Nadal Djokovic Federer : ఎవరు గొప్ప?

టెన్నిస్‌ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాడెవరు? ఈ చర్చ ఎప్పట్నుంచో ఉంది. ఇప్పుడు మరోసారి అది ఊపందుకుంది. ఫెదరర్‌, జకోవిచ్‌లను దాటేస్తూ నాదల్‌ 21వ గ్రాండ్‌స్లామ్‌తో చరిత్ర సృష్టించడంతో ‘ఎవరు గొప్ప’ అన్నది మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Updated : 01 Feb 2022 09:53 IST

ఈనాడు క్రీడావిభాగం

టెన్నిస్‌ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాడెవరు? ఈ చర్చ ఎప్పట్నుంచో ఉంది. ఇప్పుడు మరోసారి అది ఊపందుకుంది. ఫెదరర్‌, జకోవిచ్‌లను దాటేస్తూ నాదల్‌ 21వ గ్రాండ్‌స్లామ్‌తో చరిత్ర సృష్టించడంతో ‘ఎవరు గొప్ప’ అన్నది మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరి దిగ్గజ త్రయంలో ఎవరెలా కెరీర్‌ను ముగించబోతున్నారు? ఎవరి  ఘనతలేంటి?ఆటలో ఎవరు మేటి?


నాదల్‌ ఎక్కడిదాకా?

దిగ్గజ త్రయంలో పోరాట తత్వంలో మిగతా ఇద్దరినీ వెనక్కి నెట్టేస్తాడు రఫెల్‌ నాదల్‌. కెరీర్లో ఎన్నోసార్లు అతణ్ని గాయాలు వేధించాయి. రెండు మూడు సందర్భాల్లో ఇక ఆడటం కష్టమే, కెరీర్‌ ముగిసినట్లే అన్న వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి. అయినా అతను పోరాటాన్ని ఆపలేదు. కెరీర్‌నే  ప్రమాదంలోకి నెట్టి మోకాలి గాయాన్ని అధిగమించి మైదానంలోకి అడుగు పెట్టాడు. కొన్ని నెలల నుంచి పాదం గాయం అతణ్ని ఎంతగా ఇబ్బంది పెడుతోందో తెలిసిందే. నిరుడు రెండు గ్రాండ్‌స్లామ్‌లకు దూరమై, ఈ ఏడాది కూడా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు అతి కష్టం మీద వచ్చి.. ప్రత్యర్థులతో అసాధారణంగా పోరాడి టైటిల్‌ ఎగరేసుకుపోయాడతను. ముఖ్యంగా ఫైనల్లో తొలి రెండు సెట్లు ఓడిపోయి కూడా ట్రోఫీని అందుకోవడం నాదల్‌ పోరాట తత్వానికి నిదర్శనం. ఫెదరర్‌కు కూడా సాధ్యం కాని విధంగా, జకోవిచ్‌తో సమానంగా ప్రతి గ్రాండ్‌స్లామ్‌నూ అతను కనీసం రెండుసార్లు గెలిచాడు. నాదల్‌ ఫామ్‌, ఫిట్‌నెస్‌ ప్రకారం చూస్తే అతను ఫెదరర్‌, జకోవిచ్‌లను వెనక్కి నెట్టి అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల వీరుడిగా నిలుస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. తన కంచుకోట అయిన రోలాండ్‌ గారోస్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే.. వేరే కోర్టుల్లోనూ అవకాశం దొరికినపుడల్లా టైటిళ్లు గెలుస్తూ అనూహ్యంగా 21వ టైటిల్‌ను చేరుకున్నాడు. అయితే జకోవిచ్‌ లాగా నాదల్‌  ‘ఆల్‌రౌండర్‌’ అనిపించుకోలేదు. ఇటు హార్డ్‌ కోర్టులో, అటు గ్రాస్‌ కోర్టులో అతడిది ఓ మోస్తరు ప్రదర్శనే. వింబుల్డన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ల్లో రెండు చొప్పునే టైటిళ్లు గెలిచాడు. యుఎస్‌ ఓపెన్‌లో నాలుగుసార్లు విజేతగా   నిలిచాడు. మట్టి కోర్టుపై టెన్నిస్‌ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆధిపత్యం చలాయించడం ద్వారా అతను తన టైటిళ్ల సంఖ్యను పెంచుకోగలిగాడు. మొత్తం 21 గ్రాండ్‌స్లామ్స్‌లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లే 13. అతను ఇంకా ఒకటో రెండో ఫ్రెంచ్‌ ఓపెన్‌లు గెలిచే అవకాశాలను కొట్టిపారేయలేం. వేరే టైటిళ్లు గెలవాలంటే మాత్రం అసాధారణంగా ఆడాల్సిందే. కెరీర్లో నాదల్‌ ప్రత్యర్థుల నుంచి చాలా పోటీనే ఎదుర్కొన్నాడు. ఫెదరర్‌, జకోవిచ్‌, ముర్రే సహా అగ్రశ్రేణి ఆటగాళ్లు చాలామందితో తలపడి ఇప్పుడు ‘ఆల్‌ టైం గ్రేట్‌’ అయ్యాడు. ఓవరాల్‌గా నాదల్‌ అత్యధిక టైటిళ్ల జాబితాలో రెండో స్థానంతో ముగిస్తాడని అంచనా. అయితే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సాగించిన ఆధిపత్యంతో, మిగతా గ్రాండ్‌స్లామ్‌ల్లో అసాధారణ పోరాట తత్వంతో గెలిచిన విజయాలతో నాదల్‌ ఎప్పటికీ గుర్తుండిపోతాడనడంలో సందేహం లేదు.


ఫెదరర్‌ ఆగిపోయినా..

రోజర్‌ ఫెదరర్‌ నాలుగేళ్ల కిందట 20వ గ్రాండ్‌స్లామ్‌ అందుకున్నప్పటికి నాదల్‌ 14, జకోవిచ్‌ 12 టైటిళ్లతో ఉన్నారు. ఫెదరర్‌ అక్కడితో ఆగిపోతాడని.. మిగతా ఇద్దరూ అతణ్ని అందుకుంటారని చాలామంది ఊహించలేదు. అతనే అత్యధిక టైటిళ్ల వీరుడిగా నిలిచిపోతాడని అనుకున్నారు. కానీ 2018 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తర్వాత రోజర్‌ ఒక్క టైటిలూ గెలవలేకపోయాడు. ఆపై అతను 2019 వింబుల్డన్‌ మినహా ఏ గ్రాండ్‌స్లామ్‌లోనూ ఫైనల్‌కు కూడా రాలేకపోయాడు. అతడి పోటీ నామమాత్రంగా ఉంటోంది. ఇక ఫెదరర్‌ ఇంకో టైటిల్‌ కొడతాడన్న ఆశలు అతడి అభిమానుల్లో సహా ఎవరిలోనూ లేవు. బహుశా ఫెదరర్‌ కూడా ఆ ఆశతో ఉండకపోవచ్చు. అత్యధిక టైటిళ్ల జాబితాలో అతను మూడో స్థానంలో స్థిరపడిపోవాల్సిందేనేమో! అయినప్పటికీ ఫెదరర్‌ గొప్పదనం ఎంతమాత్రం తగ్గదు. అతడి ఆటలో ఉన్న సొగసును మరే ఆటగాడిలోనూ చూడలేం! ముఖ్యంగా ఫెదరర్‌ మార్కు స్క్వాష్‌ తరహా ఫోర్‌ హ్యాండ్‌ షాట్‌ అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఇక పచ్చికలో రోజర్‌ విన్యాసాల గురించి ఏమని వర్ణించాలి. గ్రాండ్‌స్లామ్‌లకే గ్రాండ్‌స్లామ్‌ అనదగ్గ వింబుల్డన్‌లో అతను సాగించిన ఆధిపత్యం  ఇంకెవరికీ సాధ్యం కాదు. అక్కడ ఏకంగా 12సార్లు ఫైనల్‌ ఆడి 8 టైటిళ్లు  గెలిచాడు ఫెదరర్‌. హార్డ్‌ కోర్టుల్లోనూ (ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 6, యుఎస్‌ ఓపెన్‌ 5) బాగానే ఆధిపత్యం చలాయించిన రోజర్‌కు మట్టి కోర్టులో మాత్రం అంత మంచి రికార్డేమీ లేదు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో 5 ఫైనల్స్‌ ఆడి, ఒక్క టైటిలే గెలిచాడు. అది కూడా నాదల్‌ మధ్యలోనే నిష్క్రమించిన 2009 టోర్నీలో. అయితే ఫెదరర్‌ కెరీర్‌లో ఊపందుకున్నప్పటి నుంచి కఠినమైన ప్రత్యర్థులతోనే తలపడుతూ వచ్చాడు. ముందు తరం దిగ్గజాలు సంప్రాస్‌, అగస్సీలతో పాటు.. ఆ తర్వాత నాదల్‌, జకోవిచ్‌, ముర్రేల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొని అద్భుత విజయాలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇప్పుడు వయసు, ఫిట్‌నెస్‌ సమస్యలతో వెనకబడ్డప్పటికీ.. అతడి గౌరవం తగ్గిపోదు. ఆటతో పాటు తన హుందాతనంతో ఎంతో ఎత్తులో నిలుస్తాడు ఫెదరర్‌. అందుకే టెన్నిస్‌ అభిమానుల్లో అత్యధికులు అతణ్నే ‘ఆల్‌ టైం గ్రేట్‌’గా పరిగణిస్తారు.


జకో వదులుతాడా?

ప్పుడు నాదల్‌ మిగతా ఇద్దరి కంటే ముందు 21వ టైటిల్‌ అందుకుని.. అగ్రస్థానానికి చేరుకుని ఉండొచ్చు. కానీ ఆ స్థానంలో అతణ్ని జకోవిచ్‌ ఉండనిస్తాడా అన్నది సందేహం. బిగ్‌-3లో తక్కువ వయసు, ఎక్కువ ఫిట్‌నెస్‌ ఉన్నది అతడికే. ఫామ్‌ పరంగా చూసుకున్నా మిగతా ఇద్దరి కంటే మెరుగ్గా ఉన్నాడు. అతను ఇంకో అయిదు టైటిళ్ల దాకా గెలవగలడన్నది విశ్లేషకుల అంచనా. ప్రస్తుత ఆటగాళ్లందరిలో ఏ కోర్టులో అయినా ఆధిపత్యం చలాయించగల పరిపూర్ణ ఆటగాడిగా అతణ్ని పేర్కొంటున్నారు మాజీలు. టైటిళ్ల విషయంలో ఫెదరర్‌ నుంచి 34 ఏళ్ల జకోవిచ్‌కు అసలు ముప్పే లేదన్నది స్పష్టం. నాదల్‌ కూడా వయసు ప్రభావం, ఫిట్‌నెస్‌ సమస్యలతో కెరీర్‌ చరమాంకానికి వచ్చేసినట్లే కనిపిస్తున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సైతం నాదల్‌ ఆధిపత్యం మునుపటిలా సాగే అవకాశాలు   కనిపించట్లేదు. ఇక జకోవిచ్‌ బరిలో ఉంటే.. అతణ్ని దాటి వేరే టైటిళ్లు గెలవడమూ కష్టమే. నిజానికి అత్యధిక టైటిళ్ల ఘనతను నాదల్‌ కంటే ముందు జకోవిచే అందుకోవాల్సింది. అతను    చేజేతులా రెండు టైటిళ్లను పోగొట్టుకున్నాడు. 2020 యుఎస్‌ ఓపెన్‌లో లైన్‌ అంపైర్‌కు బంతిని కొట్టినందుకు అతడిపై వేటు వేసి సాగనంపేశారు.   ఇప్పుడేమో వీసా సమస్యతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడలేకపోయాడు. ఫామ్‌ ప్రకారం చూస్తే కచ్చితంగా ఈ రెండు టైటిళ్లూ అతడి ఖాతాలో చేరి ఇప్పుడతను 22 గ్రాండ్‌స్లామ్‌లతో ఉండాల్సింది. అయినా సరే.. వయసు, ఫామ్‌, ఫిట్‌నెస్‌.. ఇలా ఏ కోణంలో చూసుకున్నా ఇకపై మిగతా ఇద్దరి కంటే ఎక్కువ టైటిళ్లు గెలిచి ‘ఆల్‌టైం గ్రేట్‌’గా నిలిచిపోవడానికి జకోవిచ్‌కే అవకాశాలు ఎక్కువ. వివిధ కోర్టుల్లో ప్రదర్శన పరంగా చూస్తే.. అతనెక్కువగా హార్డ్‌ కోర్టుల్లో ఆధిపత్యం చలాయించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రికార్డు స్థాయిలో 9 టైటిళ్లు గెలిచాడు. యుఎస్‌ ఓపెన్‌ మూడుసార్లు నెగ్గాడు. పచ్చికలోనూ జకోవిచ్‌కు మెరుగైన రికార్డుంది. వింబుల్డన్‌ ఆరుసార్లు కైవసం చేసుకున్నాడు. మట్టి కోర్టులో నాదల్‌ ముందు అతనూ నిలవలేడు. కానీ..  ఫెదరర్‌తో పోలిస్తే అతడి రికార్డు మెరుగు. ఆరుసార్లు ఫైనల్‌ చేరి రెండుసార్లు విజేతగా నిలిచాడు. ప్రత్యర్థులతో పోటీ విషయంలో జకోవిచ్‌కు పరిస్థితులు కలిసొచ్చినట్లే. ఫెదరర్‌, నాదల్‌ జోరుమీదుండగా.. జకోవిచ్‌ నిలకడగా టైటిళ్లు గెలవలేకపోయాడు. వయసు ప్రభావంతో ఫెదరర్‌,  ఫిట్‌నెస్‌ సమస్యలతో నాదల్‌ జోరు తగ్గాకే అతడి ఆధిపత్యం మొదలైంది. వేరే ఆటగాళ్ల నుంచి అతడికి పెద్దగా సవాళ్లు ఎదురు కాలేదు. అత్యధిక టైటిళ్ల విజేతగా నిలిచినా.. ఇది అతడి గొప్పదనాన్ని కొంచెం తగ్గించేదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని