సెప్టెంబర్‌ 24న తానా అంతర్జాతీయ కవయిత్రుల సమ్మేళనం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 24న కవయిత్రుల సమ్మేళనం నిర్వహించనున్నారు. ‘నారీ- సాహిత్య భేరి’ పేరిట అంతర్జాతీయ కవయిత్రుల సమ్మేళనం జరగనుంది.

Updated : 20 Sep 2023 21:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 24న కవయిత్రుల సమ్మేళనం నిర్వహించనున్నారు. ‘నారీ- సాహిత్య భేరి’ పేరిట నిర్వహించే అంతర్జాతీయ కవయిత్రుల సమ్మేళనానికి నారీ- సాహిత్య భేరి పేరిట నిర్వహించే అంతర్జాతీయ కవయిత్రుల సమ్మేళనానికి గుంటూరు ఖతార్‌లో నివసిస్తున్న ప్రముఖ రచయిత్రి డా.వేంకట మాధవీ లలిత జినుగును ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. తానా నిర్వహించే ఈ మహత్తర కార్యక్రమంలో కవిత్వం వినిపించేందుకు తనకు విశిష్టమైన స్థానాన్ని కల్పించినందుకు గాను ఆమె తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

(డా. వేంకట మాధవీ లలిత)

దాదాపు 14గంటల పాటు నిర్విరామంగా కొనసాగనున్న ఈ సాహిత్య సమ్మేళనంలో భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాలకు చెందిన ప్రముఖ తెలుగు కవయిత్రులు, రచయిత్రులు పాల్గొననున్నారు. వీరితో పాటు ప్రముఖ మహిళలు సైతం హాజరుకానున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలం వేదికగా జరిగే ఈ కార్యక్రమం 10కి పైగా మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. యూప్‌ టీవీ ద్వారా యూరోపియన్ దేశాలు, అమెరికా వంటి దేశాల్లో, ఈటీవీ భారత్, మన టీవీ, తెలుగు వన్, తానా అధికారిక యూట్యూబ్, ఫేస్‌బుక్‌ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇలాంటి ప్రత్యేక కార్యక్రమానికి తమను ఎంపిక చేసినందుకు మాధవీ లలిత హర్షం వ్యక్తం చేశారు. డా. వేంకట మాధవీ లలిత జినుగు ప్రజారోగ్యంలో పీహెచ్‌డీ చేశారు. తాత, తండ్రుల  పరంపరగా వచ్చిన సంగీత సాహిత్య అభిరుచితో ఆమె ఛందోబద్ధమైన కవిత్వం, వచన కవిత్వం మాత్రమే కాకుండా కర్ణాటక సంగీతం (గాత్రం, వీణ) తదితర ప్రావీణ్యాలతో అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలుగు భాషపై ప్రత్యేక మక్కువ చాటుతూ, భావి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. గుంటూరుకు చెందిన డా.మాధవి గుంటూరు, హైదరాబాద్‌లో అధ్యాపకురాలిగా విధులు నిర్వహించి, ప్రస్తుతం ప్లానింగ్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ అథారిటీ- ఖతార్‌లో పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు.

అలాగే, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన  ప్రముఖ రచయిత్రి వి.పద్మావతిని ఈ సమ్మేళనానికి ప్రత్యేక అతిథిగా తానా ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో తన కవిత్వం వినిపించేలా తనకు విశిష్టమైన స్థానాన్ని కల్పించినందుకు గాను ఆమె తానా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. యటపాక మండలంలో ప్రభుత్వ కార్యదర్శిగా సేవలందిస్తోన్న పద్మావతి అనేక వచన కవితలు, పాటలు రచించారు. రచయిత్రిగా, గాయనిగా ప్రసిద్ధిగాంచారు. సామాజిక సేవలోనూ ముఖ్య భూమిక పోషిస్తూ అనేకమంది కవులను ప్రోత్సహిస్తున్నారు. పద్మావతికి తానా ద్వారా ఇంత మంచి గుర్తింపు రావడం పట్ల అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలువురు పెద్దలు, కవి పండితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని