ఆస్ట్రేలియాలో ‘‘తెలుగు పలుకు’’కు మూడు వసంతాలు.. చందమామ ప్రారంభం

ఆస్ట్రేలియాలో తెలుగు వెలుగుల్ని ప్రసరింపజేస్తూ.. సాహితీ సౌరభాల్ని పంచుతోన్న తెలుగు పలుకు ముద్రణ మాస పత్రికకు మూడు వసంతాలు పూర్తయ్యాయి.

Published : 28 Oct 2022 16:32 IST

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో తెలుగు వెలుగుల్ని ప్రసరింపజేస్తూ.. సాహితీ సౌరభాల్ని పంచుతోన్న తెలుగు పలుకు ముద్రణ మాస పత్రికకు మూడు వసంతాలు పూర్తయ్యాయి. ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు పాఠకులను పత్రికను చేరవేయాలనే ఆలోచన నుంచే మూడేళ్ల క్రితం ‘‘తెలుగు పలుకు’’కు పునాది పడింది. మూడేళ్ల క్రితం దసరా పండుగతో, ఆస్ట్రేలియా తెలుగు లోగిళ్ళల్లో తెలుగు పాఠకులను పలకరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ మాసానికి మూడేళ్లు పూర్తి చేసుకొని నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టింది. అప్పటివరకు (ఇప్పుడూ) భారతదేశం వెలుపల ఒక ముద్రణ మాసపత్రిక లేకపోవడం, ప్రఖ్యాత సాహితీమూర్తులతో పాటు ఔత్సాహికులు తెలుగుపలుకు వేదికగా పాఠకుల్ని అలరించడంతో ఆస్ట్రేలియా తెలుగు పాఠకుల హృదయాల్లో ఈ పత్రికకు సుస్థిర స్థానం దక్కింది.  

స్థానిక చిత్రకారులు వేసిన ముఖ చిత్రం.. పత్రిక తెరిచాక ఆరు నుంచి అరవయ్యేళ్ల వయసు కలిగిన పాఠకుల్ని చదివించేలా తీర్చిదిద్దడం, స్థానిక ఆస్ట్రేలియా రచయితలు, ఆస్ట్రేలియా ఆధారిత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో తమ పత్రిక వ్యాప్తికి మరింత దోహదం చేసిందని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా పత్రికకు అనుబంధంగా సంవత్సర పంచాంగం, వినాయక వ్రతకల్పము వంటి అప్పుడప్పుడూ ఉచిత కానుకలు ఇవ్వడం పాఠకులను మరింత ఆకట్టుకుంటున్నాయని పేర్కొంది. పాఠకుల కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా స్థానిక సంస్థల ఆదరణ, ఉత్సాహం వల్లే ఇప్పుడు తెలుగుపలుకు యాజమాన్యం స్థానిక వార్తల కోసం telugupaluku.netను, పాఠకులకు వ్యాపార రాయితీల కోసం offers.telugupaluku.netను, పిల్లల కోసం ఆస్ట్రేలియా చందమామను కూడా ప్రవేశపెట్టి ప్రపంచంలోనే తొలి ప్రవాస తెలుగు ద్విపత్రికను తీసుకొచ్చేందుకు సహాయపడిందని వ్యవస్థాపక సంపాదకులు శ్రీనివాస్‌ గొలగాని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని