ఘనంగా ‘సింగపూర్‌ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు.

Updated : 15 Apr 2024 17:04 IST

సింగపూర్‌: సింగపూర్‌ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడికి సుప్రభాతసేవ, తోమాలసేవ, విశేష పూజలతో పాటు మహాలక్ష్మి, విష్ణుదుర్గ అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. స్థానిక సెరంగూన్ రోడ్‌లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్‌ దేవాలయంలో ఏప్రిల్ 9న జరిగిన ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అత్యంత భక్తిశ్రద్ధలతో గోవింద నామస్మరణల మధ్య ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక శ్రద్ధతో సింగపూర్‌ తెలుగు సమాజం శోభాయమానంగా ఏర్పాట్లుచేయగా భారీగా తరలివచ్చిన భక్తకోటి ఆ దేవదేవుడిని దర్శించుకొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన తెలుగు సమాజానికి అందరూ కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటిరోజే ఉగాది రావటం విశేషం. కల్యాణోత్సవం అనంతరం శ్రీవారి ఆలయంలో నిర్వహించిన పంచాంగ పఠనాన్ని అందరూ ఆసక్తిగా ఆలకించారు. అనంతరం కల్యాణోత్సవంలో పాల్గొన్న జంటలకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. 

ఈసందర్భంగా తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. తెలుగువారందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది అందరికీ మరింత మేలు జరగాలని ఆకాంక్షించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు తితిదే వారు పంపిన తిరుమల లడ్డూ, వడ ప్రసాదాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయగా దాదాపు 3 వేల మందికి పైగా వీక్షించారని, అలాగే, ఈ ఉగాదికి  2,000 మందికి సింగపూర్‌లోనే అరుదుగా లభించే వేప పువ్వు అందించామని, సంప్రదాయబద్ధంగా తయారుచేసిన షడ్రచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని 6,000 మందికి పైగా పంచినట్లు వివరించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వారికి అన్నప్రసాదాన్ని అందించినట్లు కార్యక్రమం నిర్వాహకులు ఎఱ్ఱాప్రగడ చాణక్య తెలిపారు. తమ కుటుంబాలకు దూరంగా సింగపూర్‌లో నివసిస్తున్న కార్మిక సోదరులకు సైతం ఉగాది పచ్చడిని అందించినట్లు పేర్కొన్నారు. స్థానికులు సైతం ఉగాది పచ్చడి తిని దాని విశిష్ఠతను తెలుసుకోవడం విశేషం. ఈ కార్యక్రమానికి అన్నివిధాలా సహకరించిన పెరుమాళ్ దేవస్థానం కార్యవర్గానికి, అర్చకులు, దాతలు, కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులు, భక్తులు, పంచాంగ శ్రవణం చేసిన పండితులు, సేవాదళ సభ్యులతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ తెలుగు సమాజం గౌరవ కార్యదర్శి అనిల్ పోలిశెట్టి ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని