సర్కార్‌పై విపక్షాల అభాండాలు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి యుద్ధప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటూ నిరుద్యోగుల్లో భరోసా కల్పించేందుకు యత్నిస్తుండగా... విపక్ష పార్టీలు అభాండాలు వేస్తూ, చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నాయని మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Published : 26 Mar 2023 03:38 IST

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం
సిట్‌ పేరు చెబితేనే సంజయ్‌కు వణుకు: జగదీశ్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి యుద్ధప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటూ నిరుద్యోగుల్లో భరోసా కల్పించేందుకు యత్నిస్తుండగా... విపక్ష పార్టీలు అభాండాలు వేస్తూ, చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నాయని మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. భాజపా నేతలు పదవుల కోసం దొంగ దీక్షలు చేస్తున్నారని, వారు ఎన్ని ఎత్తులు వేసినా శాశ్వత నిరుద్యోగులుగా మిగిలిపోవడడం ఖాయమన్నారు. భారాస శాసనసభాపక్ష కార్యాలయంలో శనివారం ఆయన ఎమ్మెల్యే గాదరి కిశోర్‌, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. భాజపాకు ఉద్యోగాలు, ఉద్యోగులపై మాట్లాడే నైతికహక్కు లేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ప్రధానిగా పీఠమెక్కిన మోదీ ఈ దేశ యువతను దారుణంగా మోసం చేశారన్నారు. భాజపా నేతలు తమ రాజకీయ క్రీడలో నిరుద్యోగులను బలిపీఠమెక్కించాలని కుట్ర చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. సంజయ్‌కు దమ్ముంటే తొలుత దేశంలో ఉద్యోగాలు భర్తీ చేయాలని దిల్లీకి వెళ్లి ధర్నాలు చేయాలని సూచించారు. కేటీఆర్‌ గురించి మాట్లాడే స్థాయి ఆయనకు లేదన్నారు. సంజయ్‌ వద్ద ఆధారాలు లేనందునే సిట్‌ అంటే వణికిపోతూ విచారణను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఒకసారి సిట్‌ నోటీసులు ఇస్తే సంజయ్‌ తప్పించుకున్నారని, శనివారం మళ్లీ నోటీసులు ఇవ్వగా... హాజరు కావడానికి వెనుకాడుతున్నారన్నారు. సున్నిత అంశాన్ని రాజకీయం చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో విపక్ష పార్టీలు చెలగాటమాడుతుంటే ఎవ్వరూ సహించబోరని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్‌ సుప్తచేతనావస్థకు చేరిందని, రాహుల్‌ గాంధీని లోక్‌సభ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించినా ఆ పార్టీ నాయకులు సరైన రీతితో స్పందించకపోవడం దాని దుస్థితిని చాటుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని