CM Revanth: సర్కారు బడిలో చదివే ఈ స్థాయికి ఎదిగా: సీఎం రేవంత్‌రెడ్డి

ఎల్బీ స్టేడియంలోనే రైతును రాజుగా చేసే పాలనకు నాంది పడిందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. లెక్చరర్లు, టీచర్లు ఉద్యోగాలకు ఎంపికైన 5,192 మందికి నియామక పత్రాలను ఆయన అందజేశారు. 

Updated : 04 Mar 2024 19:29 IST

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలలోనే చదివి తాను ఈ స్థాయికి ఎదిగానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎల్బీ స్టేడియంలో లెక్చరర్లు, టీచర్లు ఉద్యోగాలకు ఎంపికైన 5,192 మందికి నియామక పత్రాలను ఆయన అందజేశారు. మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలోనే రైతును రాజుగా చేసే పాలనకు నాంది పడిందని చెప్పారు. 

‘‘తెలంగాణ సాధనలో నిరుద్యోగులు, యువత పాత్ర ఎంతో గొప్పది. వారి త్యాగాలు, బలిదానాలతోనే స్వరాష్ట్రం సాకారమైంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే న్యాయం జరుగుతుందని భావించారు. కానీ, కుటుంబ పాలనలో యువత ఆకాంక్షలు నెరవేరలేదు. కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యుల పదవులు ఊడగొడితేనే.. తమకు ఉద్యోగాలు వస్తాయని యువత భావించారు. అనుకున్నట్టే చేయడంతో.. ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి. 

నాకు ఇంగ్లిష్‌ రాదని కొందరు అవహేళన చేస్తున్నారు. నేను జిల్లా పరిషత్‌ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివా. గుంటూరు, గుడివాడకు వెళ్లి కార్పొరేట్‌ పాఠశాలల్లో చదవలేదు. వేలాది గురుకులాలు నిర్మించామని గత పాలకులు గొప్పగా చెబుతున్నారు. ఎక్కడా వాటికి శాశ్వత భవనాలు నిర్మించలేదు. వసతులు లేని అద్దె భవనాల్లో పేద విద్యార్థులు అవస్థలు పడ్డారు. రేషనైలేజేషన్‌ పేరిట కేసీఆర్‌ 6 వేల పాఠశాలలను మూసివేశారు. కులవృతుల వారి పిల్లలు ఆ పనులే చేసుకోవాలని భావించారు. పేదలు గొర్రెలు, బర్రెలు, చేపలు మాత్రమే పెంచాలనట్టుగా వ్యవహరించారు. ఆయన మనవడి పెంపుడు కుక్క చనిపోతే వెటర్నరీ డాక్టర్‌ మీద కేసీఆర్‌ కేసు పెట్టారు’’ అని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని