KL Narayana: మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్‌.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు

‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్‌. నారాయణ. బడ్జెట్‌ గురించి ఏమన్నారంటే?

Published : 02 May 2024 10:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర దర్శకుడు రాజమౌళి (Rajamouli), స్టార్‌ హీరో మహేశ్‌ బాబు (Mahesh Babu) తనకిచ్చిన మాట నిలబెట్టుకున్నారని నిర్మాత కె.ఎల్‌. నారాయణ (KL Narayana) అన్నారు. #SSMB29 (వర్కింగ్‌ టైటిల్‌)ని వాళ్లే స్వయంగా ప్రకటించి, పనిపై ఉన్న నిబద్ధతను చాటారని కొనియాడారు. ‘హలో బ్రదర్‌’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘సంతోషం’ వంటి హిట్‌ చిత్రాలను నిర్మించారాయన. సుదీర్ఘ విరామం అనంతరం ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ని ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆ సినిమా సంగతులు పంచుకున్నారు.

‘‘ఉద్దేశపూర్వకంగా నేను నిర్మాతగా విరామం తీసుకోలేదు. రాజమౌళి- మహేశ్‌ బాబు కాంబినేషన్‌ సినిమాను 15 ఏళ్ల క్రితమే ఫిక్స్‌ చేశాం. ఇప్పుడు వాళ్లిద్దరి క్రేజ్‌ మరో స్థాయిలో ఉంది. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి నాకు సినిమా చేస్తున్నారు. నేను చెప్పకపోయినా ‘దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌’లో మూవీ తీయనున్నట్లు వాళ్లే ప్రకటించారు. అందుకు వాళ్లకి కృతజ్ఞుడిని. రాజమౌళికి హాలీవుడ్‌ నుంచీ ఆఫర్లు వచ్చాయి. వాటిని కాదనుకుని నా కోసం సినిమా చేస్తున్నారు. రెండు నెలల నుంచి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ సాగుతోంది’’

‘‘నిర్మాతలు కథా చర్చల్లో పాల్గొనరనే మాట ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంటుంది. అది అందరి విషయంలో నిజం కాదు. రాజమౌళి ప్రతి విషయాన్ని నిర్మాతలతో పంచుకుంటారు. పేపర్‌ వర్క్‌ చేస్తున్నప్పుడే క్లారిటీ ఉండడం మంచిదనే ఉద్దేశంతో ఏమైనా సందేహం ఉంటే చెప్పమని అడుగుతారు. చిన్న పాయింట్‌నీ ఆయన ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తారో దగ్గర ఉండి చూస్తున్నా. పాత్రకు తగ్గట్టు మహేశ్‌ తనని తాను మలుచుకుంటున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబరులో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం కాబట్టి ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకునే ప్లాన్‌ చేస్తున్నారు. స్టోరీ బాగుంది. బడ్జెట్‌ని ఇంకా డిసైడ్‌ చేయలేదు. ప్రొడక్టుకు ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టేందుకు సిద్ధం’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని