KTR: మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్‌

కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు.

Published : 19 Apr 2024 10:34 IST

హైదరాబాద్‌: కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. అన్నివర్గాల ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. 120 రోజుల పాలనలోనే నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేశారని ఆరోపించారు.

‘‘నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ అగ్ర నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట మార్చారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తా పత్రికల మొదటి పేజీల్లో ప్రకటనలు ఇచ్చింది. కానీ భారాస హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంది. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. దీనిపై యూటర్న్ తీసుకోవడంతో పాటు టెట్ పరీక్ష ఫీజును రూ.400 నుంచి రూ.2 వేలకు పెంచింది. గతంలో బల్మూరి వెంకట్‌ లాంటి నాయకులు కోర్టులో కేసులు వేసి పలు పోటీ పరీక్షల రద్దుకు కారణమయ్యారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి అందుకున్నారు. ఉద్యోగాలు ఆశిస్తున్న అభ్యర్థులు మాత్రం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తమని నట్టేట ముంచిన ఆ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని