క్వార్టర్స్‌లో భారత్‌

ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్‌ఫైనల్స్‌లో ప్రవేశించగా.. తాజాగా థామస్‌ కప్‌లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది.

Published : 30 Apr 2024 03:57 IST

థామస్‌కప్‌ బ్యాడ్మింటన్‌

చెంగ్‌డూ (చైనా): ఉబెర్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్‌ఫైనల్స్‌లో ప్రవేశించగా.. తాజాగా థామస్‌ కప్‌లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. సోమవారం గ్రూప్‌-సి పోరులో భారత్‌ 5-0తో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. తొలి సింగిల్స్‌లో ప్రణయ్‌ 21-15, 21-15తో హ్యారీ హాంగ్‌ను ఓడించి శుభారంభం ఇచ్చాడు. మొదటి గేమ్‌లో ప్రణయ్‌ దూకుడుగా ఆడాడు. తన శైలిలో స్మాష్‌లు కొడుతూ 4-1 ఆధిక్యంలో నిలిచాడు. అదే జోరు కొనసాగిస్తూ 11-6తో బ్రేక్‌కు వెళ్లాడు. విరామం తర్వాతా ప్రణయ్‌దే జోరు. చక్కని ప్లేస్‌మెంట్లతో పాయింట్లు రాబట్టిన భారత స్టార్‌ 19-11తో ఆధిక్యంలోకి వెళ్లడమే కాక అదే ఊపులో గేమ్‌ గెలిచాడు. రెండో గేమ్‌లో హాంగ్‌ దూకుడుగా ఆడి 6-3తో నిలిచాడు. కానీ ప్రణయ్‌ పుంజుకున్నాడు. వరుస పాయింట్లు సాధించి 7-6తో ఆధిక్యంలో నిలిచాడు. విరామ సమయానికి 10-11తో స్వల్పంగా వెనుకబడినా.. బ్రేక్‌ తర్వాత ప్రణయ్‌ జోరు ప్రదర్శించాడు. క్రాస్‌కోర్టు షాట్లతో విజృంభించి 17-12తో నిలవడమే కాక అదే జోరుతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ కైవసం చేసుకున్నాడు.

సాత్విక్‌ జోడీ కష్టంగా..: డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి 21-17, 19-21, 21-15తో బెన్‌ లేన్‌-సీన్‌ వాండీ జోడీపై కష్టపడి గెలిచింది. మొదటి నుంచే బెన్‌-సీన్‌ జంట నుంచి భారత ద్వయానికి గట్టిపోటీ ఎదురైంది. అయినా తొలి గేమ్‌లో గెలిచి ఆధిక్యంలో నిలిచిన భారత జంటకు రెండో గేమ్‌లో ప్రత్యర్థి జంట నుంచి మరింత ప్రతిఘటన ఎదురైంది. దీంతో విరామ సమయానికి సాత్విక్‌ ద్వయం 8-11తో వెనుకబడింది. ఆ తర్వాత పోరాడి 18-19తో ప్రత్యర్థికి సమీపంగా వచ్చినా.. గేమ్‌ దక్కించుకోలేకపోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో భారత జోడీకి పోటీ తప్పలేదు. ఒక దశలో స్కోరు 4-4తో సమమైంది. బ్రేక్‌ సమయానికి 11-8తో ఆధిక్యంలో నిలిచిన సాత్విక్‌ ద్వయం.. విరామం తర్వాత చెలరేగింది. ప్రత్యర్థి ద్వయం నుంచి పోటీ ఎదురైనా నిలిచి 19-14తో ఆధిక్యంలోకి వెళ్లడమే కాక.. అదే దూకుడుతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. రెండో సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 21-16, 21-11తో నదీమ్‌ దాల్వీపై, డబుల్స్‌లో అర్జున్‌-ధ్రువ్‌ కపిల ద్వయం 21-17, 21-19తో రోరీ ఈస్టన్‌-అలెక్స్‌ గ్రీన్‌ జంటపై గెలవడంతో భారత్‌ 4-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. చివరి సింగిల్స్‌లో కిరణ్‌ జార్జ్‌ 21-18, 21-12తో చొలాన్‌ కయాన్‌పై నెగ్గి భారత్‌కు 5-0తో ఘన విజయాన్ని అందించాడు. బుధవారం చివరి గ్రూప్‌ పోరులో పద్నాలుగుసార్లు ఛాంపియన్‌ ఇండోనేషియాతో భారత్‌ తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని