Sita Ramam: న్యూజెర్సీలో ‘సీతారామం’ చిత్ర బృందం సందడి

ఇటీవ‌ల విడుద‌లై తెలుగు రాష్ట్రాల‌తోపాటు అమెరికాలోనూ సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా సీతారామం. తాజాగా ఈ చిత్ర బృందం అమెరికాలోని న్యూజెర్సీలో సందడి చేసింది.

Updated : 02 Nov 2022 23:46 IST

న్యూజెర్సీ: ఇటీవ‌ల విడుద‌లై తెలుగు రాష్ట్రాల‌తోపాటు అమెరికాలోనూ సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా సీతారామం. తాజాగా ఈ చిత్ర బృందం అమెరికాలోని న్యూజెర్సీలో సందడి చేసింది. ఉమానియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్‌, సాంస్కృతిక కార్యక్రమాల్లో చిత్ర బృందం పాల్గొంది. సినిమా హీరో దుల్కర్‌ సల్మాన్, హీరోయిన్ మృణాళ్ ఠాకూర్‌తో పాటు దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాత స్వప్నదత్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.ఇంతమంది తెలుగువారిని ఒకేచోట కలవడం సంతోషంగా ఉందని, ఈ అద్భుత ఆవకాశం కల్పించిన ఉమానియా టీమ్‌కి ఈ సంద‌ర్భంగా దుల్కర్‌ సల్మాన్‌  కృతజ్ఞతలు తెలిపారు. యాంకర్‌ ఉద‌య‌భాను ఎంతో ఆహ్లాదంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

దాదాపు 600 మందికిపైగా ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నారైల మ‌ధ్య చిత్రయూనిట్‌ కేక్ క‌ట్ చేశారు. ఈ సందర్భంగా UBlood app గురించి యాప్ ఫౌండర్ జై యలమంచిలి తెలియజేశారు. రక్తదానం గురించి, అలాగే రక్త గ్రహీతల పూర్తి సమాచారం కలిగిన యాప్‌ని సృష్టించిన జై యలమంచిలిని హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌లు అభినందించారు. కార్యక్రమానికి హాజరైన యువత ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయడానికి యాంకర్‌ ఉదయభాను వారికి ఒక స్పెష‌ల్ టాస్క్ ఇచ్చారు. హీరో దుల్కర్‌ సల్మాన్, హీరోయిన్ మృణాళ్ ఠాకూర్‌కు ల‌వ్ లెట‌ర్ రాసి ఇంప్రెస్ చేయాలని టాస్క్‌ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారుల నృత్యాలు, మహిళల ఫ్యాషన్ షో అందరినీ అలరించాయి. ఈ చిత్రంలోని ఒక పాట‌ను పాడిన‌ చిన్నారి ఈషాన్విని డైరెక్టర్‌ హ‌ను రాఘ‌వ‌పూడి అభినందించారు. 

క‌న్నుల పండ‌వ‌గా జ‌రిగిన ఈకార్యక్రమానికి యూ-బ్లడ్‌(U-BLOOD),  జై స్వరాజ్య (JAI SWARAJYA), జేఎస్‌డబ్ల్యూ టీవీ (JSW TV), బాలాజీ ప్ల‌వ‌ర్స్, కోర‌ల్ బీడ్స్ గ్రాండ్ స్పాన్సర్‌ చేశాయి. మీట్ అండ్ గ్రీట్‌ కార్యక్రమం వేడుకగా జరగడానికి సహకరించిన స్పాన్సర్స్‌కి, ఆహూతులకు ఉమానియా బృందం త‌రుఫున ల‌క్ష్మీ దేవినేని ధన్యవాదాలు తెలిపారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని