TANA: విరాళాల సేకరణలో తానా సరికొత్త రికార్డు

విరాళాల సేకరణలో తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సరికొత్త రికార్డు సృష్టించింది. తానా 23వ మహాసభల సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని రికార్డు స్థాయిలో విరాళాలు ప్రకటించారు.

Updated : 07 Nov 2022 21:46 IST

అమెరికా: విరాళాల సేకరణలో తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సరికొత్త రికార్డు సృష్టించింది. తానా 23వ మహాసభల సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని రికార్డు స్థాయిలో విరాళాలు ప్రకటించారు. గత 45 ఏళ్ల చరిత్రలో మహాసభల విరాళాల సేకరణలో ఇదే సరికొత్త రికార్డు అని తానా ప్రతినిధులు పేర్కొన్నారు. 2021లో నిర్వహించాల్సిన తానా మహా సభలు కరోనా మహమ్మారి ప్రభావంతో వాయిదా పడటంతో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఫిలడెల్ఫియా నగరంలో వచ్చే ఏడాది జులై 7 నుంచి 9 వరకు జరగనున్నాయి. అయితే, వీటి సన్నహాక కార్యక్రమాల్లో భాగంగా శనివారం పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వర్మిన్‌స్టర్‌ నగరంలో ఫ్యూజ్ బాంక్వెట్‌ హాలులో విరాళాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కన్వీనర్‌ పొట్లూరి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విరాళాల సేకరణ విందులో దాదాపు 800 మందికి పైగా ప్రవాసీయులు పాల్గొని మునుపెన్నడూ లేనంతగా దాదాపు రూ.48 కోట్లు (6మిలియన్‌ డాలర్లు) విరాళాలను ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి హాజరై విరాళాలు ప్రకటించిన అందరికీ తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ(EC), బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌(BoD), ఫౌండేషన్‌ సభ్యులను, మాజీ అధ్యక్షులు, ఇతర కమిటీ సభ్యులను పరిచయం చేసి వారు సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. తానా సభ్యులు, వాలంటీర్లు, దాతలు సంఘం అభివృద్ధికి చేసిన కృషిని, సమాజానికి చేసిన సేవలను అభినందించారు. 23వ తానా మహాసభల ప్రాముఖ్యతను సవివరంగా తెలిపారు. ప్రతి ఒక్క దాతను పరిచయం చేశారు. ప్రవాసీయుల ఆనందోత్సాహాలు, కరతాళధ్వనుల మధ్య నిధుల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ప్రతిష్టాత్మక తానా మహాసభలు దాదాపు నాలుగేళ్ల తర్వాత నిర్వహిస్తున్నారు. అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు నేతృత్వంలోని తానా కార్యవర్గం గత పదహారు నెలలుగా చేసిన సేవలు, చేపట్టిన వినూత్న కార్యక్రమాలు ప్రవాస భారతీయుల్లో  23వ తానా మహాసభల పట్ల ఆసక్తిని పెంచడంతో విరాళాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిదని మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి తెలిపారు. విరాళాల కార్యక్రమ నిర్వహణకు సహకరించిన పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్, డెక్కన్ స్పైస్ గోవర్దన్ బొబ్బా, జగదీశ్ యలమంచిలి, వాలంటీర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని