TANA: ‘తానా’ నామినేషన్ల ఘట్టం పూర్తి.. ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి!

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘తానా’ ఎన్నికల (TANA Elections)  నామినేషన్ల ఘట్టం నేటితో పూర్తయింది. అన్ని పదవులకూ రెండు వర్గాలు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

Published : 23 Feb 2023 15:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘తానా’ ఎన్నికల (TANA Elections)  నామినేషన్ల ఘట్టం నేటితో పూర్తయింది. అన్ని పదవులకూ రెండు వర్గాలు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవికి మిచిగాన్‌లో నివసించే శ్రీనివాస గోగినేని, వర్జీనియాలో ఉండే నరేన్‌ కొడాలి లాంటి ఉద్ధండులు పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నికలపై ఆసక్తి మరింత పెరిగింది. 4 బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌, 29 ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కమిటీ, 7 తానా ఫౌండేషన్‌ ట్రస్టీ.. ఇలా మొత్తం 40 పదవులకు బలీయమైన ఈ రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. రెండు వర్గాలూ అమెరికాలోని 50 రాష్ట్రాల్లోని తానా సభ్యులను జల్లెడపట్టి మరీ ఎంపిక చేసి ఎన్నికల బరిలో నిలిపినట్లు తెలుస్తోంది. అధ్యక్ష అభ్యర్థుల ప్యానెళ్లకు అనుభవం కలిగిన మహిళలు, యువతతో కూడిన టీమ్స్‌ సమకూరడంతో ఎన్నికల సరళి, ఫలితాలపై గతంలో ఎన్నడూ లేనివిధంగా చర్చలు సాగుతున్నాయి.

అధ్యక్ష పదవికి పోటీపడుతున్న శ్రీనివాస గోగినేని సీనియర్‌ తానా నాయకుడి ఉన్నారు. గతంలో తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన గుర్తింపు ఆయనకుంది. 2015లో డెట్రాయిట్‌ తానా కాన్ఫరెన్స్‌కు సెక్రటరీగానూ గోగినేని పనిచేశారు. దీనికారణంగా ఎంతోమందితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలను కలిగి ఉన్నారు. సంస్కరణలాభిలాషిగా గుర్తింపు పొందిన ఆయన.. గతంలో రెండుసార్లు తానా ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అయితే ఈసారి బలమైన వర్గం దన్ను, పూర్తి ప్యానెల్‌తో ముందుకు రావడంతో ఎన్నికలపై ఆసక్తి పెరిగింది. శ్రీనివాస గోగినేని ప్యానెల్‌ టీంకు తదుపరి అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు, మాజీ అధ్యక్షుడు జయ్‌ తాళ్లూరితో పాటు పలువురి పెద్దలు మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు నరేన్‌ కొడాలి కూడా అధ్యక్షుడిగా బరిలో ఉన్నారు. ఆయన కూడా తానాలో సీనియర్‌ నాయకుడు. గతంలో బోర్డు ఛైర్మన్‌గానూ విజయంతంగా పనిచేశారు. అంతేకాకుండా 2019 వాషింగ్టన్‌ డీసీ కాన్ఫరెన్స్‌కు ఆయన ఛైర్మన్‌గా సేవలందించారు. వృత్తిరీత్యా ప్రొఫెసర్‌ కావడంతో గత ఎన్నికల్లో పూర్తి ప్యానెల్‌తో గట్టి పోటీ ఇచ్చిన కారణంగా వచ్చిన గుర్తింపుతో ఎంతోమందితో నరేన్‌కు ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయి. గత ఎన్నికలు పూర్తయినప్పటి నుంచే తిరిగి బరిలో ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లలో ఆయన నిమగ్నమై ఉన్నారు. నరేన్‌ ప్యానెల్‌ టీంకు తానా ప్రస్తుత అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, మాజీ అధ్యక్షులు గంగాధర్‌ నాదెళ్ల, సతీష్‌ వేమనతో పాటు మరికొంతమంది మద్దతు ఉన్నట్లు సమాచారం.

గతకొంతకాలంగా వివిధ కారణాలతో తానాలోని కార్యవర్గాలు, నాయకుల మధ్య పరిమితికి మించి వర్గ వైషమ్యాలు పెరిగాయి. దీంతో ఇబ్బందికర వాతావరణం ఉండటంతో ఎన్నికలు ఏకగ్రీవంగా లేదా సామరస్యంగా  జరపాలని పలువురు కోరుతున్నారు. దీనికోసం తానా మాజీ అధ్యక్షులు జయరాం కోమటి ఇప్పటికే పలు దఫాలుగా ఇరు వర్గాలతో రాజీకి యత్నించినా చేసినా సఫలం కాలేదు. అయినప్పటికీ ఎన్నికలు నివారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని