T20 World Cup: అఫ్గానిస్థాన్‌ అదరహో..

పొట్టి ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌కు అదిరే ఆరంభం. బ్యాటుతో దంచేసి, స్పిన్‌తో మాయ చేసిన ఆ జట్టు.. ఏకపక్షంగా సాగిన సూపర్‌ 12 పోరులో స్కాట్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది.

Updated : 26 Oct 2021 06:01 IST

విజృంభించిన ముజీబ్‌, రషీద్‌ ఖాన్‌

స్కాట్లాండ్‌ చిత్తు చిత్తు

షార్జా

పొట్టి ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌కు అదిరే ఆరంభం. బ్యాటుతో దంచేసి, స్పిన్‌తో మాయ చేసిన ఆ జట్టు.. ఏకపక్షంగా సాగిన సూపర్‌ 12 పోరులో స్కాట్లాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది.

అఫ్గానిస్థాన్‌ టీ20 ప్రపంచకప్‌ పోరును ఘనంగా ప్రారంభించింది. టోర్నీలో తన తొలి మ్యాచ్‌లో సోమవారం 130 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌పై ఘనవిజయం సాధించింది. నజిబుల్లా జద్రాన్‌ (59; 34 బంతుల్లో 5×4, 3×6), హజ్రతుల్లా జజాయ్‌ (44; 30 బంతుల్లో 3×4, 3×6), గుర్బాజ్‌ (46; 37 బంతుల్లో 1×4, 4×6) మెరవడంతో మొదట అఫ్గానిస్థాన్‌ 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. ముజీబ్‌ (5/20), రషీద్‌ ఖాన్‌ (4/9) స్పిన్‌ మాయాజాలానికి ఛేదనలో స్కాట్లాండ్‌ విలవిల్లాడింది. 10.2 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. మున్సే (25) టాప్‌ స్కోరర్‌. అయిదుగురు బ్యాట్స్‌మెన్‌ డకౌటయ్యారు. మొదట్లో స్కాట్లాండ్‌ బాగానే ఆడుతున్నట్లనిపించింది. మూడు ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 27 పరుగులు చేసింది. కానీ ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా ఆ జట్టును ముజీబ్‌ కోలుకోలేని దెబ్బతీశాడు. నాలుగో ఓవర్లో అతడు కొయిట్జర్‌, మెక్‌లాయిడ్‌, బెరింగ్టన్‌లను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌ పేక మేడను తలపించింది. రషీద్‌ ఖాన్‌ కూడా విజృంభించడంతో చాలా వేగంగా ఆ జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది. స్పిన్‌ ఎలా ఎదుర్కోవాలో స్కాట్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం అర్థం కాలేదు. ముజీబ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

దంచేశారు..: బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా చెలరేగడంతో అంతకుముందు అఫ్గానిస్థాన్‌ భారీ స్కోరు సాధించింది. ఆ జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా.. వచ్చిన ప్రతి బ్యాట్స్‌మనూ దంచి కొట్టాడు. ఓపెనర్లు జజాయ్‌, షెజాద్‌ (22) అదిరే ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్లో రెండే పరుగులు రాగా.. లీస్క్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో జజాయ్‌ ఓ ఫోర్‌, సిక్స్‌, షెజాద్‌ ఓ సిక్స్‌ కొట్టారు. వీల్‌ బౌలింగ్‌లో జజాయ్‌ వరుసగా 6, 4 దంచాడు. ఆరో ఓవర్లో షెజాద్‌ నిష్క్రమించేటప్పటికి స్కోరు 54. ఆ తర్వాత స్కాట్లాండ్‌ బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో స్కోరు వేగం తగ్గింది. గుర్బాజ్‌ వేగంగా ఆడలేకపోయాడు. పదో ఓవర్లో జజాయ్‌ వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 82. నజిబుల్లా జద్రాన్‌ క్రీజులోకి రావడం, గుర్బాజ్‌ కూడా జోరందుకోవడంతో తర్వాత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. బౌండరీతో ఖాతా తెరిచిన నజిబుల్లా.. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఎడాపెడా ఫోర్లు సిక్స్‌లు బాదాడు. 30 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన అతడు.. ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి ఔటయ్యాడు. నజిబుల్లా జోరుతో అఫ్గాన్‌ చివరి ఆరు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 74 పరుగులు రాబట్టింది. నజిబుల్లా.. గుర్బాజ్‌తో మూడో వికెట్‌కు 87, నబి (11 నాటౌట్‌)తో నాలుగో వికెట్‌కు 21 పరుగులు జోడించాడు. స్కాట్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ వ్యాట్‌ (1/23), షరీఫ్‌ (2/33) మెరుగ్గా బౌలింగ్‌ చేశారు.

అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌: హజ్రతుల్లా జజాయ్‌ (బి) వ్యాట్‌ 44; షెజాద్‌ (సి) గ్రీవ్స్‌ (బి) షరీఫ్‌ 22; గుర్బాజ్‌ (సి) కొయిజర్‌ (బి) డేవీ 46; నజ్‌బుల్లా జద్రాన్‌ (సి) వీల్‌ (బి) షరీఫ్‌ 59; నబి నాటౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 190; వికెట్ల పతనం: 1-54, 2-82, 3-169, 4-190; బౌలింగ్‌: బ్రాడ్‌ వీల్‌ 4-0-42-0; మైకెల్‌ లీస్క్‌ 1-0-18-0; సఫ్యాన్‌ షరీఫ్‌ 4-0-33-2; జోష్‌ డేవీ 4-0-41-1; మార్క్‌ వ్యాట్‌ 4-0-23-1; క్రిస్‌ గ్రీవ్స్‌ 3-0-30-0

స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌: మున్సే (బి) ముజీబ్‌ 25; కొయిట్జర్‌ (బి) ముజీబ్‌ 10; మెక్‌లాయిడ్‌ ఎల్బీ (బి) ముజీబ్‌ 0; బెరింగ్టన్‌ ఎల్బీ (బి) ముజీబ్‌ 0; మాథ్యూ క్రాస్‌ (సి) షెజాద్‌ (బి) నవీనుల్‌ 0; లీస్క్‌ ఎల్బీ (బి) రషీద్‌ 0; గ్రీవ్స్‌ ఎల్బీ (బి) రషీద్‌ 12; వ్యాట్‌ (బి) ముజీబ్‌ 1; డేవీ ఎల్బీ (బి) రషీద్‌ 4; షరీఫ్‌ నాటౌట్‌ 3; బ్రాడ్‌ వీల్‌ (బి) రషీద్‌ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (10.2 ఓవర్లలో ఆలౌట్‌) 60; వికెట్ల పతనం: 1-28, 2-28, 3-28, 4-30, 5-36, 6-38, 7-45, 8-53, 9-60; బౌలింగ్‌: నబి 1-0-11-0; ముజీబుర్‌ రెహ్మాన్‌ 4-0-20-5; నవీనుల్‌ హక్‌ 2-0-12-1; రషీద్‌ ఖాన్‌ 2.2-0-9-4; కరీమ్‌ జనత్‌ 1-0-6-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని