Updated : 15 Jul 2022 16:05 IST

తెలుగు భాషకు ప్రవాసులు ప్రాముఖ్యతనివ్వడం ప్రసంశనీయం: తనికెళ్ళ భరణి

డాలస్, టెక్సాస్: ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు తెలుగు భాష నేర్పే క్రమం, తెలుగు భాష, సాహిత్యాలకిచ్చే ప్రాముఖ్యం ప్రసంశనీయమని ప్రముఖ సినీ రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి అన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ‘తనికెళ్ళ భరణితో ముఖాముఖి’ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాన్ టెక్స్) సహకారంతో ఇర్వింగ్‌లోని మైత్రీస్ బాంక్వెట్ హాల్‌ ఇందుకు వేదికైంది. తానా డాలస్, ఫోర్ట్ వర్త్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన సభకు విచ్చేసిన భాషాభిమానులకు, ముఖ్య అతిథి తనికెళ్ళ భరణికి స్వాగతం పలికారు. డా.నల్లూరి ప్రసాద్ భరణికి పుష్పగుచ్ఛం యిచ్చి ఆహ్వానం పలికారు.

తానా పూర్వాధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘భరణి తన వృత్తి జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు, ఒడిదొడుకులు, కష్ట సుఖాలు చూశారు. వీటన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. అందుకే ఎవరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండి, తన మూలాలను మర్చిపోలేదు. తాను నడిచి వచ్చిన దారులను తరచూ తడిమి చూసుకునే గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి. దాదాపు 800కి పైగా చిత్రాలలో విభిన్నమైన పాత్రలలో, వైవిధ్యభరితమైన నటనతో మూడు సార్లు నంది పురస్కారాలతో సహా అనేక గౌరవాలు పొందారు’ అంటూ  ముఖ్య అతిథి భరణిని సభకు పరిచయం చేశారు.

అనంతరం వేదికను అలకరించిన తనికెళ్ళ భరణి దాదాపు రెండున్నర గంటలకు పైగా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు ఓర్పుగా, నేర్పుగా, వినోదాత్మకంగా సమాధానాలిచ్చారు. ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు తెలుగు భాష నేర్పే క్రమం, తెలుగు భాష, సాహిత్యాలకిచ్చే ప్రాముఖ్యం ప్రసంశనీయమన్నారు. అమెరికా నుంచి భారతదేశం వచ్చి తెలుగు నేర్చుకుని, అవలీలగా అవధానాలు చేయగలిగే స్థాయికి చేరుకున్న యువకుడు, ఆస్టిన్ నగరవాసి అవధాని గన్నవరం లలిత్ ఆదిత్య భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. తెలుగు భాష పరిరక్షణ, పరివ్యాప్తి కోసం తనవంతు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ తాను సిద్ధంగా ఉన్నానని, ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సన్నిహిత మిత్రులు, తానా పూర్వాధ్యక్షులు డా.తోటకూర ప్రసాద్‌కు తానా, టాంటెక్స్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. భరణి ఇటీవలే స్వయంగా రచించిన ‘శ్రీకాళహస్తి మహత్యం’, ‘కన్నప్ప కథ’, బి.వి.ఎస్ శాస్త్రి రచించగా తాను వెలువరించిన ‘భోగలింగ శతకం’ నుంచి కొన్ని పద్యాలను శ్రావ్యంగా ఆలపించి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా తనికెళ్ళ భరణిని ‘బహుముఖ కళావల్లభ’ అనే బిరుదుతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమం విజయవంతమవడానికి ఆర్థిక, హార్దిక సహకారం అందించిన లోకేష్ నాయుడు కొణిదల, డా. ప్రసాద్ నల్లూరి, గిరి గోరంట్ల, వెంకట్ బొమ్మా, సతీష్ మండువ, కుమార్ నందిగం, కృష్ణమోహన్ దాసరి, రవీంద్ర చిట్టూరి, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, చలపతి కొండ్రగుంట లకు, మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్ యాజమాన్యానికి, ప్రసారమాధ్యమాలకు, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘానికి, తానా ఆహ్వానాన్ని మన్నించి సభకు విచ్చేసిన ముఖ్య అతిథి తనికెళ్ళ భరణికి, భాషాభిమానులకు తానా డాలస్, ఫోర్ట్ వర్త్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

చివరిగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి మాట్లాడుతూ.. తెలుగు భాష, సాహిత్య వికాసానికి తానాతో కలసి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి తమ సంస్థ ఎల్లప్పుడూ సిద్ధమేనంటూ, సభకు విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమం అనంతరం తనికెళ్ళ భరణి ఇర్వింగ్ పట్టణంలోని  మహాత్మా గాంధీ స్మారకస్థలిని దర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.


Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని