WTC Final 2023: మేం గెలవడానికి ప్రధాన కారణమదే: ఆసీస్‌ ప్రధాన కోచ్‌

రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final 2023) మ్యాచ్‌లో భారత్‌పై ఆసీస్‌ విజయం సాధించి గదను సొంతం చేసుకుంది. ఇక మూడో సీజన్ కోసం ఆస్ట్రేలియా సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆసీస్‌ ప్రధాన కోచ్‌ ఆండ్రూ మెక్‌డోనాల్డ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 13 Jun 2023 15:49 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC Final) ఫైనల్‌లో భారత్‌ ఓడించి టెస్టు ‘గద’ను ఆస్ట్రేలియా పట్టుకుపోయింది. ఇంగ్లాండ్‌లోని కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగడం వల్లే ఆసీస్‌కు కలిసొచ్చిందనే వాదనా ఉంది. అయితే, తాము ఉపఖండంలో పర్యటించడం వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుని గదను సొంతం చేసుకున్నట్లు ఆసీస్‌ ప్రధాన కోచ్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ విశ్లేషించాడు. 2019-21 సీజన్‌లో ఓవర్‌ రేట్‌ పెనాల్టీల కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రాలేకపోయామని.. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నట్లు పేర్కొన్నాడు. ‘‘ఉపఖండంలో మా పర్యటన పాకిస్థాన్‌ నుంచి శ్రీలంక మీదుగా భారత్‌కు సాగింది. అక్కడ సాధించిన విజయాల వల్లే ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోగలిగాం. విజయం సాధించాం’’ అని తెలిపాడు. 

‘‘ఆసీస్‌ గడ్డపై మేం చాలా బలమైన టీమ్‌ అని తెలుసు. అందుకే చాలా మంది ఇక్కడే గెలవడం వల్ల మా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుందని భావిస్తారు. కానీ మేం పాక్‌, శ్రీలంకతోపాటు భారత్‌లో టెస్టు విజయాలు నమోదు చేయడంతోనే ఫైనల్‌ బెర్తు ఖరారైంది. కొత్తగా వచ్చినప్పుడు సరైన ప్రణాళికతో ముందుకు సాగలేకపోయాం. కొన్నిసార్లు ఓవర్‌రేట్‌ వల్ల మొదటి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లలేకపోయాం. ఇప్పుడు మాత్రం ఓ పద్ధతి ప్రకారం ఆ ఓవర్‌ రేట్‌ పెనాల్టీల భారం పడకుండా ముందుకు సాగాం. చివరికి విజయం సాధించాం. ఇక నుంచి మేం యాషెస్ సిరీస్‌పై దృష్టిసారిస్తాం’’ అని మెక్‌డోనాల్డ్‌ పేర్కొన్నాడు.

డబ్ల్యూటీసీ రెండో సీజన్‌లో భారత పర్యటనకు ముందు ఆసీస్‌ తొలుత పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడింది. అందులో 1-0 ఆధిక్యంతో టెస్టు సిరీస్‌ను గెలిచింది. ఆ తర్వాత శ్రీలంకపై రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. ఇక భారత్‌లోకి అడుగు పెట్టిన ఆసీస్‌ నాలుగు టెస్టుల బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీని 1-2తేడాతో ఓడిపోయింది. అయితే ఒక టెస్టు గెలవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక శుక్రవారం నుంచే ఇంగ్లాండ్‌ - ఆసీస్ జట్ల మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ మూడో సీజన్‌ (2023-25) సైకిల్‌ మొదలుకానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు