బర్మింగ్‌హామ్‌లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు

ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

Published : 21 Apr 2024 20:50 IST

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. యూకేలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 2,500 మంది విచ్చేసి  భక్తి శ్రద్ధలతో రాములవారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. ఏప్రిల్‌ 20న ది న్యూ బింగ్లి హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం సంప్రోక్షణతో మొదలైంది. అనంతరం ఉత్సవ మూర్తులకు పల్లకి సేవ నిర్వహించారు. 29 మంది కళాకారులతో కోలాటం నృత్యం, చిన్నారులు, భక్తజనం జైశ్రీరాం నినాదాల మధ్య పల్లకి సేవ కన్నుల పండువగా సాగింది. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన కాషాయ రంగులోని కాటన్‌ చీరలతో కళాకారుల కోలాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. 

హైదరాబాద్‌ నుంచి విచ్చేసిన అర్చకులు ముకురాల సిద్ధార్థ శర్మతో పాటు, స్థానిక అర్చకులైన మారుతి శ్రీనివాస్‌, శివ గోరుతో కలిసి కల్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌ నుంచి వచ్చిన బ్రహ్మశ్రీ చంద్రశేఖర్‌ శాస్త్రి తనయుడు మల్లాది రామానంద శాస్త్రి తనదైన వ్యాఖ్యానం ఆకట్టుకుంది. అనంతరం గజేంద్ర మోక్షంపై ఆయన ప్రవచనం ఇచ్చారు. ప్రసాదం వితరణ, భజనలతో అంతా సందడి వాతావరణం నెలకొంది. ఈ వేడుకకు విచ్చేసిన అతిథులకు తెలుగు వంటకాలతో పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. అలాగే, భారత్‌, యూకే నుంచి విచ్చేసిన పలువురు నృత్యకారులు కూచిపూడి, భరతనాట్యం, డ్యాన్సులతో అలరించారు. ఈ వేడుకలను జయప్రదం చేసిన ప్రతిఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని