కాలిఫోర్నియాలో శంకర ఐ ఫౌండేషన్‌ ‘ఫండ్‌ రైజింగ్‌ డిన్నర్‌’కు విశేష స్పందన

శంకర ఐ ఫౌండేషన్‌(Sankara Eye Foundation)కు నిధుల సేకరణలో భాగంగా వార్షిక ఫండ్ రైజింగ్ డిన్నర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించిన ఈ డిన్నర్‌కు దాదాపు 300 మంది ఎన్నారైలు హాజరయ్యారు.

Published : 16 Nov 2022 17:56 IST

బే ఏరియా: శంకర ఐ ఫౌండేషన్‌(Sankara Eye Foundation)కు నిధుల సేకరణలో భాగంగా వార్షిక ఫండ్ రైజింగ్ డిన్నర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించిన ఈ డిన్నర్‌కు దాదాపు 300 మంది ఎన్నారైలు హాజరయ్యారు. తొలుత శంకర ఐ ఫౌండేషన్‌ బోర్డు సభ్యులు వెంకట్ మద్దిపాటి అతిథులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శంకర ఐ ఫౌండేషన్‌ ఇండియా వ్యవస్థాపకులు, పద్మశ్రీ డాక్టర్‌ రమణి హాజరయ్యారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. చిన్నారులకు కంటి చూపును ప్రసాదించడం ద్వారా వారి భవిష్యత్తు బాగుంటుందన్నారు. అలాగే, మధ్య వయసులో ఉన్న వారికి చూపును అందిస్తే వారు తమ కుటుంబాన్ని పోషించుకోగలుగుతారని.. వృద్ధులకు చూపు అందించడం ద్వారా ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోగలుగుతారని తెలిపారు. దీనివల్ల ఆయా కుటుంబాలు బాగుపడతాయని.. ఉత్పాదకత పెరిగి దేశం పురోగమిస్తుందన్నారు.

అనంతరం శంకర ఐ ఫౌండేషన్‌ ఛైర్మెన్ మురళీ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్‌ నిర్వహిస్తోన్న ఆస్పత్రుల ద్వారా దాదాపు 25లక్షల మందికి పైగా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసి చూపును ప్రసాదించిందన్నారు. భారత్‌ నుంచి వచ్చిన భరత్‌, కౌశిక్‌, సుందర్‌ ఆసుపత్రుల పనితీరు, నిర్వహణ గురించి ఈ కార్యక్రమంలో వివరించారు. కాలిఫోర్నియాలో నిర్వహించిన ఫండ్‌ రైజింగ్ డిన్నర్‌ ద్వారా దాదాపు 6లక్షల డాలర్లు సేకరించినట్టు శంకర ఐ ఫౌండేషన్‌ బోర్డు మెంబర్ వెంకట్ మద్దిపాటి వెల్లడించారు. ఈ నిధులను భారత్‌లో కంటి ఆసుపత్రి నిర్మాణానికి, ఉచిత కంటి ఆపరేషన్ల కోసం వినియోగిస్తామని తెలిపారు. 2030 నాటికి ఏటా పది లక్షల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించడమే తమ లక్ష్యమన్నారు. అలాగే, గుంటూరు, వారణాసి, కాన్పూర్‌లలో ఆస్పత్రుల విస్తరణ కోసం మరింత మంది దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. 

హైదరాబాద్‌లో ఆసుపత్రి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ సుదీర్‌ చెముడుగుంట తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు ఆసుపత్రి సేవలు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ప్రస్తుతం ఉన్న 300 పడకల ఆసుపత్రి ద్వారా దాదాపు 30వేల కంటి ఆపరేషన్లు చేస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్రంలో మరింత మందికి సేవలందించేందుకు గుంటూరు ఆసుపత్రిని 600 పడకలకు విస్తరించి ఏటా 60వేల మందికి వైద్యం అందించడమే లక్ష్యంగా కృషిచేస్తున్నట్టు తెలిపారు. ఈ డిన్నర్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శంకర ఐ ఫౌండేషన్‌కు విరాళాలు ఇచ్చి మద్దతుగా నిలుస్తున్న వారిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. వెంకట్ డోకిపర్తి, అంజు దేశాయ్, రామదాసు పులి, సుధీర్ వేముల, సత్య తోట, రాజ్  తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని