కువైట్‌లో ఘనంగా తెదేపా ఆవిర్భావ వేడుకలు

తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కువైట్‌లో ఎన్నారైలు నిర్వహించారు. భారీ కేకు ఏర్పాటు చేసి సంబరాలు చేసుకున్నారు.

Published : 30 Mar 2023 17:11 IST

కువైట్‌: తెలుగు దేశం పార్టీ 41వ ఆవిర్భావ వేడుకలు కువైట్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మార్చి 29న కువైట్‌లోని హవల్లి ప్రాంతంలోని ఎన్నారై తెదేపా కువైట్‌ కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాల్లో పార్టీ నేతలు, అభిమానులు, కార్యకరక్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గల్ఫ్‌ ఎంపవర్‌మెంట్‌ కోఆర్డినేటర్‌ కుదరవల్లి సుధాకర్‌ రావు మాట్లాడుతూ.. అన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పార్టీని స్థాపించారన్నారు. తెలుగు రాష్ట్రంలో పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించడమే ధ్యేయంగా పాలన కొనసాగించారన్నారు. రూ.2లకే కిలో బియ్యం ఇచ్చి పేదలకు కడుపు నిండా అన్నం పెట్టారని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ అమలుచేశారన్నారు.  ఏడేళ్ల పాలనలో నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.

ఆ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తన 14 ఏళ్ల పాలనలో అటు ఉమ్మడి రాష్ట్రంలో, ఇటు నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో తీసుకెళ్లారని అన్నారు. విజన్‌ 2020ను తీసుకొచ్చి ఐటీ రంగాన్ని ప్రగతిపథంలో నడిపించారని ప్రశంసించారు. తద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు వస్తున్నాయని చెప్పారు. బీసీల సంక్షేమానికి ఎన్టీఆర్‌, చంద్రబాబు పెద్దపీట వేశారన్నారు.  ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ కువైట్‌ కార్యవర్గం ప్రధాన కార్యదర్శి వేగి వెంకటేశ్‌ నాయుడు, కోశాధికారి నరసింహనాయుడు,  అహ్మది గవర్నరేట్ కోఆర్డినేటర్ ఈడ్పుగంటి దుర్గా ప్రసాద్, మైనార్టీ నాయకుడు చాన్ బాషా, బీసీ విభాగం అధ్యక్షుడు రమణ యాదవ్, తెదేపా నాయకులు చుండు బాలరెడ్డయ్య, గూదే శంకర్, చిన్న రాజు, నరసింహులు, శివ మద్దిపట్ల, సురేష్, సూర్యనారాయణ, తిరుపతి నాగేశ్వర్, తదితరులు పాల్గొని తమ సందేశాన్ని వినిపించారు. అనంతరం కేక్ కట్‌ చేసి ఒకరికొకరు తెదేపా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని