Ambati Rambabu: ఏపీకి ఇచ్చిన ప్రతీ నీటి బొట్టును రక్షించుకుంటాం: మంత్రి అంబటి

కృష్ణా జలాలపై వివాదం చాలా కాలంగా జరుగుతోందని.. 1976లో బచావత్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన అవార్డు ప్రకారమే రాష్ట్రాలు నీటిని వినియోగం చేస్తున్నాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టంచేశారు.

Updated : 07 Oct 2023 13:46 IST

అమరావతి: కృష్ణా జలాలపై వివాదం చాలా కాలంగా జరుగుతోందని.. 1976లో బచావత్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన అవార్డు ప్రకారమే రాష్ట్రాలు నీటిని వినియోగం చేస్తున్నాయని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టంచేశారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన అవార్డు ప్రకారం ఏపీకి నష్టం జరుగుతుందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్నారు. కోర్టులో స్టే ఉన్నందు వల్ల ట్రైబ్యునల్‌ ఇచ్చిన తదుపరి ఆదేశాలు అమలు కాలేదని వివరించారు. అవార్డు గెజిట్‌లోనూ ప్రచురణ చేయలేదన్నారు. 

తాజాగా బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ పొడిగించడం ఏపీకి ఆమోద యోగ్యం కాదని.. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తప్పని చెప్పారు. దీనిపై కేంద్ర హోంమంత్రికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారని, ప్రధానికి లేఖ కూడా రాశారని వివరించారు. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ను పొడిగిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంపై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని అంబటి స్పష్టం చేశారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన అవార్డే తుది నిర్ణయమన్నారు. ఏపీకి 511, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రానికి ఇచ్చిన ప్రతీ నీటి బొట్టును రక్షించుకుంటామన్నారు. ఏపీ, తెలంగాణలకు న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాలు రావాల్సిందేనని తేల్చిచెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని