Amit Shah: మునుగోడులో భాజపా గెలుపుతో కేసీఆర్‌ సర్కారుకు మూడినట్లే

రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరడమంటే కేవలం ఒక నాయకుడు చేరినట్టు కాదు.. ఇది తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో తొలగించడంలో తొలిమెట్టు. మునుగోడు ప్రజలందరూ రాజగోపాల్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి.రాష్ట్రంలో 2014 నుంచి పాఠశాలల్లో టీచర్‌ పోస్టులు భర్తీ చేయడం లేదు.

Updated : 22 Aug 2022 09:42 IST

రాష్ట్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వమే

మోదీ రూ.2 లక్షల కోట్లు ఇచ్చినా అప్పుల్లో రాష్ట్రం

మరోసారి తెరాస వస్తే కేసీఆర్‌ స్థానంలో కేటీఆర్‌ సీఎం

దళితుల్ని మాత్రం ముఖ్యమంత్రిని చేయరు

‘మునుగోడు సమరభేరి’లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరడమంటే కేవలం ఒక నాయకుడు చేరినట్టు కాదు.. ఇది తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో తొలగించడంలో తొలిమెట్టు. మునుగోడు ప్రజలందరూ రాజగోపాల్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి.


రాష్ట్రంలో 2014 నుంచి పాఠశాలల్లో టీచర్‌ పోస్టులు భర్తీ చేయడం లేదు. కానీ కేసీఆర్‌ కుటుంబంలో పోస్టులు  భర్తీ అవుతున్నాయి. ఆయన కుటుంబం చాలా పెద్దది. కుమారుడు, కుమార్తె, మేనల్లుడు ఇలా ఎంతోమంది ఉన్నారు. కాళేశ్వరం  ప్రాజెక్టు.. కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంగా మారింది.

- అమిత్‌షా


ఈనాడు, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే.. రాష్ట్రంలో కేసీఆర్‌ అవినీతి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతుందని భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో  భాజపా ప్రభుత్వం కొలువుదీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలో ఇక్కడి భాజపా సీఎం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని చెప్పారు. ఆదివారం మునుగోడులో నిర్వహించిన ‘భాజపా సమరభేరి’ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో భాజపాలో చేరారు. ‘తెరాసను గెలిపిస్తే కేసీఆర్‌ దళితుణ్ని సీఎం చేస్తామన్నారు. కానీ చేయలేదు... ఈసారి మళ్లీ గెలిపిస్తే కేసీఆర్‌ స్థానంలో కేటీఆర్‌ సీఎం అవుతారు. కానీ దళితుల్ని మాత్రం సీఎంగా చేయరు’ అని అమిత్‌షా అన్నారు. ‘‘తెరాస సర్కారు.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంగా మారింది. నిరుద్యోగులకు కొలువులు దక్కకున్నా ఆయన కుటుంబ సభ్యులకు పదవులు వస్తున్నాయి. రాష్ట్రానికి ప్రధాని మోదీ రూ.2 లక్షల కోట్ల సహాయం చేసినప్పటికీ, తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది.

విమోచన దినోత్సవం నిర్వహిస్తాం...

రజాకార్ల అరాచకాలు పేట్రేగిపోవడంతో అప్పటి తొలి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ తెలంగాణకు స్వాతంత్య్రం కల్పించి భారత్‌లో విలీనం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే సెప్టెంబరు 17న అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. కానీ మజ్లిస్‌ భయంతో చేయలేదు. తెలంగాణ ప్రజలారా.. ఆందోళన చెందవద్దు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా సీఎం వస్తారు. ఆ వెంటనే అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తాం. సీఎం కేసీఆర్‌ జిల్లాకో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. నల్గొండలో ఇప్పటికీ నిర్మించలేదు. రాష్ట్రంలో పేదలకు రెండు పడకగదుల ఇళ్లు ఇవ్వలేదు. కాసేపు ఆ మాటను పక్కన పెడితే, మోదీ.. ప్రజలకు మంజూరు చేసిన మరుగుదొడ్లను సీఎం అడ్డుకుంటున్నారు. పేదలకు ఇళ్లు కూడా రానివ్వడం లేదు.

ప్రతి గింజా కొంటాం...

రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనడం లేదు. భాజపా అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొంటాం. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పడుతుంది. మిగతా భాజపా రాష్ట్రాల మాదిరి.. తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఏ ఆకాంక్షలతో తెలంగాణ ఏర్పాటైందో ఆ ఆకాంక్షల్ని భాజపా సీఎం పూర్తి చేస్తారు. కేంద్రంలో నరేంద్ర మోదీకీ అండగా ఉంటూ ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డిని గెలిపించాలి. రాష్ట్రంలో కమలం వికసించేలా పనిచేసి.. భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు కృషిచేయాలి. ఈ మేరకు విజయ సంకల్పం తీసుకోవాలి’’ అని అమిత్‌షా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు దళితబంధు పేరిట ఇంటికి రూ. 10లక్షలు ఇస్తామని చెప్పారు. దళితుల ఇళ్లకు ఇప్పటికీ ఆ రూ.10 లక్షలు రాలేదు. ప్రతి దళితుడికీ మూడు ఎకరాలు, గిరిజనులకు ఎకరా భూమి అందించలేదు.


రాష్ట్రంలో అన్ని ధరలూ ఎక్కువగా ఉన్నాయి. మోదీ రెండు సార్లు పెట్రోలు ధరలు తగ్గిస్తే, రాష్ట్రంలో ఆ మేరకు తగ్గించ లేదు. దీంతో దేశంలో పెట్రోలు ధరలు తెలంగాణలోనే అధికంగా ఉన్నాయి.


కేసీఆర్‌ అండ్‌ కంపెనీ నిరుద్యోగ యువతకు రూ.3వేల భృతి ఇస్తామని చెప్పింది. ఈ నగదు రాష్ట్రంలో ఎవరికీ అందడం లేదు. కేసీఆర్‌ రైతు వ్యతిరేకి. రైతులకు ఫసల్‌బీమా పరిహారం అందకుండా దూరం చేస్తున్నారు.


ఈ సభ తెరాసపై విజయానికి నాంది

సమరభేరి సభ దిగ్విజయం కావడం మునుగోడులో తెరాసపై భాజపా విజయానికి నాంది. సభకు జనాలు రాకుండా చేసేందుకు ప్రభుత్వం అన్ని కుట్రలూ పన్నింది. అవన్నీ విఫలం అయ్యాయి. తెరాస సభ జనం లేక వెలవెల పోతే...భాజపా సభకు పెద్ద ఎత్తున జనాలు స్వచ్ఛందంగా తరలివచ్చారు.

- బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు


అమ్ముడుపోయే వ్యక్తిని కాను

ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేయడంతో మునుగోడు ప్రజలకు గత మూడున్నరేళ్లుగా న్యాయం చేయలేకపోయా. అందుకే రాజీనామా చేసి రాష్ట్రాన్ని నియంతలాగా పాలిస్తున్న కేసీఆర్‌పై కేంద్ర మంత్రి అమిత్‌షా ఇచ్చిన ధైర్యంతో ధర్మయుద్ధం చేస్తున్నా. దీనికి మీరంతా నాకు మద్దతివ్వాలి. నేను అమ్ముడుపోయే వ్యక్తిని కాను. ప్రాణం పోయినా మునుగోడు ప్రజలకు తలవంపులు తెచ్చే పని చేయను. కేసీఆర్‌.. మీ పతనం మునుగోడు నుంచే ప్రారంభం అవుతుంది.  

- రాజగోపాల్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే


తెరాసను పాతరేయాలి: కిషన్‌రెడ్డి

మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడొచ్చినా తెరాసను పాతరేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్‌ కుటుంబ, అవినీతి పాలనను అంతమొందించేందుకే అమిత్‌షా మునుగోడు గడ్డపై కాలు మోపారన్నారు. ఆదివారం నిర్వహించిన మునుగోడు సమరభేరి సభకు హాజరై ఆయన మాట్లాడారు. ‘‘మునుగోడుకు భాజపా ఏం చేసిందని కొందరు అడుగుతున్నారు. ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరించేందుకని మోదీ ప్రభుత్వం తెలంగాణలో సుమారు వేయి గ్రామాల కోసం రూ.700 కోట్లు ఇచ్చింది. ఇందులో రూ.698 కోట్లు ఖర్చుచేశారు. గమనించండి. అవినీతి అక్రమాలు చేసిన వారికే ఈడీ, సీబీఐ అంటే భయం వేస్తుంది. కేసీఆర్‌ ఎప్పుడూ ఈడీ, సీబీఐ అంటూ కలవరిస్తున్నారు. మేం రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరుతున్న సందర్భంగా ఇక్కడ సభ పెట్టాం. సీఎం మునుగోడులో సభ ఎందుకు పెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని అన్నారు. ‘‘రాష్ట్రంలో రైతులందరినీ మభ్యపెట్టి కేసీఆర్‌ కాలం గడుపుతున్నారు. గిట్టుబాటు ధరలు లేవు. ఫసల్‌బీమా యోజన లేదు. కేసీఆర్‌ కుటుంబ పాలనను పెకలించేందుకే ఈ సభను ఏర్పాటు చేశాం. వచ్చే ఎన్నికల్లో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. మునుగోడు ప్రజలు భాజపాకు ఓటేసి భవ్యమైన తీర్పునివ్వాలి’’ అని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ కోరారు. ‘‘ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తుంటే హుజూరాబాద్‌ కంటే మునుగోడులో గొప్ప తీర్పు వస్తుందనిపిస్తోంది. కమ్యూనిస్టులు హక్కుల కోసం సమ్మెలు చేస్తే ఏనాడైనా సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌కు పిలిచి మాట్లాడారా? మరి మీరెందుకు తెరాసకు మద్దతిస్తున్నారు? ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి, సీఎం కేసీఆర్‌ అహంకారానికి జరుగుతున్న పోరాటం’’ అని పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని