ఘనంగా సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య ప్రథమ వార్షికోత్సవం

సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య ప్రథమ వార్షికోత్సవాన్ని సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో ఘనంగా నిర్వహించారు. తెలుగువారి ఐక్యత...

Published : 27 Sep 2022 22:33 IST

దమ్మామ్‌: సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య ప్రథమ వార్షికోత్సవాన్ని సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో ఘనంగా నిర్వహించారు. తెలుగువారి ఐక్యత, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని, తెలుగువారు కష్టాల్లో ఉంటే వారికి అండగా ఉండాలనే సంకల్పంతో సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య ఏర్పాటైంది. సెప్టెంబర్ 23న ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు.  సౌదీ అరేబియాలో గత ౩౦ ఏళ్లుగా సామాజిక సేవలందిస్తున్న జహీర్ బేగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించారు. ఖురాన్ పఠనం, మహిళా బృందం ఆలపించిన తెలుగుతల్లి పాటతో వార్షికోత్సవాన్ని ప్రారంభించారు.

సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య అధ్యక్షుడు నాగశేఖర్ మాట్లాడుతూ.. తమ సంస్థ లక్ష్యాలు, విలువలు, అందించిన సేవలను సభ్యులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సంస్థ ఉద్యోగుల ద్వారా ప్రవాసాంధ్రుల బీమా శిక్షణ విభాగాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమాఖ్య కార్యవర్గ సభ్యులు పారేపల్లి ఎన్ వీబీ కిషోర్, వరప్రసాద్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ ఛైర్మన్ మేడపాటి వెంకట్ మాట్లాడుతూ.. బీమా, ఇతర సేవా కార్యక్రమాలను వివరించారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు (పాటలు, నృత్యాలు, నాటికలు) ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా చిన్నారుల ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.  కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు సమాఖ్య సభ్యులు ప్రశంసా పత్రాలు, ట్రోఫీలు అందించారు.

వార్షికోత్సవ నిర్వహణకు సహకరించిన కార్యవర్గ సభ్యులకు, ముఖ్య అతిథులకు సమాఖ్య సంయుక్త కార్యదర్శి కోనేరు ఉమామహేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. సమాఖ్య ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో తమ సంస్థ మరెన్నో వినోద, సేవా కార్యక్రమాలతో ఇక్కడి తెలుగు వారందరికీ అండగా ఉంటుందని కోనేరు ఉమామహేశ్వరరావు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని