YS Sharmila: జగన్‌.. మీరు ఏం చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు: షర్మిల

నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్‌ ప్రత్యేక హోదాను విస్మరించారని కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

Updated : 26 Feb 2024 22:02 IST

అనంతపురం: నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్‌ ప్రత్యేక హోదాను విస్మరించారని కాంగ్రెస్‌ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) విమర్శించారు. అనంతపురంలో నిర్వహించిన ‘కాంగ్రెస్‌ న్యాయ సాధన సభ’కు  ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. ఒక్కమాట కూడా నిలబెట్టుకోని జగన్‌ వైఎస్‌ రాజశేఖర్‌ వారసుడు ఎలా అవుతారు?అని ప్రశ్నించారు.

‘‘ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. హోదా కోసం గతంలో జగనన్న దీక్షలు చేశారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే హోదా ఎందుకు రాదని ప్రశ్నించారు. ప్రజలు జగన్‌ను నమ్మి గెలిపించారు. మరి సీఎం అయ్యాక ఆయన ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేశారా? అధికారంలోకి వచ్చాక వైకాపా ఎంపీలు రాజీనామా చేశారా? అధికారంలోకి రాగానే 23 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తానని చెప్పి ఇప్పుడు ఎన్నికల వేళ హడావుడిగా 6వేల పోస్టులతో దగా డీఎస్సీ వేశారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా? కాంగ్రెస్‌ తరఫున పోరాటం చేసిన నన్ను.. ఒక మహిళనని చూడకుండా దారుణంగా ప్రవర్తించి అడ్డుకున్నారు. జగన్‌ తన పాలనలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు.  మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి.. ప్రభుత్వం ద్వారానే నాసిరకం మద్యం అమ్ముతున్నారు.

గతంలో పార్టీని నడిపిస్తే.. దూషిస్తున్నారు

గతంలో 3 వేల కి.మీ పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టాను. అలాంటిది.. చెల్లినని చూడకుండా నాపై, నా భర్తపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. డబ్బులు పెట్టి సోషల్‌మీడియాలో దూషిస్తున్నారు. జగన్‌.. మీరు ఏం చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. నేను వైఎస్‌ రాజశేఖర్ బిడ్డని. రాష్ట్ర ప్రజలకు మేలు చేయడం కోసమే ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టా. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక.. ఇందిరమ్మ అభయం కింద ఇంటింటికి మహిళల పేరు మీద రూ.5 వేల ఆర్థిక సాయం అందజేస్తాం’’ అని షర్మిల తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని