ఇక పరిశోధకులకు ‘శ్రీమాన్‌’

ప్రభుత్వ నిధులతో నడిచే శాస్త్ర, సాంకేతిక సంస్థల్లోని ఖరీదైన సాధన సంపత్తిని  ఉపయోగించుకునే వెసులుబాటు చిన్న నగరాల్లోని పరిశోధకులకు లభించనుంది. ఇందుకు వారు స్వల్ప రుసుములు చెల్లిస్తే

Published : 23 May 2022 05:01 IST

సాధన సంపత్తిని పంచుకోనున్న ప్రభుత్వ ల్యాబ్‌లు

కేంద్రం మార్గదర్శకాలు

దిల్లీ: ప్రభుత్వ నిధులతో నడిచే శాస్త్ర, సాంకేతిక సంస్థల్లోని ఖరీదైన సాధన సంపత్తిని  ఉపయోగించుకునే వెసులుబాటు చిన్న నగరాల్లోని పరిశోధకులకు లభించనుంది. ఇందుకు వారు స్వల్ప రుసుములు చెల్లిస్తే సరిపోతుంది. ఈ మేరకు కేంద్రం ‘సైంటిఫిక్‌ రీసెర్చ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేరింగ్‌ మెయింటెనెన్స్‌ అండ్‌ నెట్‌వర్క్స్‌’ (శ్రీమాన్‌) పేరిట మార్గదర్శకాలు రూపొందించింది. తాజాగా వీటిని శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ విడుదల చేశారు.  అధునాతన పరిశోధనలకు సంబంధించిన సాధనాల్లో 90 శాతం.. దిగుమతుల ద్వారా వచ్చినవేనని ఆయన పేర్కొన్నారు. వాటిని మిగతా పరిశోధకులతో పంచుకోవడంలేదన్నారు. దీన్ని అధిగమించడమే ‘శ్రీమాన్‌’ ఉద్దేశమన్నారు. ‘‘పరిశోధన, నూతన ఆవిష్కరణల్లో శాస్త్రీయ మౌలిక వసతులే పునాది. వాటిని పంచుకోవడం కీలక లక్ష్యం కావాలి. పరిమిత వనరులున్న భారత్‌ వంటి దేశాలకు ఇది చాలా ముఖ్యం’’ అని ఆయన వివరించారు. ‘శ్రీమాన్‌’లోని ముఖ్యాంశాలివీ..

* ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఆధారంగా ప్రభుత్వ పరిశోధన సంస్థలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. భవిష్యత్‌లో వాటికి అందే నిధులపైనా ఇది ప్రభావం చూపనుంది.

* ఆయా సంస్థల్లో పంచుకోవడానికి వీలైన, వీలుకాని మౌలిక వసతులను గుర్తించే విచక్షణాధికారం కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు ఉంటుంది. వ్యూహాత్మక విభాగాల విషయంలో మాత్రం ఆ అధికారం సంబంధిత సంస్థలకే ఉంటుంది.

* ఈ మౌలిక వసతులను ఉపయోగించుకొని చేసే ఆవిష్కరణలపై మేధో హక్కులు వాటిని చేపట్టిన పరిశోధకులకే దక్కుతాయి. సాధన సంపత్తిని అందించిన సంస్థలకు ఎలాంటి హక్కులు ఉండవు.

* పరిశోధన పరికరాల తయారీకి అంకుర పరిశ్రమలను ఏర్పాటు చేసేలా విశ్వవిద్యాలయాలు, పరిశోధన, అభివృద్ధి సంస్థలను ప్రోత్సహిస్తారు. ఆ సాధనాల నిర్వహణకు నిపుణులను తయారుచేయడం కూడా శ్రీమాన్‌ లక్ష్యాల్లో ఒకటి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని