
బైడెన్‌కు అధికారాన్ని అప్పగిస్తా: ట్రంప్
ఓటమిని అంగీకరించిన అగ్రరాజ్య అధ్యక్షుడు
వాషింగ్టన్: అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల వివాదం సద్దుమణిగింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ పదేపదే ఆరోపణలు చేస్తూ వస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తన ఓటమిని అంగీకరించారు. తదుపరి అధ్యక్షుడు బైడెన్‌కు అధికారాన్ని అప్పగిస్తానని ప్రకటించారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ గెలుపును ఆ దేశ కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు) ధ్రువీకరించిన కాసేపటికే ట్రంప్ ఈ ప్రకటన చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
‘ఇప్పటికీ అధ్యక్ష ఎన్నికల ఫలితాలతో నేను పూర్తిగా విభేదిస్తున్నా. అయినా కూడా నిబంధల ప్రకారం.. జనవరి 20న అధికార మార్పిడికి పూర్తిగా సహకరిస్తా. అయితే ఎప్పటిలాగే ఫలితాలపై మా పోరాటం కొనసాగుతుంది. అధ్యక్ష చరిత్రలో ఇది నా మొదటి పర్యాయానికి ముగింపు కావొచ్చు.. కానీ అమెరికా తిరిగి తన పూర్వ వైభవాన్ని సాధించేందుకు మేం చేసే పోరాటానికి ఇది ఆరంభం’ అని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు.ఈ ప్రకటన ద్వారా 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానంటూ ట్రంప్ పరోక్షంగా తెలిపినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు పోటీ చేసిన జో బైడెన్, కమలా హారీస్ విజయాన్ని ధ్రువీకరిస్తూ అమెరికా కాంగ్రెస్ నేడు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జనవరి 20న బైడెన్ అధ్యక్షుడిగా.. హారిస్ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనూ క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి దిగారు. దీంతో వీరిని అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. బాష్పవాయువు ప్రయోగించారు. ఈ క్రమంలో క్యాపిటల్ భవనం వద్ద గంటల తరబడి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
క్యాపిటల్ భవనంపై దాడిని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. అటు సొంత పార్టీ నుంచి కూడా ట్రంప్‌నకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ట్రంప్‌ను అధ్యక్ష పదవిని నుంచే దించే అవకాశాలపై కేబినెట్ చర్చలు జరుపుతున్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజా ప్రకటన చేయడం గమనార్హం.
ఇవీ చదవండి..