రూడ్‌కు షాక్‌

వింబుల్డన్‌లో సంచలనం. ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌, మూడో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ కథ రెండో రౌండ్లోనే ముగిసింది. ఫ్రాన్స్‌కు చెందిన అన్‌సీడెడ్‌ హంబర్ట్‌ అతడికి షాకిచ్చాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. వైల్డ్‌కార్డుతో టోర్నీలో

Published : 30 Jun 2022 02:35 IST
హంబర్ట్‌ చేతిలో ఓటమి
మూడో రౌండ్లో జకోవిచ్‌
కొంటావీట్‌ ఔట్‌

వింబుల్డన్‌లో సంచలనం. ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌, మూడో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ కథ రెండో రౌండ్లోనే ముగిసింది. ఫ్రాన్స్‌కు చెందిన అన్‌సీడెడ్‌ హంబర్ట్‌ అతడికి షాకిచ్చాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌ మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. వైల్డ్‌కార్డుతో టోర్నీలో అడుగుపెట్టిన సెరెనా విలియమ్స్‌ మొదటి రౌండ్‌నే దాటలేకపోయింది. రెండో సీడ్‌ కొంటావీట్‌ను నైమియర్‌ ఇంటిముఖం పట్టించింది.

లండన్‌

సంచలన ప్రదర్శనతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరిన కాస్పర్‌ రూడ్‌ (నార్వే) వింబుల్డన్‌లో బోల్తా కొట్టాడు. రెండో రౌండ్‌నే దాటలేకపోయాడు. బుధవారం జరిగిన పోరులో రూడ్‌ 6-3, 2-6, 5-7, 4-6తో హంబర్ట్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయాడు. హంబర్ట్‌ 10 ఏస్‌లు, 53 విన్నర్లు కొట్టాడు. రూడ్‌ ఏకంగా తొమ్మిది డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. మరోవైపు ఆరుసార్లు ఛాంపియన్‌, టాప్‌ సీడ్‌ జకోవిచ్‌ (సెర్బియా) మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్లో అతడు 6-1, 6-4, 6-2తో కొకినాకిస్‌ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో స్టీవ్‌ జాన్సన్‌ (అమెరికా) 6-3, 6-2, 6-4తో పెనిస్టన్‌ (బ్రిటన్‌)పై, గొఫిన్‌ (బెల్జియం) 6-1, 6-2, 6-4తో బయేజ్‌ (అర్జెంటీనా)పై, తియోఫె (అమెరికా) 6-2, 6-2, 7-6 (7-3)తో మర్టెరర్‌ (జర్మనీ)పై విజయం సాధించారు. తొలి సెట్లోనే ప్రత్యర్థి హారిసన్‌ గాయంతో రిటైర్‌ కావడంతో ఒట్టె (జర్మనీ) ముందంజ వేశాడు.

నిష్క్రమించిన సెరెనా: గాయం కారణంగా దాదాపు ఏడాదిపాటు ఆటకు దూరమై, ఇటీవలే పునరాగమనం చేసిన సెరెనా విలియమ్స్‌ కథ తొలి రౌండ్లోనే ముగిసింది. సుదీర్ఘ విరామం వచ్చిన నేపథ్యంలో ఆమె లయను అందుకోలేకపోయింది. 115వ ర్యాంకు క్రీడాకారిణి హర్మోని తాన్‌ (ఫ్రాన్స్‌) 7-5, 1-6, 7-6 (10-7)తో సెరెనాపై విజయం సాధించింది. 3 గంటల 11 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సెరెనా అయిదు ఏస్‌లు కొట్టింది. మూడు డబుల్‌ ఫాల్ట్‌లు, 54 అనవసర తప్పిదాలు చేసింది. మూడు ఏస్‌లు, 29 విన్నర్లు కొట్టిన తాన్‌, 28 అనవసర తప్పిదాలు మాత్రమే చేసింది. ‘‘నిరుటి కంటే బాగానే ఆడాను’’ అని మ్యాచ్‌ అనంతరం సెరెనా వ్యాఖ్యానించింది. మీకిదే చివరి వింబుల్డన్‌ మ్యాచ్‌ అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు.. ‘‘ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. నాకే తెలియదు.. ముందు ముందు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు?’’ అని బదులిచ్చింది. మరోవైపు రెండో సీడ్‌ అనెట్‌ కొంటావీట్‌ (ఎస్తోనియా)కు షాక్‌ తగిలింది. రెండో రౌండ్లో ఆమె 4-6, 0-6తో నైమియర్‌ (జర్మనీ) చేతిలో పరాజయంపాలైంది. ఆరో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌) మూడో రౌండ్లో ప్రవేశించింది. హోరాహోరీగా సాగిన రెండో రౌండ్లో ఆమె 7-6 (7-1), 7-5తో తన దేశానికే చెందిన మార్టిన్‌కోపై విజయం సాధించింది. మ్యాచ్‌లో ప్లిస్కోవా ఏడు ఏస్‌లు, 29 విన్నర్లు కొట్టింది. మరో రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ పెగులా (అమెరికా) 6-3, 7-6 (7-2)తో వెకిచ్‌ (క్రొయేషియా)ను ఓడించింది. సురెంకో (ఉక్రెయిన్‌), జాంగ్‌ (చైనా) కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నారు. సురెంకో 3-6, 6-4, 6-3తో కలిని (ఉక్రెయిన్‌)పై నెగ్గగా.. జాంగ్‌ 7-6 (8-6), 6-2తో కోస్త్యుక్‌ (ఉక్రెయిన్‌)ను ఓడించింది. తొమ్మిదో సీడ్‌ ముగురుజ (స్పెయిన్‌) 4-6, 0-6తో మినెన్‌ (బెల్జియం) చేతిలో కంగుతింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని