానీ, మేం పడిన శ్రమ, భరించిన కష్టాలు అక్కడి ప్రకృతి సౌందర్యాలను చూసి పొందిన అనుభూతుల్లో కొట్టుకుపోయాయనే చెప్పాలి. మాలో కొందరికి ఇది బాధాకరమైన అనుభవాన్ని ఇస్తే.. మరికొందరికి అధివాస్తవికం.. ఇంకొందరికి ఆధ్యాత్మిక అనుభవ సారం. ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌నకు చేరుకున్న మా బృందంలో ఇద్దరు మహిళలతో పాటు మొత్తం 23 మంది. శరీరం సహకరించకపోయినా అద్భుతమైన హిమాలయ పర్వత దృశ్యాలు మా మనస్సుకు ఉత్తేజాన్ని ఇచ్చాయి. నేపాలీ గైడ్‌ల అపూర్వమైన మద్దతుతో అందరం చివరకు ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు దిగ్విజయంగా చేరుకున్నాం’’

అందరికీ థాంక్స్‌!

ఈ బృందానికి డాక్టర్‌ శేషగిరిరావు లీడర్‌గా ఉండగా.. ఇంగ్లాండ్‌కు చెందిన వైద్యులు నరసింహారావు, గోపీనాథ్‌, కిశోర్‌, వేణు, వివేక్‌, వీరశేఖర, వేల్స్‌ నుంచి డాక్టర్‌ తిరుపతయ్య, యూఏఈ నుంచి విజయ్‌, మోహన్‌, అమెరికా నుంచి అనితా రాణి, ఉమాదేవి ఉన్నారు. ఐటీ ప్రొఫెషనల్స్‌ రాఘవ్‌ రాజు, మనోజ్‌ (ఒమన్‌) దీపు, అనిల్‌, మేరళి, దిలీప్‌ (భారత్‌), వంశీ (కెనడా), మధు, శ్రీనివాస్‌, అరుణ్‌, సతీశ్‌ (అమెరికా) ఉన్నారు. ఈ యాత్రలో తమకు సహకరించిన హిమాలయన్‌ ట్రెక్కింగ్‌ ఏజెంట్‌ సూర్య శ్రేష్ఠ, గైడ్‌ బాబు గురాంగ్‌, అసిస్టెంట్‌ గైడ్‌లు రేషమ్‌, ప్రకాశ్‌, సూర్య, భీమ్‌, చక్ర, ఘూర్కా, లుక్లా పరిసరాల గ్రామాల నుంచి తమంగ్ పోర్టర్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని