గవర్నర్‌ ప్రసంగానికి భాజపా అడ్డంకి

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ప్రారంభం రోజైన శుక్రవారం గవర్నర్‌ ప్రసంగానికి భాజపా సభ్యులు అడ్డుతగిలారు. దాంతో గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఎలాంటి ప్రసంగం చేయకుండానే వెనుదిరిగారు. ఆయన 2గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించగా

Updated : 03 Jul 2021 05:49 IST

నిమిషాల వ్యవధిలో అసెంబ్లీ నుంచి తిరిగివెళ్లిన ధన్‌కడ్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ప్రారంభం రోజైన శుక్రవారం గవర్నర్‌ ప్రసంగానికి భాజపా సభ్యులు అడ్డుతగిలారు. దాంతో గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఎలాంటి ప్రసంగం చేయకుండానే వెనుదిరిగారు. ఆయన 2గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించగా, సభ్యుల నినాదాల కారణంగా 2.04 గంటలకే అంటే కేవలం నాలుగు నిమిషాలకే ముగించాల్సి వచ్చింది. ఆ కొద్దిసేపు కూడా మాటలు వినబడలేదు. ఎన్నికల అనంతరం జరిగిన హింసపై ప్రసంగంలో ప్రస్తావించలేదంటూ నాటి సంఘటనల ఫొటోలు పట్టుకొని నినాదాలు చేశారు. ప్రసంగించే అవకాశం లేకపోడంతో ఉపన్యాస పాఠాన్ని సభకు సమర్పిస్తున్నానని పేర్కొంటూ గవర్నర్‌ వెనుదిరిగారు. ఆయన వెంట స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ, సీఎం మమతా బెనర్జీ మర్యాదపూర్వకంగా వెంట నడిచారు. దీనిపై ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ తాము గవర్నర్‌ను తప్పుపట్టడం లేదని.. ప్రసంగాన్ని రాసిచ్చిన ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు.

సొలిసిటర్‌ జనరల్‌ను తొలగించాలి: టీఎంసీ

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ప్రతిపక్ష నేత సువేందు అధికారి (భాజపా)తో భేటీ అయినందుకు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను పదవి నుంచి తొలగించాలని కోరుతూ టీఎంసీ శుక్రవారం ప్రధానికి లేఖ రాసింది.  మెహతా చాలా కేసుల్లో సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తున్నారని, సువేందుపై పలు సీబీఐ కేసులు ఉన్నాయని తెలిపింది. దీనిపై తుషార్‌ మెహతా వివరణ ఇస్తూ తమ ఇద్దరి మధ్య ఎలాంటి సమావేశం జరగలేదని తెలిపారు. ‘‘గురువారం ముందస్తు సమాచారమివ్వకుండానే సువేందు మా నివాసానికి వచ్చారు. అప్పుడు నేను వేరే  సమావేశంలో ఉన్నాను. సమావేశం పూర్తయిన తరువాత నా వ్యక్తిగత కార్యదర్శి వచ్చి సువేందు వేచి చూస్తున్నారని చెప్పారు. అయితే నేను ఆయనను కలవలేనని, వేచి ఉండేలా చేసినందుకు క్షమాపణలు చెప్పాలని అన్నాను. నా కార్యదర్శి ఈ విషయాన్ని చెప్పడంతో సువేందు కూడా ఏమీ అనకుండా వెళ్లిపోయారు’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని