ఛాంపియన్స్‌ ట్రోఫీకి మూడు వేదికలు

ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం టీమ్‌ఇండియా పాకిస్థాన్‌కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్‌లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.

Updated : 30 Apr 2024 04:27 IST

లాహోర్‌: ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం టీమ్‌ఇండియా పాకిస్థాన్‌కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్‌లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది. వచ్చే ఏడాది జరిగే ఈ టోర్నీ కోసం మూడు వేదికలను ఖరారు చేసింది. లాహోర్‌, కరాచి, రావల్పిండిలో టోర్నీ మ్యాచ్‌లు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ‘‘ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీకి పంపించాం. లాహోర్‌, కరాచి, రావల్పిండిలను వేదికలుగా ఎంపిక చేశాం. బోర్డు భద్రత బృందం పాక్‌కు వచ్చి ఏర్పాట్లను పరిశీలించింది. టోర్నీని సజావుగా నిర్వహిస్తామనే నమ్మకం ఉంది’’ అని పీసీబీ ఛైర్మన్‌ మోహిస్‌ నఖ్వి తెలిపాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరుగుతుందని భావిస్తున్న ఈ ఈవెంట్లో పాల్గొనే విషయాన్ని భారత్‌ ఇంకా ఖరారు చేయలేదు. గతేడాది పాక్‌ ఆతిథ్యం ఇచ్చిన ఆసియాకప్‌లో పాక్‌లో ఆడటానికి భారత్‌ నిరాకరించడంతో.. ‘హైబ్రిడ్‌ మోడల్‌’లో కొన్ని మ్యాచ్‌లు పాక్‌లో కొన్ని శ్రీలంకలో నిర్వహించారు. కానీ ఈసారి ఛాంపియన్స్‌ ట్రోఫీలో అన్ని మ్యాచ్‌లు తామే నిర్వహించాలని పాక్‌ పట్టుదలగా ఉంది.


ఐఎస్‌ఎల్‌ ఫైనల్లో మోహన్‌బగాన్‌ × ముంబయి

ముంబయి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో తుదిపోరుకు రంగం సిద్ధమైంది. శనివారం కోల్‌కతాలో జరిగే ఫైనల్లో మోహన్‌బగాన్‌తో ముంబయి ఎఫ్‌సీ టైటిల్‌ కోసం తలపడనుంది. సోమవారం రెండో అంచె సెమీస్‌లో ముంబయి 2-0 గోల్స్‌తో గోవాను ఓడించింది. దియాజ్‌ (69వ ని), చాంగ్తె (83వ) ముంబయి విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలి అంచెలో ముంబయి 3-2తో గోవాపై గెలిచింది. ఒడిశా ఎఫ్‌సీపై గెలిచి మోహన్‌బగాన్‌ ఫైనల్‌ చేరిన సంగతి తెలిసిందే.


బాక్సింగ్‌లో మూడు పతకాలు ఖాయం

అస్తానా (కజకిస్థాన్‌): ఆసియా అండర్‌-22 యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు పతకాలు ఖాయమయ్యాయి. బ్రిజేశ్‌ (48 కేజీ), సాగర్‌ (60 కేజీ), సుమిత్‌ (67 కేజీ) సెమీఫైనల్లో అడుగుపెట్టారు. బ్రిజేశ్‌ 4-3తో సరిబోవ్‌ సైఫుద్దీన్‌ (ఉజ్బెకిస్థాన్‌)పై కష్టపడి గెలిచాడు. సాగర్‌ 5-0తో కలాసీరమ్‌ (థాయ్‌లాండ్‌)ను చిత్తు చేయగా.. సుమిత్‌ అంతే తేడాతో హాంగ్‌ సియో (కొరియా)పై విజయం సాధించాడు. తాజాగా మూడు పతకాలతో భారత్‌ ఖాతాలో మొత్తం ఎనిమిది పతకాలు చేరాయి. అన్ను (48 కేజీ), పార్థవి గ్రెవాల్‌ (66 కేజీ), నితిక చంద్‌ (60 కేజీ), ఖుషి పునియా (81 కేజీ), నిర్హార (81 కేజీల పైన) సెమీఫైనల్‌ నుంచే పోటీ షురూ చేయబోతున్నారు. పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్రీతి (54 కేజీ) మంగళవారం పోటీ ఆరంభించనుంది. ఆమెతో పాటు తమన్నా (50 కేజీ), ప్రియాంక (60 కేజీ), విశ్వనాథ్‌ (48 కేజీ), ఆకాశ్‌ (60 కేజీ), ప్రీత్‌ మలిక్‌ (67 కేజీ), కునాల్‌ (75 కేజీ), జుగ్నూ (86 కేజీ), రిథమ్‌ (92 కేజీపైన) కూడా బరిలో నిలవనున్నారు.


ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌కు అదే జట్టుతో..

దిల్లీ: ఇస్తాంబుల్‌లో త్వరలో ఆరంభమయ్యే ఆఖరి ఒలింపిక్‌ రెజ్లింగ్‌ అర్హత టోర్నీకి భారత్‌ దాదాపు మార్చిలో బిష్కెక్‌ టోర్నీలో తలపడిన జట్టునే ఎంపిక చేసింది. గత ఈవెంట్లో భారత రెజ్లర్లు ఆశించినట్లుగా రాణించకపోవడంతో మళ్లీ ట్రయల్స్‌ నిర్వహించి జట్టును ఎంపిక చేయాలని సమాఖ్య భావించింది. కానీ సమయం తక్కువగా ఉండడంతో దాదాపు అదే బృందాన్ని ఇస్తాంబుల్‌కు కూడా పంపిస్తోంది. వరదల కారణంగా దుబాయ్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయి బిష్కెక్‌ టోర్నీకి దూరమైన స్టార్‌ రెజ్లర్‌ దీపక్‌ పునియా ఆఖరి అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. ఈ టోర్నీలో మొత్తం ఆరు వెయిట్‌ కేటగిరిల్లో 54 పారిస్‌ ఒలింపిక్‌ కోటా స్థానాలు అందుబాటులో ఉన్నాయి.

భారత జట్టు

ఫ్రీస్టయిల్‌: అమన్‌ (57 కేజీ), సుజీత్‌ (65 కేజీ), జైదీప్‌ (74 కేజీ), దీపక్‌ పునియా (86 కేజీ), దీపక్‌ (97 కేజీ), సుమిత్‌ (125 కేజీ);

మహిళలు: మాన్సి (62 కేజీ), నిషా (68 కేజీ)

గ్రీకో రోమన్‌: సమిత్‌ 60 కేజీ), అషు (67 కేజీ), వికాశ్‌ (77 కేజీ), సునీల్‌కుమార్‌  (87 కేజీ), నితీశ్‌ (97 కేజీ), నవీన్‌ (130 కేజీ);

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని