Sourav Ganguly: కోహ్లి మాట వినలేదు

టీమ్‌ఇండియా టీ20 జట్టు సారథ్యం నుంచి తప్పుకోవద్దని కోరినా విరాట్‌ కోహ్లి వినలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ తెలిపాడు. పరిమిత ఓవర్ల జట్లకు ఇద్దరు సారథులు ఉండటం సరికాదనే వన్డే పగ్గాలను రోహిత్‌శర్మకు అప్పగించినట్లు వివరించాడు. ‘‘టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోహ్లీకి విజ్ఞప్తి చేశాం.

Updated : 10 Dec 2021 15:21 IST

వద్దన్నా టీ20 సారథ్యం వదులుకున్నాడు
దిల్లీ

టీమ్‌ఇండియా టీ20 జట్టు సారథ్యం నుంచి తప్పుకోవద్దని కోరినా విరాట్‌ కోహ్లి వినలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ తెలిపాడు. పరిమిత ఓవర్ల జట్లకు ఇద్దరు సారథులు ఉండటం సరికాదనే వన్డే పగ్గాలను రోహిత్‌శర్మకు అప్పగించినట్లు వివరించాడు. ‘‘టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని కోహ్లీకి విజ్ఞప్తి చేశాం. కానీ సారథిగా కొనసాగేందుకు అతను విముఖత చూపించాడు. దీంతో రెండు పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు ఇద్దరు సారథులు ఉండటం సరికాదని సెలెక్టర్లు భావించారు’’ అని గంగూలీ చెప్పాడు. విరాట్‌ను వన్డే కెప్టెన్‌గా తప్పించాలన్నది   సెలక్టర్ల నిర్ణయమని అన్నాడు. ‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో బహుళ నాయకత్వం గందరగోళానికి దారితీస్తుందని నాకు తెలియదు. సెలెక్టర్లు అలా భావించారు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చారు. పరిమిత ఓవర్లకు రోహిత్‌.. టెస్టులకు విరాట్‌ సారథులుగా ఉండాలని నిర్ణయించారు’’ అని చెప్పాడు. వన్డే సారథ్యం నుంచి తప్పించడంపై సెలక్టర్లు, తాను కోహ్లితో మాట్లాడినట్లు తెలిపాడు. ‘‘రోహిత్‌ సారథ్యంపై ఇప్పుడే అంచనాకు రాలేం. అతనికి నా శుభాకాంక్షలు. రోహిత్‌ రాణించాలని కోరుకుంటున్నా. వన్డే సారథిగా కోహ్లీకి 70 శాతానికి పైగా విజయాల రికార్డు ఉన్న మాట నిజమే. దాన్ని మేం పరిగణలోకి తీసుకున్నాం. అయితే రోహిత్‌ టీమ్‌ఇండియాకు సారథ్యం వహించిన వన్డేల్లో అతని రికార్డు చాలా బాగుంది. ఏదేమైనా పరిమిత ఓవర్ల జట్లకు ఇద్దరు సారథులు ఉండకూడదు. సమావేశంలో చర్చించిన విషయాల్ని, సెలెక్టర్ల అభిప్రాయాల్ని పూర్తిగా వివరించలేను. కాని రోహిత్‌కు వన్డే సారథ్యం అప్పగించడానికి ఇదే ప్రాథమిక కారణం. కోహ్లి దానిని అంగీకరించాడు కూడా. ఈ విషయంపై కోహ్లీతో నేను, సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ చేతన్‌శర్మ మాట్లాడాం. బీసీసీఐ నిర్ణయాల్ని తెలియజేశాం’’ అని గంగూలీ  పేర్కొన్నాడు.

ఒకరోజు తర్వాత..!: టీమ్‌ఇండియా వన్డే జట్టు సారథ్యం నుంచి విరాట్‌ కోహ్లీని తప్పించిన బీసీసీఐ ఒకరోజు తర్వాత అతని సేవల్ని గుర్తించింది! వన్డే కెప్టెన్‌గా రోహిత్‌శర్మను నియమిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ.. అందులో కోహ్లి ప్రస్తావనే తేలేదు. వన్డే సారథిగా 70కి పైగా విజయాల శాతమున్న కోహ్లి పట్ల బీసీసీఐ అమర్యాదకరంగా వ్యవహరించిందంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వ్యక్తమవడంతో గురువారం ట్విటర్‌ వేదికగా బోర్డు స్పందించింది. ‘‘ధైర్యం, పట్టుదల, అంకితభావంతో జట్టును నడిపించిన నాయకుడు విరాట్‌ కోహ్లీకి ధన్యవాదాలు’’ అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది. వన్డేల్లో కోహ్లి అసాధారణ ఇన్నింగ్స్‌ గురించి కూడా ట్విటర్‌లో ప్రస్తావించింది. కోహ్లి సారథ్యంలో టీమ్‌ఇండియా 95 వన్డేల్లో 65 మ్యాచ్‌ల్లో నెగ్గింది. 70.43 విజయాల శాతంతో టీమ్‌ఇండియాకు కోహ్లి అత్యుత్తమగా కెప్టెన్‌గా వ్యవహరించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని