Qatar TDP: కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్‌లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు

తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్‌లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు.

Published : 02 Apr 2024 16:47 IST

ఖతార్‌: తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్‌లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. పార్టీ నేతలతో పాటు తెదేపా శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పవిత్ర రంజాన్ మాసం కావడంతో పెద్దఎత్తున ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో మొదలైన ఈ కార్యక్రమంలో దివంగత నేత ఎన్టీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం, పుష్ఫాంజలి ఘటించి నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ తొలి రాజకీయ ఉపన్యాసం ‘తెలుగు జనతాకు వందనం.. తెలుగు యువతకు అభినందనం .. తెలుగు మమతకు అభివాదం .. తెలుగు జాతికి సుభాభినందనం’’ డైలాగ్‌తో ఆయన్ను స్క్రీన్‌పై చూడగానే ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా తన్మయత్వం చెందారు. ఆయన 1982లో ఇచ్చిన పిలుపునకు యావత్‌ తెలుగుజాతి ఏకతాటిపైకి కదిలివచ్చి, పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తుకు తీసుకొచ్చింది. దీనికి జూమ్‌ వేదికగా హాజరైన పలువురు నేతలు సభనుద్దేశించి ప్రసంగించారు.

మాచర్ల కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. ఖతార్ తెలుగుదేశం నాయకులు, శ్రేణులు ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. ఈ పోరాటంలో ప్రవాసాంధ్రులంతా భాగస్వామ్యం కావాలని, కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడం అందరూ కర్తవ్యంగా భావించాలని విజ్ఞప్తి చేశారు. తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రసంగిస్తూ.. ఖతార్ తెలుగుదేశం ప్రతీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోందన్నారు. నిస్వార్థంగా పార్టీపై అభిమానం, తెలుగు నేలపై ప్రేమతో ప్రవాసీయులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు.  ఖతార్ తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన ఖతార్‌ పర్యటన, సమావేశంలో పార్టీ శ్రేణులు చూపించిన ప్రేమాభిమానాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఖతార్‌లో తెదేపా 42వ ఆవిర్భావ దినోత్సవం పండగ వాతావరణాన్ని తలపించిందని, పార్టీ జెండాలు, తోరణాలు, ఎన్టీఆర్‌, చంద్రబాబు, లోకేశ్‌ ఫ్లెక్సీలతో సభావేదిక అలంకరణ కనులపండువగా ఉందని తేజస్వీ పొడపాటి అన్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో కీలకమని, అప్రమత్తంగా లేకపోతే రాక్షసుడు రాష్ట్రాన్ని, యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తాడని హెచ్చరించారు. 

ఖతార్ తెదేపా నేతలు, శ్రేణులు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించారని బబ్బూరి వెంగళరావు (బీవీఆర్‌), ఖతార్ తెదేపా అధ్యక్షులు గొట్టిపాటి రమణయ్య అన్నారు. ఏపీలో అరాచకం, దుర్మార్గం, కక్షసాధింపు తప్ప.. అసలు పాలనే లేదనడానికి బీవీఆర్‌ అనుభవమే నిదర్శనమని చెప్పుకొచ్చారు. పార్టీ గెలుపునకు సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఖతార్ తెదేపా ఉపాధ్యక్షులు మద్దిపాటి నరేష్ మాట్లాడుతూ.. అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెదేపా ముఖ్య ఉద్దేశాన్ని శ్రోతలకు వివరించారు. పార్టీ గెలుపునకు కృషి చేయాలని మీ గ్రామాల్లో స్నేహితులు, తెలిసినవారందరి సాయంతో ఆంధ్రులు ఎక్కడ నివసిస్తున్నా మే 13న జరిగే ఎన్నికల పోలింగ్‌లో పాల్గొని కూటమి అభ్యర్థులకు ఓటు వేసేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన తెదేపాపై తమకున్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరని షేక్ మహమ్మద్ యాసిన్, మహమ్మద్ బాషా అన్నారు. ఉర్దూ యూనివర్సిటీని స్థాపించటంతోపాటు ఉర్దూను సెకండ్ లాంగ్వేజ్‌ చేసిన ఘనత తెదేపాదేనని గుర్తు చేసుకున్నారు. రంజాన్‌ తోఫాలు, మక్కా పర్యటనకు ఆర్థిక సహాయం, ఉన్నతవిద్యకు పెద్దపీట వేసిన తెదేపాతోనే ముస్లిం సోదరులు ప్రయాణిస్తారని, ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా, భాజపాను బూచిగా చూపి తమను తెదేపాకు దూరం చేయలేరన్నారు. తమ ప్రాణం ఉన్నంతవరకు తెదేపాతోనే నడుస్తామని, కూటమి గెలుపు కోసం కృషి చేస్తామని        తెలిపారు. ముస్లిం సోదరులంతా ఆ దిశగా నడవాలని పిలుపునిచ్చారు. 

ఖతార్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పొనుగుమాటి రవి, ప్రోగ్రామ్స్ ఆర్గనైజర్ దాసరి రమేష్, జీసీసీ కౌన్సిల్ సభ్యుడు మల్లిరెడ్డి సత్యనారాయణ, సీనియర్ నేత శాంతయ్య యలమంచిలి, బోండ్లపాటి రజినీ, మాగులూరి రవీంద్ర, కోశాధికారి విక్రమ్ సుఖవాసి, అనిల్ మలసాని, సింగరాజు సంతోష్, ఎం.ఎన్‌.ఎం.నాయుడు, కళ్యాణ్, రావుల సాయిమోహన్ తదితరులు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల బలోపేతం కోసం, వారికి రాజ్యాధికారాన్ని చేరువ చేసేందుకు పెట్టిన పార్టీ తెదేపా అన్నారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి ఆ పార్టీకి రెండు కళ్లు అని, 1983లోనే కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో పేదలకు ఆసరా ఇచ్చిన ఘనత తమ పార్టీకే చెందుతుందన్నారు.  ఆంధ్ర రాష్ట్ర భావి పౌరుల భవిష్యత్తు కోసం, పుట్టిన నేల కోసం, తెలుగుతల్లి రుణం తీర్చుకొనే సమయం ఆసన్నమైందని, ప్రతిఒక్కరూ తమ నియోజకవర్గాల్లో కూటమి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రోజుకు కనీసం మూడు, నాలుగు గంటల సమయాన్ని కూటమి గెలుపు కోసం వెచ్చించాలని, మే 13న అందరూ ఓటు వేసేలా ప్రోత్సహించాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావాలన్నా, రాష్ట్రానికి తలమానికం అమరావతి కల కార్యరూపం దాల్చాలన్నా, రాష్ట్రాభివృద్ధి తిరిగి గాడిన పడాలన్నా, పక్క రాష్ట్రాలతో పోటీ పడాలన్నా, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలన్నా కూటమి గెలుపుతో ‘చంద్రబాబు అనే నేను..’ అనే మాట తెలుగు నేలపై మరోసారి ప్రతిధ్వనించాలన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలే తెలుగు ప్రజల ఆశలకు చివరి అవకాశమని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని