TANA: ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విజ్ఞాన వికాసంపై తానా ప్రపంచ సాహిత్యవేదిక సదస్సు

తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది.

Updated : 01 Apr 2024 23:37 IST

డాలస్: తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా 66వ సాహిత్య సమావేశం ఘనంగా జరిగింది. ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది. తానా ప్రపంచ సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విజ్ఞానశాస్త్రంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న ప్రముఖులు పాల్గొంటున్న ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమంటూ అతిథులందరినీ ఆహ్వానిస్తూ సభను ప్రారంభించారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. ‘‘ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఖగోళశాస్త్రం, గణితశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, ఆయుర్వేదశాస్త్రం, వృక్షశాస్త్రం, శిల్పశాస్త్రం, శబ్దశాస్త్రం, కాలశాస్త్రం లాంటి అనేక శాస్త్రాలకు పుట్టినిల్లు అఖండ భారతదేశం. ఎంతోమంది వీరులు, శూరులు, శాస్త్రవేత్తలు, పండితులకు నిలయమై, నలంద, తక్షశిలల లాంటి విశ్వవిద్యాలయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించి ఒక గొప్ప విజ్ఞాన ఖనిగా విరాజిల్లిన ఘనచరిత్ర కలిగిన భారతీయ మూలాలపై ఇంకా ఎంతో పరిశోధన జరగాల్సి ఉంది’’ అన్నారు. 
  
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పూర్వ సంచాలకులు, చంద్రయాన్-3లో కీలక శాస్త్రవేత్తగా ఉన్న డా. జోశ్యుల అచ్యుత కమలాకర్ ప్రసంగించారు. ఇప్పటివరకు ఇస్రో సాగించిన ప్రయోగాలు, సాధించిన విజయాలు, గత సంవత్సరం ప్రపంచంలోనే మొదటిసారిగా చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా భారత్ ఉండడం, చంద్రునిపై నీరు ఉన్నదని మొదటిసారిగా కనుగొన్న దేశం మనదే కావడం, అతి తక్కువ వ్యయంతో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్ష పరిశోధనలలో ప్రపంచంలోనే మొదటి 5 దేశాలలో ఒకటిగా భారతదేశం సత్తా చాటడం వంటివి ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయాలన్నారు. 30 నిమిషాలకు పైగా సాగిన తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఇస్రో త్వరలో చేపట్టబోయే అనేక ప్రయోగాలతో సహా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. విశిష్ట అతిథిగా హాజరైన ప్రఖ్యాత రచయిత, సైన్సు ప్రచారానికి విశేష కృషి చేస్తున్న ఆకాశవాణి పూర్వ ఉన్నతోద్యోగి డా. నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ ‘‘మన ప్రాచీన భారతీయ వాంగ్మయ విషయాలను సరిగా అర్థం చేసుకోవడం, వాటిని సరైన అవగాహనతో ప్రపంచంలోని అనేక ఇతర భాషల్లోకి అనువదించాల్సిన ఆవశ్యకత, ముఖ్యంగా విజ్ఞానశాస్త్ర పరివ్యాప్తికి ప్రభుత్వాలు, సంస్థలు కృషి చేసి యువతరంలో చైతన్యం తీసుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది’’ అని అభిప్రాయపడ్డారు. ప్రముఖ రచయిత, విశ్రాంత అధ్యాపకులు, అనేక సైన్స్ సదస్సులు, సైన్స్ ప్రసంగాలు చేసిన డా. ప్రతాప్ కౌటిల్య తన ప్రసంగంలో బాల్యం నుంచే విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి కలిగేలా చిన్న చిన్న ప్రయోగాలతో అభిరుచి కల్పిస్తే, దేశం గర్వించదగ్గ భావి శాస్త్రవేత్తలుగా తయారవుతారన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ క్రింది వీడియోలో చూడొచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని