వాషింగ్టన్‌ డీసీలో ఘనంగా దసరా ఉత్సవాలు

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికాలో (తానా) ఆధ్వర్యంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్మాణంలో

Updated : 28 Sep 2022 20:52 IST

వాషింగ్టన్‌‌: తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ఆధ్వర్యంలో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్మాణంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తానా పూర్వ అధ్యక్షుడు సతీశ్‌ వేమన అధ్యక్షతన మేడసాని మోహన్ దసరా ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడసాని మాట్లాడుతూ.. మహాభారతంలోని అనేక సంఘటనలు ప్రస్తుత సమాజానికి వర్తిస్తాయన్నారు. భారతంలోని పాత్రల ద్వారా అనేక అంశాలు మన నిత్య జీవితంలో ప్రతిబింబిస్తాయన్నారు. ఆధ్యాత్మికత అంటే మతం కాదని.. అదో గొప్ప నాగరికత, జీవన హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమమని పేర్కొన్నారు. భారత దేశ సంస్కృతి, నాగరికత అతి ప్రాచీనమైనవని మేడసాని అన్నారు.

 గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ‘‘అష్టావధానంలోని మాధుర్యాన్ని మేడసాని ప్రపంచానికి చాటి చెప్పారు. తెలుగులో అష్టావధాన కళను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అవధాన ప్రక్రియతో సాహితీక్రతువు నిర్వహించారు. అక్షర సేద్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేశారు. అక్షరాన్ని ఆయుధంగా మలచి సాహితీ జగత్తును శాసించారు’’ అని అన్నారు. తానా పూర్వ అధ్యక్షుడు సతీశ్‌ వేమన మాట్లాడుతూ.. ‘‘మేడసాని చేసిన ప్రసంగాన్ని చిన్నారులు  సైతం శ్రద్ధగా విన్నారు. ఎక్కడా విసుగు, విరామం లేకుండా కొన్ని గంటలపాటు ఆయన ప్రసంగించగలరు. అష్టావధానంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన సాంగత్యంలో ఈ పవిత్ర  కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వ్యవస్థాపకులు రావిపాటి జనార్దన్ మాట్లాడుతూ.. ‘‘లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నిర్మాణానికి సుమారు రూ.120 కోట్లకుపైగా ఖర్చవుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న అనేకమంది ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్నారు. దేవస్థానం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం మరింత సుందరంగా రూపుదిద్దుకుంటుంది. హిందువులు ఎక్కువగా నివసిస్తున్న ఈ ప్రాంతంలో దేవస్థానం నిర్మాణం ద్వారా భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాను మాగులూరి, ధూళిపాళ్ల వీరనారాయణ, రమేష్ అవిరినేని, సీతారామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రావిపాటి జనార్దన్ దంపతులు, సతీశ్‌ వేమన, మన్నవ సుబ్బారావులు కలిసి మేడసాని మోహన్‌ను సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని