INDIA కూటమి భేటీ ‘చాయ్‌-బిస్కెట్ల’కే పరిమితం.. ‘సమోసా’ ఇవ్వలేదు!

తాజాగా జరిగిన విపక్ష పార్టీల ‘ఇండియా’ కూటమి భేటీలో కీలక విషయాలు చర్చించినట్లు భాగస్వామ్య పార్టీలు చెబుతున్నప్పటికీ.. అందులోని ఓ పార్టీ ఎంపీ మాత్రం సమావేశంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Published : 21 Dec 2023 02:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్రంలో భాజపాను ఎదుర్కొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న విపక్ష కూటమి ‘ఇండియా’ (INDIA).. నిన్న నాలుగోసారి భేటీ అయ్యింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ల సర్దుబాటుపై చర్చించినట్లు అందులో పాల్గొన్న నేతలు వెల్లడించారు. అయితే, ఈ సమావేశంపై జేడీ(యూ) ఎంపీ సుశీల్‌ కుమార్‌ పింటూ విమర్శలు గుప్పించారు. అది కేవలం చాయ్‌-బిస్కెట్లకే పరిమితమైందని.. సమోసా లేకుండానే ఆ సమావేశం ముగిసిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమైన అంశాలు చర్చించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘ఇండియా కూటమి సమావేశంలో అనేక పార్టీలకు చెందిన అగ్ర నేతలు పాల్గొన్నారు. కానీ, ముఖ్య విషయాలపై మాత్రం ఎలాంటి చర్చ జరగలేదు. కేవలం ఆ సమావేశం చాయ్‌-బిస్కెట్లకే పరిమితమయ్యింది. ఎందుకంటే.. తమకు నిధుల కొరత ఉందని, అందుకే రూ.138, రూ.1380, రూ.13,800లతో విరాళాలు సేకరిస్తున్నామని కాంగ్రెస్‌ ఇటీవల పేర్కొంది. అవి ఇంకా రావాల్సి ఉంది. అందుకే సమోసా, తీవ్రమైన సమస్యలపై చర్చ లేకుండా కేవలం చాయ్‌-బిస్కెట్లతోనే ఆ సమావేశం ముగిసింది’ అని జేడీయూ ఎంపీ సుశీల్‌ కుమార్‌ పింటూ విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్‌ క్రౌడ్‌ ఫండింగ్‌కు రాహుల్‌ విరాళం

ఇదిలాఉంటే, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాల కూటమి ‘ఇండియా’ నేతలు డిసెంబర్‌ 19న దిల్లీలోని అశోకా హోటల్‌లో భేటీ అయ్యారు. 28 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే ఉండాలంటూ మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌లతోపాటు మరికొందరు నేతలు ప్రతిపాదనలు చేశారని.. వాటిని కాంగ్రెస్‌ అధ్యక్షుడు సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, బిహార్‌, దిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు నీతీశ్‌ కుమార్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, ఎంకే స్టాలిన్‌, మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని