America: ఘనంగా టాల్‌ వరల్డ్‌ కైండ్‌నెస్‌ డే వేడుకలు

టచ్‌ఏ (TAL) లైఫ్‌ నిర్వహించిన వరల్డ్‌ కైండ్‌నెస్‌ డే (TAL World Kindness Day) అమెరికాలోని శాంతా క్లారా కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు వాటికి పరిష్కార మార్గాన్ని సూచించేలా చర్చా కార్యక్రమాలు నిర్వహించారు.

Updated : 24 Nov 2022 00:16 IST

అమెరికా: టచ్‌ఏలైఫ్‌ (TAL) నిర్వహించిన వరల్డ్‌ కైండ్‌నెస్‌ డే ( World Kindness Day) అమెరికాలోని శాంతా క్లారా కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు వాటికి పరిష్కార మార్గాన్ని సూచించేలా చర్చా కార్యక్రమాలు కొనసాగాయి. పేదరికం, ఆరోగ్యం, నిరక్షరాస్యత వంటి అంశాలపై లోతుగా చర్చించారు. ప్రముఖ విద్యావేత్త మేనియల్‌ సెరాపియో, రచయిత్రి యూలిన్‌ లీ వంటి నిపుణులు చర్చల్లో పాల్గొన్నారు. కన్వెన్షన్‌ సెంటర్‌లో మరో వేదికపై కీనోట్‌ ప్రసంగాలు కొనసాగాయి. క్రిస్‌ సేలం, టెడ్‌ లెంపర్ట్‌, ఫ్రెడ్‌ టోవర్‌ వంటి ప్రపంచ స్థాయి నాయకుల జీవితం, అనుభవాలు, అభిప్రాయాలను పంచుకున్నారు. 

టాల్‌ వరల్డ్‌ కైండ్‌నెస్‌ డే సందర్భంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు స్టాల్స్‌ ఏర్పాటు చేసుకునే సౌలభ్యం కల్పించింది టచ్‌ఏ లైఫ్‌ సంస్థ. ప్రథమ్‌, అక్షయ పాత్రతో పాటు పలు సేవాసంస్థలు ఈ స్టాల్స్‌ ద్వారా తమ లక్ష్యాలను వివరించాయి. యువతను సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తీర్చిదిద్దే బూట్‌ క్యాంప్ వరల్డ్‌ కైండ్‌నెస్‌ డే ముఖ్య ఆకర్షణగా నిలిచింది. విజ్జి సూర్యదేవర, కాత్యాయని వంటి నిపుణులు యువతను సామాజిక ఆవిష్కర్తగా మార్చే నైపుణ్యాలను అందించారు. టాల్‌ హీర్‌ (TAL Hero) అవార్డులు వరల్డ్‌ కైండ్‌నెస్‌ డే కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా నిలిచాయి. తమ సేవతో, మంచి మనసుతో సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను అందించారు. కొవిడ్‌ సమయంలో అసాధారణమైన సాయం అందించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త రవి పులి ఈ అవార్డును అందుకున్న వారిలో ఉన్నారు. టాల్‌ వరల్డ్‌ కైండ్‌నెస్‌ డే సందర్భంగా 12 గంటల పాటు నృత్య సంగీత కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. దేశ విదేశాల కళలతో పాటు సాయంత్రం జరిగిన కాన్సర్ట్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. ప్రముఖ గాయకులు హేమచంద్ర, వైష్ణవి, రేణు కుమార్, సుమంగళి ఈ కాన్సర్ట్‌లో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని  వీక్షించేందుకు వందల మంది ప్రేక్షకులు కన్వెన్షన్ సెంటర్‌కు తరలివచ్చారు.

సెనెటర్ డేవ్ కోర్టిస్, ఇండియా కాన్సులేట్ జనరల్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్, శాంతా క్లారా కౌన్సిల్ సభ్యులు రాజ్ చాహల్, శాంతా క్లారా మేయర్ లిసా గిల్మోర్, శాంతా క్లారా కౌన్సిల్ మెంబర్ కతి వాతనబి, కౌన్సిల్ సభ్యులు లిండా సెల్, డబ్లిన్ స్పెషల్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ అరుణ్ గోయల్, శాన్ రామన్ వైస్ మేయర్ శ్రీధర్ వేరోస్, హేవార్డ్ కౌన్సిల్ సభ్యులు ఐషా వాహబ్, శాంతా క్లారా కౌంటీ బోర్డు అఫ్ ఎడ్యుకేషన్ ట్రస్టీ పాటీ కర్టెసీ, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు జయరాం కోమటి, రామిరెడ్డి, శ్రీని మాదాల, కుమార్ శ్రీపాదం, ప్రసాద్ దాసరి, సిలికాన్ ఆంధ్ర ఛైర్మన్ ఆనంద్ కూచిబొట్ల, వైస్ ఛైర్మన్ దిలీప్ కొండిపర్తి, స్థానిక ప్రముఖ నాయకులు కిరణ్ ప్రభ, రమేష్ తంగెళ్లపల్లి తదితరులు  కార్యక్రమానికి విచ్చేశారు. మానవత్వాన్ని పంచేలా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచనే అపూర్వమని ప్రశంసించారు. టాల్‌ వరల్డ్‌ కైండ్‌నెస్‌ డేను రూపొందించిన టచ్ ఏ లైఫ్ వ్యవస్థాపకులు సాయి గుండవల్లి, వీణ గుండవల్లి, తేజ్, త్రిషలను పలువురు అభినందించారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఇతరులకు సాయం చేస్తే లోకం మారిపోతుందనే సందేశంతో ఈ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని