కాన్సాస్‌లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు

అమెరికాలోని కాన్సాస్‌ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.

Published : 19 Apr 2024 16:04 IST

కాన్సాస్‌: అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్థానిక ఒలాతే నార్త్‌వెస్ట్ హైస్కూల్లో నిర్వహించిన క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలకు దాదాపు 650 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మధు గంట స్వాగత ఉపన్యాసంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో స్థానిక హిందూ ఆలయ పూజారి శ్రీనివాసాచారి పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం ప్రార్థనా గీతంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 

రఘు వేముల, చందన తియగూర, శ్వేత అడుసుమిల్లి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించి సందడిగా నిర్వహించారు. తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కూచిపూడి, భరతనాట్యం, జానపద, శాస్త్రీయ నృత్యాలతో చిన్నారులు, పెద్దలు సందడి చేసి అందరినీ అలరించారు. అలాగే, ఇటీవల బాగా పాపులర్‌ అయిన ‘కుర్చీని మడతపెట్టి, పల్సర్‌ బండి’ పాటలకు పలువురు చేసిన డ్యాన్సులు అందరినీ ఉర్రూతలూగించాయి. ఈ వేడుకల్లో  నూతన కార్యవర్గ సభ్యులను ఈ సంవత్సరం TAGKC అధ్యక్షుడు చంద్ర యక్కలి, కొత్త ట్రస్టు సభ్యులను ట్రస్ట్‌ ఛైర్‌ శివ తియగూర అందరికీ పరిచయం చేశారు.

 TAGKC అధ్యక్షుడు తన ప్రసంగంలో తెలుగు భాష ప్రత్యేకతను వివరించడంతో పాటు ఇంట్లో పిల్లలు, పెద్దలు అంతా తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. పలు సాంస్కృతిక పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. చివరగా TAGKC ఉపాధ్యక్షులు శ్రావణి మేక ధన్యవాద తీర్మానం, జనగణమన గీతంతో సాంస్కృతిక కార్యక్రమాలను ముగించారు. ఈసందర్భంగా అందరికీ తెలుగు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన కార్యకర్తలతో పాటు స్పాన్సర్లందరికీ అసోసియేషన్‌ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని