Bandi sanjay: మునుగోడు ప్రజలకిచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాలి: బండి

మునుగోడు ప్రజలకు ఉపఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు 15 రోజల్లో నెరవేర్చాల్సిందేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. మునుగోడులో ఓటమిపై సమీక్ష చేసుకుని.. అధికారమే లక్ష్యంగా అభివృద్ధికోసం పనిచేస్తామన్నారు. 

Updated : 06 Nov 2022 20:37 IST

హైదరాబాద్‌: మునుగోడు ప్రజలకు ఉపఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు 15 రోజుల్లో నెరవేర్చాల్సిందేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.‘‘మునుగోడులో ఎన్ని రకాలుగా బెదిరించినా వీరోచితంగా పోరాడిన భాజపా కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మునుగోడులో భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి 86,480 ఓట్లు (40శాతం) వచ్చాయి. ప్రజా తీర్పును శిరసా వహిస్తున్నాం. తెరాస పార్టీ నాయకులు ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత ఎంత విర్రవీగుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. గెలిచిన తర్వాత 15 రోజుల్లో హామీలు నెరవేరుస్తామన్నారు. ఎన్నికల  హామీలు సీఎం కేసీఆర్‌ నెరవేర్చాల్సిందే. కానీ, ఆ విషయం చెప్పకుండా అహంకారంతో మాట్లాడుతున్నారు. ఒక ఉప ఎన్నికలో గెలవగానే ఎగిరెగిరి పడుతున్నారు. ఇతర పార్టీల నేతలు భాజపాలో చేరితే, పదవులకు రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరుతున్నాం. దేశవ్యాప్తంగా ఇదే పద్ధతి అవలంభిస్తున్నాం.

ఆ 12మందితో రాజీనామా చేయించే దమ్ముందా?

ఇతర పార్టీల నుంచి గెలిచిన 12 మందిని తెరాసలో చేర్చుకున్నారు. వారితో రాజీనామా చేయించి ప్రజా తీర్పుకోరే దమ్ముందా? మునుగోడు గెలుపు కేసీఆర్‌దా? కేటీఆర్‌దా? హరీశ్‌రావుదా? సీపీఐదా, సీపీఎందా? కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిదా? ఎవరిదో చెప్పాలి. ఒక్క రాజగోపాల్‌రెడ్డిని ఎదుర్కోవడానికి 16 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పనిచేస్తే వచ్చింది 11వేల మెజార్టీ. ఒక్కో పోలింగ్‌ బూత్‌కు తెరాస ఎమ్మెల్యే పనిచేస్తే.. భాజపా తరఫున కార్యకర్త పనిచేశారు. ఒక్కో తెరాస ఎమ్మెల్యే.. భాజపా కార్యకర్తతో సమానం. ఉప ఎన్నిక వస్తే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. మునుగోడు ఓటమితో భాజపా కార్యకర్తలు నిరుత్సాహపడొద్దు. ఓటమిపై సమీక్ష చేసుకుంటాం. అధికారమే లక్ష్యంగా అభివృద్ధి కోసం పనిచేస్తాం. మునుగోడు ఓటర్లకు ధన్యవాదాలు. మునుగోడు గెలుపు.. కొందరు పోలీసు అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ది. ఎక్కడా కూడా తెరాస డబ్బులు పట్టుబడకుండా.. పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లు, ఎమ్మెల్యేల కాన్వాయ్‌ల ద్వారా డబ్బు తరలించారు. ఉప ఎన్నిక కోసం  తెరాస రూ.వెయ్యి కోట్లు పంచింది’’ అని బండి సంజయ్‌ ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని