Nara Lokesh: ఈ ముఖ్యమంత్రి ఇసుకాసురుడు

యువగళం పాదయాత్రతో కృష్ణా జిల్లా జనసంద్రమైంది.. దీనిలో సైకో జగన్‌ కొట్టుకుపోవడం ఖాయమని అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ గర్జించారు.

Updated : 23 Aug 2023 10:23 IST

రోజుకు రూ.3 కోట్లు మేసేస్తున్నారు
పసుపు సైనికులను వేధించే ఎవరినీ వదలం
విదేశాలకు పారిపోయినా తీసుకొచ్చి లోపలేస్తాం
గన్నవరం బహిరంగ సభలో లోకేశ్‌

జగన్‌లా కోర్టు పేరుతో   వారానికి మూడు రోజులు నా పాదయాత్రకు సెలవు లేదు. ఎక్కడ చూసినా యువగళం జనసంద్రమే కనిపించడంతో.. జగన్‌ కోపం తట్టుకోలేక టేబుల్‌ను గట్టిగా తన్నారు. అందుకే కాలి నొప్పి వచ్చింది.   బెజవాడలో వైద్యుడి వద్దకు వెళితే, పరీక్షలు చేసి ఏమీ లేదని తేల్చారు. అయినా కాలినొప్పి ఉందనడంతో మడమ తిప్పను.. మాట తప్పను అని మీరు ఎన్నికల ముందు చెప్పి  నాలుగున్నరేళ్లుగా ప్రతిరోజూ మడమ తిప్పుతూనే ఉన్నారు.. అందుకే ఈ నొప్పి అని ఆ వైద్యుడు చెప్పారట.

 నారా లోకేశ్‌


ఈనాడు, అమరావతి: యువగళం పాదయాత్రతో కృష్ణా జిల్లా జనసంద్రమైంది.. దీనిలో సైకో జగన్‌ కొట్టుకుపోవడం ఖాయమని అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ గర్జించారు. పాదయాత్రలో భాగంగా 191వ రోజు కృష్ణా జిల్లా గన్నవరంలో మంగళవారం భారీ బహిరంగ సభను నిర్వహించారు. ‘జగన్‌ పాదయాత్ర చేసినప్పుడు తెదేపా ప్రభుత్వంలో ఎవరూ అడ్డుకోలేదు. పోలీసు భద్రత కల్పించి మరీ పాదయాత్ర చేసుకోమన్నాం. నేను యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి జగన్‌ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రకరకాలుగా అడ్డుకోవాలని ప్రయత్నించినా.వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పా. ఇప్పుడు బ్యానర్లు తొలగిస్తున్నారు ఈ సైకోలు. నేను ముందే చెప్పాను.. సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే ఇది దండయాత్ర’ అని లోకేశ్‌ మరోసారి వైకాపా నేతలను హెచ్చరించారు. ఉద్యోగుల సంతోషం.. భవిష్యత్తు తన బాధ్యత అని ఏపీఎన్జీవో సభలో జగన్‌ అనడం చూసి.. అక్కడున్న ఉద్యోగులే ఎగతాళి చేస్తున్నారని లోకేశ్‌ అన్నారు. ముందు వారికి ఒకటో తేదీన జీతాలిచ్చాక ఇలాంటి ప్రకటనలు చేయాలన్నారు.

జగన్‌ రోజూ ఇసుక తింటున్నారు..

‘సభకు వచ్చిన వారందరికీ ఓ ప్రశ్న.. జగన్‌ రోజు ఏం తింటారు?’ అని లోకేశ్‌ ప్రశ్నించారు. మొదటి ఆప్షన్‌ బిర్యానీ, రెండో ఆప్షన్‌ అన్నం, మూడో ఆప్షన్‌ ఇసుక.. అనగానే జనమంతా ఇసుక అని ఏకకంఠంతో చెప్పారు. అవును.. ఇసుకే తింటున్నారని లోకేశ్‌ విమర్శించారు. ‘కృష్ణా జిల్లా వ్యాప్తంగా లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు. తెదేపా హయాంలో రూ.వెయ్యి పెడితే ట్రాక్టర్‌ ఇసుక దొరికేది. ఇప్పుడది రూ.ఐదు వేలు. ఈ ఇసుక దందాలో ప్రతి రోజు రూ.మూడు కోట్ల చొప్పున తినేస్తూ ఈ ఐదేళ్లలో రూ.5,475 కోట్లను సైకో జగన్‌ దోచేస్తున్నారు’ అన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక, సిమెంట్‌, ఇనుము ధరలు తగ్గించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

సైకో కర్రల పథకానికి సవాలు

‘పులుల నుంచి కాపాడుకోవడానికి టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణా‘కర్ర’రెడ్డి భక్తులకు కర్రలిస్తారంట. అధికార పార్టీ నేతలకు సవాలు విసురుతున్నా. తాడేపల్లి ప్యాలెస్‌లో ఓ పులిని వదిలిపెడతా.. జగన్‌కు కర్ర ఇచ్చి దానిని తరమమని చెప్పండి. కర్రలు ఇవ్వాల్సింది భక్తులకు కాదు.. సామాన్య ప్రజలకు. వైకాపా నేతలు ఇళ్లకు వస్తే వాటితో తరమడానికి’ అని లోకేశ్‌ అన్నారు.

రూ.75 కరెంటు బిల్లు రూ.365 అయింది

‘జగన్‌ ఇప్పటికి తొమ్మిదిసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారు. ఓ ఇంటికి నెలకు 18 యూనిట్లు వినియోగిస్తే విద్యుత్తు ఛార్జీ రూ.75. కానీ ట్రూఅప్‌ ఛార్జీలు రూ.102. ఎఫ్‌పీపీసీ ఛార్జీల మరో రూ.175 వేశారు. ఈ బాదుడుతో రూ.75 బిల్లు రూ.365కు చేరింది’ అని ఓ పేద కుర్రాడు పంపించిన బిల్లును లోకేశ్‌ చూపించారు. ఇలాగే ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరలు పెంచేశారన్నారు. ‘రేపోమాపో వాలంటీరు మీ ఇంటికి వచ్చి ఓ గొట్టం తెచ్చి గాలి పీల్చమంటారు.. పీల్చారో గాలికి కూడా పన్ను వేసి వసూలు చేస్తారు ఈ జగన్‌. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 26 వేల మంది బీసీలపై దొంగ కేసులు పెట్టింది. తెదేపా అధికారంలో వచ్చిన ఏడాదిలో ఎస్సీ, ఎస్టీ చట్టం మాదిరిగానే బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం’ అని లోకేశ్‌ అన్నారు.

ఎక్కడికి పారిపోయినా వదలను

‘గత నాలుగేళ్లుగా ఎత్తిన పసుపు జెండాను దించకుండా తెదేపాకు కాపు కాసిన ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దొంగ కేసులు పెట్టిన అధికారులపై జ్యుడిషియల్‌ విచారణ వేసి, సర్వీసు నుంచి డిస్మిస్‌ చేసి జైలుకు పంపిస్తాం. మన కార్యకర్తలను వేధించిన ఏ వైకాపా నాయకుణ్నీ వదిలిపెట్టను. గన్నవరంలో ఉన్నా.. విదేశాలకు పారిపోయినా తీసుకొచ్చి లోపల వేస్తా’ అని హెచ్చరించారు.

మీరు 15 మంది రండి.. నేనొక్కణ్నే వస్తా 

కృష్ణా జిల్లా అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమని వైకాపా నేతలకు లోకేశ్‌ సవాలు విసిరారు. తాము తెచ్చిన పరిశ్రమలన్నింటినీ తరిమేశారన్నారు. ‘మీరు 15 మంది రండి.. నేను సింగిల్‌గా వస్తాను. తేదీ, సమయం మీరే చెప్పండి. కృష్ణా జిల్లాలో నలుగురు వైకాపా నేతలకు మంత్రులుగా అవకాశమిచ్చినా ఒక్కరు కూడా అభివృద్ధి చేసింది లేదు. ఒకరు సన్నబియ్యం దందాలో, మరొకరు పేకాట క్లబ్బుల్లో మునిగితేలుతున్నారు. అభివృద్ధి చేయడం చేతకాని మరో మంత్రి గుడిలోని కొబ్బరిచిప్పలను అద్భుతంగా దొంగతనం చేశారు. మరో నాయకుడు పనికిమాలిన వ్యక్తి. ఆ ముగ్గురూ పోయి ఇప్పుడు వచ్చిన నాలుగో వ్యక్తి ఒక్క ఇల్లు కట్టలేదు.. కానీ మన నాయకుడు చంద్రబాబు ఇంటిపైకి వచ్చి దాడి చేస్తారంట. ఎవ్వరూ లేనప్పుడు కాదు.. దమ్ము ధైర్యం ఉంటే తేదీ చెప్పి ఇప్పుడు రా’ అని సవాల్‌ విసిరారు. మూడుసార్లు అవకాశం ఇచ్చిన పార్టీకి గన్నవరంలో వెన్నుపోటు పొడిచి, తెదేపా కార్యాలయాన్ని తగలబెట్టించిన ఇక్కడ ఎమ్మెల్యేకి భయం ఏంటో పరిచయం చేస్తా’ అని హెచ్చరించారు. తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ జగన్‌ ఆర్థిక ఉగ్రవాది అని, మరో ఆరు నెలల్లో జైలుకు వెళ్లబోతున్నారని జోస్యం చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని