KCR: అగ్రగామి రాష్ట్రానికి ఎందుకు చెదలు పట్టాయి?: కేసీఆర్‌

కాంగ్రెస్‌ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు.

Updated : 31 Mar 2024 20:01 IST

సూర్యాపేట: కాంగ్రెస్‌ వంద రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని భారాస అధినేత కేసీఆర్‌ ఆరోపించారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో రైతులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందని అనుకోలేదన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరూ ఆలోచించాలని కోరారు.  

స్వల్ప కాలంలోనే ఈ దుస్థితికి ఎందుకు?

‘‘దేశంలోనే నంబర్‌ వన్‌స్థానంలో ఉన్న తెలంగాణకు స్వల్ప కాలంలోనే ఈ దుస్థితికి ఎందుకు రావాలి? నీళ్లిస్తారని నమ్మి పంటలు వేసుకున్నాం.. ముందే చెబితే వేసుకునేవాళ్లం కాదని రైతులు చెబుతున్నారు. పదేళ్లలో భారాస ప్రభుత్వం రైతు అనుకూల విధానాలు చేపట్టింది. రైతుబంధు పేరిట పెట్టుబడి సాయం అందించాం. వ్యవసాయం అద్భుతమైన దశకు వెళ్లింది. పండిన ప్రతి గింజ కొన్నాం. ధాన్యం దిగుబడిలో పంజాబ్‌ను దాటేశాం.

ఇప్పుడు కరెంటు ఉంటే వార్త..

ప్రపంచమే మెచ్చిన మిషన్‌ భగీరథ నిర్వహణలో లోపాలెందుకు వస్తున్నాయి? మా హయాంలో బిందె పట్టుకుని ఏ ఆడబిడ్డ కూడా కనిపించలేదు. ఎక్కడా నీళ్ల ట్యాంకర్లు కనిపించలేదు. ఇవాళ హైదరాబాద్‌లో కూడా నీళ్ల ట్యాంకర్లు ఎందుకు కనిపిస్తున్నాయి? మా మెదడంతా కరగదీసి అద్భుతంగా కరెంట్‌ అందించాం. అప్పట్లో కరెంట్‌ పోతే వార్త.. ఇప్పుడు ఉంటే వార్త. అగ్రగామి రాష్ట్రానికి ఎందుకు చెదలు పట్టాయి? ప్రభుత్వ అసమర్థత, అలసత్వం కారణంగానే ఈ దుస్థితి తలెత్తింది. మళ్లీ జనరేటర్లు, ఇన్వెర్టర్లు, కన్వర్టర్లు వస్తున్నాయి. హైదరాబాద్‌ను పవర్‌ ఐలాండ్‌ సిటీగా మేం మార్చాం. రాత్రింబవళ్లు కొట్లాడి నేషనల్‌ పవర్‌ గ్రిడ్‌కు అనుసంధానం చేయించాం. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.

పల్లెల్లో బోర్ల హోరు వినిపిస్తోంది..

గత 8 ఏళ్లుగా బోరు బండ్లు బంద్‌ అయ్యాయి. ఇప్పుడు పల్లెల్లో బోర్ల హోరు వినిపిస్తోంది. ప్రభుత్వ తెలివి తక్కువ తనం వల్లే ఇదంతా. అద్భుతమైన తెలంగాణ వంద రోజుల్లోనే ఇలా అవుతుందని అనుకోలేదు. ఇప్పటికి కూడా సాగర్‌లో 14.. 15 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది. కేఆర్‌ఎంబీ అంటే ఎవరు.. వారేమైనా సూపర్‌ బాసా? కేంద్రమంత్రులు తియ్యగా మాట్లాడితే.. కేఆర్‌ఎంబీకి అంతా అప్పగించేశారు.  ఈ ముఖ్యమంత్రికి దిల్లీ యాత్రలే సరిపోతున్నాయి.. రైతుల బాధపట్టదు. పూటకో పీఆర్‌ స్టంట్‌ పెట్టి.. చిల్లర రాజకీయం చేస్తున్నారు. రాజకీయాలు చేద్దామంటే.. మస్తుగా చేద్దాం. అధికారం వస్తుంటది.. పోతుంటది. భారాస.. సముద్రమంత పార్టీ. ఒక్కరినో ఇద్దరినో.. మీ వైపు గుంజుకుని ఆహా ఓహో అని ఆనందపడొద్దు

డిసెంబర్‌ 9 పోయి ఎన్నాళ్లైంది?

ప్రభుత్వం మారిన నాలుగో నెల వరకూ నేను నోరు తెరిచి మాట్లాడలేదు. చరిత్రలో ఏ సీఎం మాట్లాడనంత దురుసుగా మీరు మాట్లాడినా నేను నోరు మెదపలేదు. కానీ, ఇప్పుడు లక్షల ఎకరాలు ఎండుతుంటే చూస్తూ ఉండలేకపోయా. వాగ్దానాలు అమలు చేయకపోతే మిమ్మల్ని నిద్రపోనివ్వం. పోలీసులకూ విజ్ఞప్తి చేస్తున్నా.. మీరు అతిగా పోవద్దు. మేమూ ఇలాగే చేసి ఉంటే.. కాంగ్రెస్‌ ఉండేదే కాదు. డిసెంబర్‌ 9 నాటికి రుణాలు అన్నీ మాఫీ చేస్తామన్నారు.. డిసెంబర్‌ 9 పోయి ఎన్నాళ్లైంది? మిస్టర్‌ చీఫ్‌ మినిస్టర్.. ఎక్కడ నిద్రపోతున్నావ్‌? రైతులకు చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా.. ఆత్మహత్యలు చేసుకోవద్దు’’ అని కేసీఆర్‌ కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని