అర్హులకు ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యం..: ప్రొఫెసర్‌ లింబాద్రి

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, తెలంగాణ ఉన్నతవిద్య సెక్రటరీ కరుణకు ప్రవాస తెలంగాణ వాసులు విందు ఇచ్చారు. 

Published : 10 May 2023 21:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, తెలంగాణ ఉన్నత విద్య కార్యదర్శి వాకాటి కరుణకు ప్రవాస తెలంగాణ వాసులు తేనీటి విందు ఇచ్చారు. బ్రిటన్ తెలంగాణ వాసుల ప్రత్యేక ఆహ్వానం మేరకు వీరిద్దరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నత విద్యలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతోన్న సవాళ్లు, ఈ విభాగంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ‘‘ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం 2014లోని నిబంధనల ప్రకారం 1988 ఏపీ ఉన్నత విద్యా మండలి(APSCHE) స్వీకరణ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్‌ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ఏర్పాటయ్యింది. ఉన్నత విద్యా సంస్థలను నియంత్రించడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది.  తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థల సంఖ్యను విస్తరించడంపై  ప్రభుత్వం దృష్టి సారించింది. ఉన్నత విద్యకు పెరుగుతోన్న ఆదరణ‌ను దృష్టిలో ఉంచుకొని అనేక కొత్త కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వృత్తిపరమైన సంస్థల్ని నెలకొల్పారు’’ అని లింబాద్రి వివరించారు.

‘‘డిగ్రీ కళాశాలల్లో డేటా సైన్సెస్‌లో మూడేళ్ల బీఎస్సీ, బిజినెస్ అనలిటిక్స్‌లో బీకామ్ లాంటి కొత్త కోర్సులను ప్రారంభించి గ్రామీణ యువతకు ఉద్యోగ కల్పనలో దోహదపడుతుంది. విద్యార్థుల ఉపాధిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది.  విద్యార్థుల్లో పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించడం, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన రిటైల్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, ఇ-కామర్స్‌కు సంబంధించిన కోర్సులను రూపకల్పన చేస్తున్నాం.చదువుతున్న సమయంలోనే విద్యార్థులకు స్టైఫండ్ అందేలా రుపకల్పన చేస్తున్నాం. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం వివిధ స్కాలర్‌షిప్‌లు, ఆర్థిక సహాయ పథకాలను అందిస్తోంది. అర్హులైన విద్యార్థులకు ఉన్నత విద్యను పొందేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’అని లింబాద్రి తెలిపారు.

‘‘విద్యా ప్రమాణాలను నిర్వహించడం,  ఎప్పటికప్పుడు వాటిని మెరుగుపరిచేందుకు అక్రిడిటేషన్, మూల్యాంకన పద్ధతుల్ని వినియోగిస్తున్నాం. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తాజా పరిశీలన ప్రకారం.. తెలంగాణలోని ఆరు రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా నమోదైంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజినీరింగ్, మెడిసిన్ మినహా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరిన మహిళల సంఖ్య పురుషులతో పోలిస్తే 14,000 పైగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న స్కాలర్‌షిప్‌లు, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ వంటి సౌకర్యాలు... ఉన్నత విద్యను అభ్యసించే మహిళల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం. ఉన్నత విద్యలో ఏడేళ్ల క్రితం ఎక్కువగా ఉన్న లింగ వ్యత్యాసాన్ని తగ్గించగలిగాం’’ అని వెల్లడించారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యా వ్యవస్థలో రాష్ట్రాల సూచనలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(NEP) తీసుకురావడంతో దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఓ ప్రశ్నకు బదులుగా లింబాద్రి చెప్పారు.  ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం నడుస్తున్న తీరు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి గురించి విద్యాశాఖ కార్యదర్శి కరుణ వివరించారు. సీఎం కేసీఆర్‌ నిర్దిష్ట ప్రణాళిక , లోతైన పరిజ్ఞానం వల్ల కార్యక్రమాల రూపకల్పన జరుగుతోందన్నారు. తెలంగాణలో ఉన్న 27,000 పాఠశాల్లో తొలిదశలో 7,000 స్కూళ్లను అన్ని రకాల మౌలిక సదుపాయాలతో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్న విధానాన్ని వివరించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ లింబాద్రి, కరుణను బావర్చి రెస్టారెంట్‌ యజమానులు కిశోరె మున్నాగాల , తెలంగాణ జాగృతి యూరప్ అధ్యక్షులు దన్నంనేని సంపత్ కృష్ణ , ఉస్మానియా పూర్వవిద్యార్థులు (యూకే- యూరప్)  ఫౌండర్ ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్ ప్రెసిడెంట్ శ్రవణ్ గౌడ్ , పింగళి శ్రీనివాస్ రెడ్డి , ప్రముఖ న్యాయవాది కమల్ ఓరుగంటి, సురేష్ గోపతి తదితరులు ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని