అక్టోబర్‌ 9లోపు హాకీ ఇండియాకు ఎన్నికలు

హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఎన్నికల ప్రక్రియ అక్టోబర్‌ 9వ తేదీ లోపు పూర్తి కానుందని పాలకుల కమిటీ (సీఓఏ), అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) బుధవారం ఉమ్మడి ప్రకటనలో వెల్లడించాయి. హాకీ ఇండియాకు ఎన్నికల నిర్వహణ, కొత్త నియమావళి

Published : 18 Aug 2022 02:27 IST

దిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఎన్నికల ప్రక్రియ అక్టోబర్‌ 9వ తేదీ లోపు పూర్తి కానుందని పాలకుల కమిటీ (సీఓఏ), అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) బుధవారం ఉమ్మడి ప్రకటనలో వెల్లడించాయి. హాకీ ఇండియాకు ఎన్నికల నిర్వహణ, కొత్త నియమావళి కోసం దిల్లీ హై కోర్టు ముగ్గురు సభ్యులతో సీఓఏను నియమించిన సంగతి తెలిసిందే. దీంతో హాకీ ఇండియాపై ఎఫ్‌ఐహెచ్‌ నిషేధం విధించే ప్రమాదం రాకుండా అవసరమైన చర్యలను సీఓఏ వేగవంతం చేసింది. హెచ్‌ఐ నూతన నియమావళి తొలి ముసాయిదాను ఎఫ్‌ఐహెచ్‌కు సమర్పించిన సీఓఏ.. వచ్చే పది రోజుల్లోపు తుది ముసాయిదాను అందజేస్తామని తెలిపింది. ‘‘దిల్లీ హై కోర్టు ఆదేశాల ప్రకారం హెచ్‌ఐ కొత్త నియమావళి తొలి ముసాయిదాను ఎఫ్‌ఐహెచ్‌కు సమర్పించారు. వచ్చే పది రోజుల్లోపు సీఓఏ, హెచ్‌ఐ తుది ముసాయిదాను అందజేస్తాయి. అక్టోబర్‌ 9 లోపు హెచ్‌ఐ ఎన్నికల ప్రక్రియ ముగించాలని పరస్పర నిర్ణయం తీసుకున్నాం’’ అని ఎఫ్‌ఐహెచ్, సీఓఏ ఆ ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. సీఓఏతో ఎఫ్‌ఐహెచ్‌ తాత్కాలిక అధ్యక్షుడు సీఫ్‌ అహ్మద్, సీఈవో థీరీ వీల్‌ సమావేశం తర్వాత ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ పరిణామంలో కోర్టును బయటి వర్గంగా భావించడం లేదని అహ్మద్‌ తెలిపాడు. ‘‘ఈ సమావేశం చాలా సానుకూలంగా, ప్రోత్సాహకరంగా సాగింది. భారత్‌లో హాకీ కార్యకలాపాలను కొనసాగించడం దిశగా కీలకమైన అడుగులు వేయడంపై ఇరు వర్గాలు అంగీకరించాయి’’ అని సీఓఏ సభ్యుడైన మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అనిల్‌ రమేష్‌ దవె పేర్కొన్నారు. 


బ్రెజిల్, అర్జెంటీనా మ్యాచ్‌ రద్దు

బ్రెజిల్, అర్జెంటీనా మధ్య జరగాల్సిన ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ను ఫిఫా రద్దు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో అర్జెంటీనా ఆటగాళ్లు కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారని ఈ మ్యాచ్‌ ప్రారంభమైన తర్వాత ఆపేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్లు ప్రపంచకప్‌నకు అర్హత సాధించడంతో ఈ మ్యాచ్‌ ఆడబోమని, అందుకు జరిమానా చెల్లిస్తామని చెప్పాయి. కానీ అందుకు మొదట ఫిఫా ఒప్పుకోలేదు. వచ్చే నెలలో ఈ మ్యాచ్‌ నిర్వహించాలని అనుకుంది. కానీ బ్రెజిల్, అర్జెంటీనా ఫుట్‌బాల్‌ సమాఖ్యలు క్రీడా ఆర్బిట్రేషన్‌ కోర్టును ఆశ్రయించడంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేసేందుకు ఫిఫా అంగీకరించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని