న్యూజెర్సీలో ఆనందోత్సాహాలతో ‘తెలుగు కళా సమితి’ ఉగాది వేడుకలు

న్యూజెర్సీ తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఏప్రిల్ 22న  స్థానిక సేరెవిల్లే  వార్ మెమోరియల్ హై స్కూల్లో ఆనందోత్సాహాల మధ్య పండుగ

Published : 02 May 2023 16:12 IST

అమెరికా: న్యూజెర్సీ తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఏప్రిల్ 22న  స్థానిక సేరెవిల్లే  వార్ మెమోరియల్ హై స్కూల్లో ఆనందోత్సాహాల మధ్య కొనసాగిన ఈ వేడుకల్లో దాదాపు 1200 మంది తెలుగు ప్రజలు పాల్గొని సందడి చేశారు. తెలుగు కళా సమితి కార్యవర్గం జ్యోతి ప్రజ్వలన, ప్రార్థనా గీతాలాపనతో మధ్యాహ్నం 3.30గంటలకు మొదలైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆటపాటలతో ఉత్సాహంగా సాగింది. స్వప్నా మాదిరాజు, మధు దౌలపల్లి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ తెలుగు కళాసమితి అధ్యక్షుడు మధు రాచకుళ్ల ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా తొలిసారిగా మహిళా సదస్సు, అంతర్జాతీయ రోబోటిక్స్‌ ప్రదర్శన, పబ్లిక్‌ స్పీకింగ్‌ వంటి కార్యక్రమాలను నిర్వహించి తెలుగు కళాసమితిని మరింత బలోపేతం చేసినట్టు తెలిపారు. ఉగాది సంబరాల్లో దాదాపు 250 మంది చిన్నారులు, పెద్దలు సంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు.

మహిళలతో సదస్సుతో పాటు భజనలు, భక్తి నాటకాలు, పలు సినిమాల్లోని సన్నివేశాలను ప్రదర్శిస్తూ అదరగొట్టారు. అంతర్జాతీయ రోబోటిక్స్‌తో పాటు దాదాపు 25మంది చిన్నారులతో భగవద్గీత అంత్యాక్షరి కార్యక్రమం, పబ్లిక్‌ స్పీకింగ్‌ ఆకట్టుకున్నాయి. సందీప్ కూరపాటి, అఖిల మామండూర్, మధు దౌలపల్లి, శ్రీకర్ దర్భా, లావణ్య అందె, శ్రీజ బొడ్డు  బృందం పలు సినీ గీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు.  ఈ సందర్భంగా తెలుగు కళా సమితి ఉపాధ్యక్షురాలు  బిందు యలమంచిలి మహిళా సదస్సు, ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణతో పాటు అతిథులందరికీ ఉగాది పచ్చడిని స్వయంగా తయారు చేసి అందజేశారు. కార్యదర్శి రవి కృష్ణ అన్నదానం నిర్వహించి భోజన ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించారు. కోశాధికారి శ్రీనివాస్ చెరువు ఈ ఉగాది కార్యక్రమానికి సంబంధించిన టికెట్ల విక్రయం, రిజిస్ట్రేషన్‌ డెస్క్‌ నిర్వహణను సమర్థంగా నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల బాధ్యతలను స్వీకరించిన యువజన కార్యదర్శి సుధా దేవులపల్లి సంబరాల సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పన చేసి, సమర్థవంతంగా నిర్వహించారు. వెండర్స్ నిర్వహణ, అంతర్జాతీయ రోబోటిక్స్ ప్రదర్శనను కమ్యూనిటీ కార్యదర్శి వెంకట సత్య తాతా నిర్వహించారు. కొత్తగా కార్యవర్గంలో చేరిన అనిల్ వీరిశెట్టి  వాలంటీర్ల విషయాలను పర్యవేక్షించారు. మెంబర్ షిప్ కార్యదర్శి జ్యోతి కామరసు యువతను సమన్వయం చేయడంతో పాటు వారికి వక్తృత్వ పోటీల నిర్వహణ బాధ్యతలను చూశారు. ఐటీ కార్యదర్శి నాగ మహేందర్‌ వెలిశాల మీడియా, ఈ మెయిల్‌ ప్రచారం, అతిథులందరికీ భోజన ఏర్పాట్ల బాధ్యతలను పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమానికి   తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి,  తానా ప్రతినిధులు రవి పొట్లూరి, రాజా కసుకుర్తి,  విద్యా గారపాటి,  శ్రీనివాస్ ఓరుగంటి, శివాని తన్నీరు తదితరుల హాజరయ్యారు. వీరితో పాటు  నాట్స్ ప్రతినిధులు  అరుణ గంటి, రాజ్ అల్లాడ, శ్యామ్‌ నాళం,  టీటీఏ నుంచి మధుకర్ రెడ్డి దేవరపల్లి, సాయి గూడూరు, శ్రీనివాస్ గూడూరు ,స్వాతి & అట్లూరి దంపతులు (కళా వేదిక), ఆత్మీయ సంస్థ నుంచి ఓం ప్రకాష్ నక్కా, ఈ మధ్యనే కొత్తగా ఆవిర్భవించిన మాటా ప్రతినిధులు శ్రీనివాస్ గనగోని, కిరణ్ దుడ్డాగి, విజయ భాస్కర్ కల్లాల్, శ్రీధర్ చిల్లర,  ఉషా చింతా (NATA), సుబ్బారావు సన్నిధి (వాసవి), తదితరులు వివిధ తెలుగు సంఘాల  ప్రతినిధులు  ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఉగాది వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి ఆర్థిక సహకారంతో పాటు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేసిన అందరికీ తెలుగు కళాసమితి కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు