ఘనంగా సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Updated : 29 Mar 2023 00:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లక్కిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఈ వేడుకలను నిర్వహించారు. పద్మ విభూషణ్ డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ముఖ్య అతిథి, భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్‌ టీవీ నాగేంద్రప్రసాద్ విశిష్ట అతిథి, మిల్పిటాస్ నగర మేయర్ కార్మెన్ మోంటానో ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు. బ్రహ్మశ్రీ మారేపల్లి నాగ వేంకటశాస్త్రి వేదపఠనంతో కార్యక్రమం మొదలలైంది. పంచాంగ పఠనంలో కొత్త ఏడాదిలో రాశి ఫలాల గురించి ఆయన వివరించారు. అనంతరం కిరణ్ ప్రభ సంచాలకత్వంలో ప్రాంతీయ తెలుగు కవుల స్వీయ కవితాపఠనం నిర్వహించారు. గత 21 సంవత్సరాలుగా సిలికానాంధ్ర చేస్తున్న ఉగాది కవి సమ్మేళనాల  దృశ్యమాలికను ప్రదర్శించారు.  పద్మావతి ‘ఐ యామ్‌ కన్‌ఫ్యూజ్‌డ్‌’,  మధుప్రఖ్య ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’ కవితలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించాయి. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ కూచిబొట్ల ఆనంద్‌, డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఇటు సాహిత్యం, అటు రాజకీయం రెండింటిని ఒక ఒరలో అలవోకగా అమర్చుకున్న అరుదైన వ్యక్తిగా యార్లగడ్డను అభివర్ణించారు. మిల్పిటాస్ నగర మేయర్, వైస్ మేయర్‌కు ఇతర నగరపాలక సంస్థ సభ్యులు నగరం తరపున యూనివర్సిటీకి ప్రశంసా పత్రం అందజేశారు.  

‘గళ మురళి’గా పేరొందిన డాక్టర్‌ కొమరవోలు శివప్రసాద్ (ఈలపాట శివప్రసాద్) సంగీత కచేరి సభికులను మంత్రముగ్ధులను చేసింది. కేవలం ఈలతో త్యాగరాయ, అన్నమాచార్య కీర్తనలు అక్కడివారిని ఆశ్చర్యచకితులను చేశాయి. స్థానిక వయోలిన్ వాద్యకారులు మాడుగుల శశిధర్ సహకారం అందించారు. గిన్నిస్ రికార్డ్ సాధించిన వీణాపాణి  తాను ప్రయోగం చేసిన 72 మేళకర్త రాగాల సూక్ష్మీకరణ రూపమైన స్వర బీజాక్షరిని ప్రేక్షకులకు పరిచయం చేశారు.  అమోఘ్ కూచిబొట్ల మృదంగం, ప్రమితి కల్లూరి వీణ సహకారం అందించారు. 230 మంది పిల్లలు 5 విభాగాల్లో నిర్వంచిన భాషావికాస పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో విజేతలైన వారికి అతిథులు బహుమతులు అందజేశారు. వేడుకలను విజయవంతం చేయడానికి కృషి చేసిన సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు కందుల సాయి, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర, తనారి గిరి, కోట్ని శ్రీరామ్‌కు కార్యదర్శి వేదాంతం మహతి కృతజ్ఞతలు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని