భక్తిరసరమ్యంగా ‘రుషిపీఠం’ అంతర్జాతీయ శివపద గీతాలాపన పోటీలు

రుషిపీఠం ఆధ్వర్యంలో మూడో శివపద అంతర్జాతీయ పాటల పోటీలు  మే 12,13,14, వ తేదీల్లో జూమ్‌ వేదికగా వర్చువల్‌గా నిర్వహించారు "శివపదాంకిత" వాణీ, గుండ్లాపల్లి బృందం.

Published : 16 May 2023 16:42 IST

సింగపూర్‌: మహా దేవుడైన సదాశివునికి భావ స్వరాంజలులు శివపదాలు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ దాదాపు 1100లకు పైగా శివపద గీతాలు అద్భుతంగా రచించారు. రుషిపీఠం ఆధ్వర్యంలో మూడో శివపద అంతర్జాతీయ పాటల పోటీలు  మే 12,13,14, వ తేదీల్లో జూమ్‌ వేదికగా వర్చువల్‌గా నిర్వహించారు "శివపదాంకిత" వాణీ, గుండ్లాపల్లి బృందం. నాగసంపత్ వారణాసి, శ్రీకాంత్ వడ్లమాని , శ్రీనివాస్ మేడూరుల సహకారంతో నిర్వహించారు. శివపద గీతాల పోటీలను సాంతం ఆలకించిన షణ్ముఖ శర్మ ఆనందం వ్యక్తంచేశారు. ఇంత మంది చిన్నారులు, పెద్దలూ అందరూ భావానికి ప్రాధాన్యమిస్తూ వందల కొద్దీ శివపదాలను ఆలపించడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ఈ పోటీలు ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు గ్లోబల్ శివపదం టీమ్‌, న్యాయనిర్ణేతలను అభినందించి ఆశీస్సులు అందజేశారు. ఋషిపీఠం తరఫున పూర్ణ సహకారాలు అందించినందుకు మారేపల్లి సూర్యనారాయణ, అదే విధంగా విద్యుత్ అంతరాయాలు ఉన్నా, కార్యక్రమంలో ఎటువంటి అంతరాయం రాకుండా మెరుగైన సాంకేతిక సహకారం అందించిన తోలేటి వెంకట పవన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

ఐదు ఖండాల్లోని పలు దేశాల నుంచి దాదాపు 300 మంది  ఔత్సాహికులు ఈ పాటల పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలకు 17 మంది ప్రఖ్యాత  సంగీత గురువులు  న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వీరిలో భారతదేశం నుండి శారదా సుబ్రమణియమ్ , తులసి విశ్వనాథ్, పద్మ త్యాగరాజన్, పెద్దాడ సూర్యకుమారి,  విష్ణుప్రియ భరధ్వాజ్, విద్యా భారతి, రాధికా కృష్ణ, శ్రీదేవి దేవులపల్లి, లక్ష్మి మూర్తి, మోహన కృష్ణ, ప్రతిమ; అమెరికా నుంచి  పావని మల్లాజ్యోస్యుల, లక్ష్మి కొలవెన్ను, అనీల కుమార్ గరిమెళ్ళ , లలిత రాంపల్లి, ప్రభల శ్రీనివాస్, సింగపూర్ నుంచి శేషు కుమారి యడవల్లి న్యాయనిర్ణేతలుగా ఉన్నారు. వయసుల వారీగా ఉపమన్యు, మార్కండేయ, భక్త కన్నప్ప, నత్కీర, పుష్పదంత అనే ఐదు భాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు.  ఈ పోటీల్లో ప్రవాసీయులైన అనేకమంది చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో స్పష్టమైన ఉచ్ఛారణతో శృతి, లయబద్ధంగా శివపదాలను వీనులవిందుగా ఆలపించారు. ఈ సందర్భంగా వారికి న్యాయనిర్ణేతలు తగిన సూచనలతో పాటు ప్రోత్సాహం అందించడం ద్వారా ఈ కార్యక్రమం మరింత ఉత్సాహంగా కొనసాగించారు. ఈ విధంగా పోటీల్లో పాల్గొనడం వల్ల పిల్లలకు సంప్రదాయం, సత్ప్రవర్తన అలవడుతుందని కొందరు న్యాయనిర్ణేతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాటలు ఆలపించేవారితో పాటు శ్రోతలూ అంతా శివభక్తిసారంలో తన్మయులయ్యారు. ఆద్యంతం రసరమ్యంగా కొనసాగిన ఈ కార్యక్రమం భారతదేశంలో శుక్రవారం ప్రారంభమై ఆదివారంతో ముగిసింది. వచ్చే ఏడాది పోటీల కోసం ఇప్పటి నుంచే వేచి చూస్తామని న్యాయనిర్ణేతలు పేర్కొన్నారు. ఇలాంటి శివపద భక్తిభావనలో ఓలలాడే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు గాయకులు, నిర్వాహకులు, న్యాయనిర్ణేతలు, వీక్షకులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని