Nara Lokesh: కల్లుగీత కార్మికులను ఆదుకుంటాం

మత్స్యకారులకు పని ఉండని నాలుగు నెలలపాటు ఆర్థిక సాయం అందిస్తున్నట్లుగానే గీత కార్మికులకు కూడా ఉపాధి లేని రోజుల్లో సాయం అందించేందుకు తెదేపా అధికారంలోకి వచ్చాక చర్యలు చేపట్టే అంశంపై పార్టీ పెద్దలతో చర్చిస్తామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

Updated : 02 Sep 2023 06:42 IST

ఉపాధి లేని రోజుల్లో ఆర్థిక సాయం అందించేలా ఆలోచన  
గీత కార్మికుల ముఖాముఖిలో లోకేశ్‌

ఈనాడు, రాజమహేంద్రవరం: మత్స్యకారులకు పని ఉండని నాలుగు నెలలపాటు ఆర్థిక సాయం అందిస్తున్నట్లుగానే గీత కార్మికులకు కూడా ఉపాధి లేని రోజుల్లో సాయం అందించేందుకు తెదేపా అధికారంలోకి వచ్చాక చర్యలు చేపట్టే అంశంపై పార్టీ పెద్దలతో చర్చిస్తామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో శుక్రవారం 201వ రోజు పాదయాత్ర సాగింది. సాయంత్రం కల్లుగీత కార్మికులతో ముఖాముఖిలో లోకేశ్‌ మాట్లాడుతూ బీసీలను ఆదుకున్న పాలిచ్చే ఆవులాంటి తెదేపాను కాదని, తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించి ఇబ్బందుల్లో పడ్డారన్నారు. కార్పొరేషన్లకు వైకాపా నాయకులు ఛైర్మన్లుగా ఉంటే వారికి జీతాలు సైతం ఇచ్చే పరిస్థితి లేదన్నారు. బీసీ మంత్రి సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉందని దుయ్యబట్టారు. విజనరీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలొచ్చాయి. ప్రిజనరీ జగన్‌ ఉంటే రావట్లేదన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే పరిశ్రమలు తెచ్చి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

26 వేల తప్పుడు కేసులు

వైకాపా ప్రభుత్వం బీసీలపై సుమారు 26 వేల తప్పుడు కేసులు పెట్టిందని, తెదేపా వచ్చాక ఏడాదిలో వాటిని ఎత్తేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థికి రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఓటు వేయలేదని ఆమె భర్త ఆదిరెడ్డి వాసు, మామ అప్పారావుపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు. ఈరోజు అయన్నపాత్రుడిని విమానాశ్రయంలో ఉగ్రవాదిలా అరెస్టు చేసి, కొంతదూరం తీసుకెళ్లి 41 నోటీసిచ్చి, విడిచిపెట్టారన్నారు. తన అక్కను వేధిస్తుంటే ఎదిరించినందుకు అమర్‌నాథ్‌గౌడ్‌ అనే విద్యార్థిని కిరాతకంగా హత్య చేశారన్నారు. ఆ సోదరి చదువు బాధ్యత తన తల్లి తీసుకున్నారన్నారు. గీతకార్మికుల కోసం మంచి పాలసీ తీసుకొస్తామన్నారు. ప్రమాదంలో మృతి చెందితే రూ.10 లక్షల బీమా చెల్లిస్తామన్నారు. ఈత, తాడి చెట్ల రక్షణకు చట్టం తీసుకొచ్చేందుకు ఆలోచిస్తామన్నారు. ‘బీసీలకు తెదేపా పుట్టినిల్లు. కల్లుగీత కార్మికులకు ప్రత్యేక ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి, వారి అభివృద్ధికి రూ.105 కోట్లు ఖర్చు చేశాం. ఆదరణ పథకం, 50 శాతం సబ్సిడీ రుణాలు, ప్రత్యేక పాలసీతో ఆదుకున్నాం. చెట్ల పెంపకాన్ని ఉపాధి హామీతో అనుసంధానం చేసి వృత్తిపరంగా ప్రోత్సహించాం’ అని చెప్పారు. ప్రశాంతంగా పాదయాత్ర చేస్తుంటే పేదలకు, పెత్తందార్లకు యుద్ధమని ఫ్లెక్సీలు పెడతారా? మన నాయకుడిని కించపరిచేలా పెడితే ఊరుకోవాలా అని లోకేశ్‌ ప్రశ్నించారు.

రవాణా పన్నుల భారం మోయలేం..

వైకాపా పాలనలో పన్నుల భారం మోయలేకపోతున్నామని లారీ యజమానుల సంఘం నాయకులు లోకేశ్‌కు వినతిపత్రం ఇచ్చారు. తెదేపా పాలనలో గ్రీన్‌ట్యాక్స్‌ రూ.200 ఉంటే రూ.16,700, త్రైమాసిక పన్ను రూ.6,050 ఉంటే రూ.9,300కు పెంచారన్నారు. డీజిల్‌ ధర రూ.99కు చేరిందన్నారు. దీనిపై లోకేశ్‌ మాట్లాడుతూ పన్నులు, ధరలు తగ్గిస్తామన్నారు. రవాణా రంగానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు, విద్యుత్తు ఒప్పంద ఉద్యోగులు, రైతులు, ఆటో యూనియన్‌ నాయకులు తమ సమస్యలు విన్నవించారు.

  • వైకాపా నేతలు, మంత్రులు మాట్లాడుతున్న బూతులు.. ప్రవచనాల్లా వినిపిస్తున్నాయా? అని పోలీసుల్ని లోకేశ్‌ ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుణ్ని అక్రమంగా నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. అయ్యన్న వ్యాఖ్యలు రెచ్చగొట్టేవే అయితే సీఎంగా జగన్‌, వైకాపా నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఏమనాలన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు