డ్రానా.. డ్రామానా!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రిజర్వ్‌ డే (ఆరో రోజు)లోకి అడుగుపెట్టింది. వర్షంతో చాలా ఆటే వృథా అయినా మ్యాచ్‌పై ఇంకా ఆసక్తి లేకపోలేదు. డ్రా అవకాశాలే మెండు అయినా.. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఫలితం తేలే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేం.

Updated : 23 Jun 2021 02:45 IST

తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కు 32 పరుగుల ఆధిక్యం
రాణించిన షమి, ఇషాంత్‌
డబ్ల్యూటీసీ ఫైనల్‌
భారత్‌ 64/2

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రిజర్వ్‌ డే (ఆరో రోజు)లోకి అడుగుపెట్టింది. వర్షంతో చాలా ఆటే వృథా అయినా మ్యాచ్‌పై ఇంకా ఆసక్తి లేకపోలేదు. డ్రా అవకాశాలే మెండు అయినా.. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఫలితం తేలే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేం. భారత్‌ విలువైన 32 పరుగుల ఆధిక్యం కోల్పోయి, ప్రస్తుతం 64/2 తో ఉంది. చేతిలో ఇంకా 8 వికెట్లే ఉన్నప్పటికీ ముప్పు లేదని చెప్పలేం. కఠిన పరిస్థితుల్లో.. కివీస్‌ పదునైన పేస్‌ దళాన్ని కాచుకుని.. కోహ్లీసేన కుప్పకూలకుండా తనను తాను కాపాడుకోవాలి.

సౌథాంప్టన్‌

బ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్‌ను భారత్‌ కట్టడి చేసినా ఆధిక్యాన్ని మాత్రం కోల్పోయింది. మ్యాచ్‌ ఫలితం ఎలా ఉంటుందన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత లేకున్నా.. టీమ్‌ ఇండియాకు సవాలు తప్పదు. 101/2తో అయిదో రోజు, మంగళవారం తొలి ఇన్నింగ్స్‌  కొనసాగించిన కివీస్‌.. షమి (4/76), ఇషాంత్‌ (3/48) ధాటికి 249 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన   విలియమ్సన్‌ (49; 177 బంతుల్లో 6×4) తన జట్టు ఆధిక్యం సంపాదిండంలో కీలక పాత్ర పోషించాడు. ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (8) త్వరగానే వెనుదిరిగాడు. ఆచితూచి ఆడిన గిల్‌.. చివరికి సౌథీకి వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే పుజారా (12 బ్యాటింగ్‌)తో కలిసి రోహిత్‌ జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను నడిపించడంతో భారత్‌ మరో వికెట్‌ పడకుండా రోజును ముగిస్తుందనిపించింది. కానీ ఆఖర్లో రోహిత్‌(30)ను ఔట్‌ చేయడం ద్వారా కివీస్‌ను సౌథీ ఆధిక్యంలో నిలిపాడు. రోహిత్‌ స్థానంలో వచ్చిన కోహ్లి (8 బ్యాటింగ్‌) కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. పుజారాతో పాటు అతడు క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం 32 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్‌.. బుధవారం తొలి సెషన్లో ఎలా ఆడుతుందన్నదే కీలకం. సహకరిస్తున్న పిచ్‌పై జోరు మీదున్న కివీస్‌ పేసర్లను ఎదుర్కోవడం అంత తేలికేమీ కాదు. కాస్త పైచేయిలో ఉన్న ప్రత్యర్థి, సానుకూల ఫలితం కోసం గట్టిగా ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 217 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

షమి సూపర్‌: భారత్‌ న్యూజిలాండ్‌ను కట్టడి చేయగలిగిందంటే, తిరిగి గట్టిగా పోటీలోకి వచ్చిందంటే ప్రధాన కారణం షమినే. పదునైన పేస్‌ బౌలింగ్‌తో అతడు బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా ఆరంభం కాగా.. కివీస్‌  పతనాన్ని అతడు శాసించాడు. 101/2తో కాస్త మెరుగైన స్థితిలోనే అయిదో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కివీస్‌.. లంచ్‌ సమయానికే 135/5తో ఇక్కట్లలో పడింది. షమితో పాటు ఇషాంత్‌ బ్యాట్స్‌మెన్‌ను పరీక్షించాడు. వర్షం కారణంగా నాలుగోరోజు తుడిచిపెట్టుకుపోగా.. మంగళవారం కివీస్‌ పతనం ఆరంభం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. టేలర్‌ (11)ను ఔట్‌ చేయడం ద్వారా మూడో వికెట్‌ భాగస్వామ్నాన్ని విడదీశాడు షమి. షమి ఫులర్‌ లెంగ్త్‌ డెలివరీని డ్రైవ్‌ చేయబోయిన టేలర్‌.. షార్ట్‌ కవర్‌లో శుభ్‌మన్‌ డైవ్‌ చేస్తూ అందుకున్న చక్కని క్యాచ్‌కు నిష్క్రమించాడు.కాసేపటికే నికోల్స్‌ (7)ను ఇషాంత్‌ పెవిలియన్‌ దారి పట్టించాడు. ఆ తర్వాత షమి ఓ అద్భుతమైన బంతితో వాట్లింగ్‌ (1)ను బౌల్డ్‌ చేశాడు. వికెట్లు పోతుండడంతో మరోవైపు కేన్‌ విలియమ్సన్‌కు పూర్తి రక్షణాత్మకంగా ఆడక తప్పలేదు. ఓవర్‌నైట్‌ స్కోరు 12తో ఇన్నింగ్స్‌ కొనసాగించిన విలియమ్సన్‌ 75 బంతుల్లో 7 పరుగులే జోడించాడు. అయితే బుమ్రా బౌలింగ్‌ మాత్రం భారత్‌ను నిరాశపరిచింది. షార్ట్‌, వైడ్‌గా బౌలింగ్‌ చేసిన అతడు ప్రభావం చూపలేకపోయాడు.

నిలిచిన కేన్‌

బౌలర్ల జోరు చూస్తే భారత్‌కే ఆధిక్యం దక్కేలా కనిపించింది. కానీ మొండిగా క్రీజులో పాతుకుపోయిన కేన్‌ విలియమ్సన్‌.. భారత్‌కు, ఆధిక్యానికి మధ్య నిలిచాడు. చిన్న చిన్న భాగస్వామ్యాలతోనే తన జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. లంచ్‌ తర్వాత చక్కని బౌలింగ్‌ను కొనసాగించిన షమి.. కాసేపు నిలిచిన గ్రాండ్‌హోమ్‌ (13)ను ఔట్‌ చేయడంతో కివీస్‌ను చుట్టేసే అవకాశం భారత్‌కు దక్కింది. అయితే జేమీసన్‌ (21)తో ఏడో వికెట్‌కు 30 పరుగులు జోడించిన విలియమ్సన్‌.. ఆ తర్వాత సౌథీ (30)తో 29 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఎనిమిదో వికెట్‌గా నిష్క్రమించాడు. జేమీసన్‌ను షమి ఔట్‌ చేయగా.. విలియమ్సన్‌ను ఇషాంత్‌ చక్కని డెలివరీతో వెనక్కి పంపడంతో భారత్‌ ఊపిరిపీల్చుకుంది. కేన్‌ నిష్క్రమించేటప్పటికి స్కోరు 221. తర్వాత వాగ్నర్‌ (0)ను అశ్విన్‌ ఔట్‌ చేయగా.. సౌథీని చివరి వికెట్‌గా జడేజా పెవిలియన్‌ చేర్చాడు. ఎంతో విలువైన పరుగులు జోడించిన సౌథీ రెండు సిక్స్‌లు కొట్టాడు. 26 ఓవర్లు వేసిన బుమ్రా ఒక్క వికెట్టూ పడగొట్టలేకపోయాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 217;

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లేథమ్‌ (సి) కోహ్లి (బి) అశ్విన్‌ 30; కాన్వే (సి) షమి (బి) ఇషాంత్‌ 54; విలియమ్సన్‌ (సి) కోహ్లి (బి) ఇషాంత్‌ 49; టేలర్‌ (సి) శుభ్‌మన్‌ (బి) షమి 11; నికోల్స్‌ (సి) రోహిత్‌ (బి) ఇషాంత్‌ 7; వాట్లింగ్‌ (బి) షమి 1; గ్రాండ్‌హోమ్‌ ఎల్బీ (బి) షమి 13; జేమీసన్‌ (సి) బుమ్రా (బి) షమి 21; సౌథీ (బి) జడేజా 30; వాగ్నర్‌ (సి) రహానె (బి) అశ్విన్‌ 0; బౌల్ట్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 26 మొత్తం: (99.2 ఓవర్లలో ఆలౌట్‌) 249;

వికెట్ల పతనం: 1-70, 2-101, 3-117, 4-134, 5-135, 6-162, 7-192, 8-221, 9-234;

బౌలింగ్‌: ఇషాంత్‌ 25-9-48-3; బుమ్రా 26-9-57-0; షమి 26-8-76-4; అశ్విన్‌ 15-5-28-2; జడేజా 7.2-2-20-1

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ ఎల్బీ (బి) సౌథీ 30; శుభ్‌మన్‌ గిల్‌ ఎల్బీ (బి) సౌథీ 8; పుజారా బ్యాటింగ్‌ 12; కోహ్లి బ్యాటింగ్‌ 8; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (30 ఓవర్లలో 2 వికెట్లకు) 64;

వికెట్ల పతనం: 1-24, 2-51;

బౌలింగ్‌: సౌథీ 9-3-17-2; బౌల్ట్‌ 8-1-20-0; జేమీసన్‌ 10-4-15-0; వాగ్నర్‌ 3-0-8-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని